క్రీడాభూమి

అమలుకాని వ్యూహాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 22: విదేశాల్లో ఆస్ట్రేలియా గత పది మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను ఎదుర్కోవడం ఆ జట్టు పతనానికి నిదర్శనం. మ్యాచ్‌లకు ముందు వేసుకున్న వ్యూహాలుగానీ, తీసుకున్న నిర్ణయాలుగానీ సక్రమంగా అమలు కావడం లేదని భారత్‌తో జరిగిన రెండు వనే్డలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా అంగీకరిస్తున్నాడు. ఎన్ని ప్రణాళికలను, ఆచరణ యోగ్యమైన వ్యూహాలను సిద్ధంచేసుకున్నప్పటికీ, మైదానంలోకి దిగిన తర్వాత వాటి అమలు చాలా కష్టంగా మారిందని వాపోతున్న అతను ఈ సిరీస్‌లో మిగతా మూడు వనే్డల్లో ఏ విధంగా ఆడాలో అర్థంగాక దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాడు. నిజానికి 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఆసీస్ వంటి జట్టుకు ఏమాత్రం కష్టం కాదు. కానీ, ఆ జట్టు అన్ని విధాలా విఫలమై, ఓటమిని కొనితెచ్చుకుంది. ఆటగాళ్ల నిర్లక్ష్యమో లేక భారత బౌలర్ల ప్రతిభో తెలియదుగానీ స్మిత్ సేన దారుణంగా విఫలమైంది. చివరి ఎనిమిది వికెట్లను కేవలం 112 పరుగుల తేడాలో చేజార్చుకుందంటే, ఆ జట్టు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోవడంతో, ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. వికెట్లు ఈ విధంగా కుప్పకూలడం ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు శాపంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతున్నదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగితంపై చూస్తే, ఆస్ట్రేలియా బలమైన జట్టుగానే కనిపిస్తున్నది. కీలక బౌలర్లు లేకపోయినా, ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్న వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మైదానంలోకి దిగిన తర్వాత ఎందుకు నిలదొక్కుకోలేక పోతున్నదో, టీమిండియా ముందు ఎందుకు మోకరిల్లుతున్నదో ఎంతకీ అంతుబట్టడం లేదు. ఫలానా అని కారణం చెప్పలేనని, అన్ని రకాలుగానూ తాము విఫలమయ్యామని కెప్టెన్ స్మిత్ స్వయంగా అంగీకరించాడు. వ్యూహాలు వేరు.. వాటి అమలు వేరు అన్న విషయం అతనికి ఇప్పటికైనా తెలిసొచ్చిందేమో! తాను ఎంతగా పోరాడినప్పటికీ, మార్కస్ స్టొయినిస్ తప్ప ఇతరులు ఎవరూ అనుకున్నట్టు ఆడలేకపోవడం స్మిత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. పొరపాటు ఎక్కడ జరుగుతున్నదో అతనికి తెలియడం లేదు. చెన్నైలో వర్షం కారణంగా మారిన పిచ్ పరిస్థితి, మ్యాచ్‌ని 21 ఓవర్లకు కుదించడం వంటి అంశాలు మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపాయని సర్ది చెప్పుకోవచ్చు. తప్పును వర్షంపై, వాతావరణ పరిస్థితులపై నెట్టేయ్యచ్చు. కానీ, కోల్‌కతాలో ఆ స్థాయిలో సమస్యలు ఎదురుకాలేదు. వర్షం కారణంగా కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్పడినప్పటికీ, ఓవర్లను కుదించలేదు. పైగా, భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో, మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంది. భారత బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగింది. అయితే, బౌలింగ్‌లో చూపిన పోరాట పటిమను బ్యాటింగ్ విభాగంలో కనబరచలేకపోయింది. బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో, స్మిత్‌తోపాటు స్టొయినిస్ పోరాటం కూడా వృథా అయింది. భారత బౌలింగ్‌ను, ప్రత్యేకించి స్పిన్‌ను ఆసీస్ బ్యాట్స్‌మెన్ సక్రమంగా ఎదుర్కోలేరన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించగా, యుజువేంద్ర చాహల్ రెండు వికెట్లు కూల్చారు కాబట్టి ఈ వాదన నిజమే అని అనుకోవచ్చు. అయితే, అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కేవలం తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. మీడియం పేసర్ హార్దిక్ పాండ్యకు రెండు వికెట్లు దక్కాయి. అంటే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్పిన్‌కేకాదు.. పేస్‌కు కూడా ఒకే స్థాయిలో భయపడ్డారు. ఏక మొత్తంగా భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా సరైన దిశగా చర్యలు తీసుకోకపోతే, మిగతా మూడు వనే్డల్లోనూ ఆసీస్‌కు పరాభవం తప్పకపోవచ్చు.

చిత్రం.. స్టీవ్ స్మిత్