క్రీడాభూమి

తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అండర్-17 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశ హోదాలో మెయిన్‌డ్రాకు అర్హత సంపాదించిన భారత్ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. పటిష్టమైన అమెరికాను ఢీకొన్న ఈ జట్టు 0-3 తేడాతో ఓడింది. మ్యాచ్ ప్రారంభం నుంచే అమెరికా క్రీడాకారులు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటూ, భారత్‌పై ఒత్తిడి పెంచారు. ఈ స్థాయి పోటీల్లో మొదటిసారి ఆడుతున్న భారత్ దాడులకు ఉపక్రమించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 30వ నిమిషంలో జొష్ సార్జెంట్ అమెరికా గోల్స్ ఖాతా తెరిచాడు. తనకు లభించిన పెనాల్టీని అతను సద్వినియోగం చేసుకున్నాడు. సార్జెంట్ గోల్‌తో కంగుతిన్న భారత్ జాగ్రత్తగా ఆడడంతో, ప్రథమార్ధం పూర్తయ్యేలోగా అమెరికా గోల్ చేయలేకపోయింది.
ద్వితీయార్ధంలో అమెరికాను నిలువరించడంపైనే దృష్టి కేంద్రీకరించిన భారత జట్టు గోల్స్ కోసం ఎక్కువగా ప్రయత్నించలేదు. ఒకటిరెండు సార్లు గోల్స్ చేసే అవకాశాలను చేజిక్కించుకున్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోలేదు. భారత్‌పై ఒత్తిడి పెరగడాన్ని గమనించిన అమెరికా దాడికి దిగింది. 51వ నిమిషంలో క్రిస్ట్ఫోర్ డర్కిన్ ఆ జట్టుకు రెండో గోల్‌ను అందించాడు. 84వ నిమిషంలో ఆండ్రీ కార్ల్‌టన్ ద్వారా అమెరికాకు మూడో గోల్ లభించింది. భారత్ ఒక్క గోల్‌ను కూడా సాధించలేకపోయింది. అయితే, ప్రపంచ కప్ స్థాయి పోటీలు ఏ విధంగా జరుగుతాయనే విషయంలో యువ ఆటగాళ్లు తప్పక పాఠాలు నేర్చుకొని ఉంటారు.
ఘనా శుభారంభం
గతంలో రెండు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఘనా ఈసారి అండర్-17 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కొలంబోను 1-0 తేడాతో ఓడించింది. మ్యాచ్ 30వ నిమిషంలో సాదిక్ ఇబ్రహీం గోల్ చేసి, ఘనాను ఆధిక్యంలో నిలిపాడు. ఆతర్వాత వ్యూహాత్మక రక్షణ విధానాన్ని అనుసరించిన ఘనా తన ప్రత్యర్థి కొలంబోకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ని ముగించింది.
నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో గ్రూప్ ‘బి’లో జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్, టర్కీ చెరొక గోల్‌తో సంతృప్తి చెందాయి. మ్యాచ్ 18వ నిమిషంలో టర్కీ ఆటగాడు అహ్మద్ కుటుకూ గోల్ చేశాడు. ప్రథమార్ధం ముగిసేలోగా మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ టర్కీ డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చింది. అయితే, 58వ నిమిషంలో ఈ రక్షణ వలయాన్ని దాటుకొని ముందుకు దూసుకెళ్లిన మాక్స్ మటా న్యూజిలాండ్ తరఫున ఈక్వెలైజర్‌ను సాధించాడు. అనంతరం ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో, మ్యాచ్ డ్రాగా అయింది.
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో మాలీని పరాగ్వే 3-2 తేడాతో ఓడించింది. మ్యాచ్ 12వ నిమిషంలో ఆంటానియో గాలొయానో, 17వ నిమిషంలో లియోనార్డో సాంచెజ్ ద్వారా పరాగ్వేకు రెండు గోల్స్ లభించాయి. అయితే, ప్రత్యర్థి రెండు గోల్స్ చేసినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా మాలీ ఎదురుదాడి చేసింది. ఫలితంగా 20వ నిమిషంలో హద్‌జీ డ్రేమ్, 34వ నిమిషంలో లాసనా నియాయే గోల్స్ చేయగలిగారు. స్కోరు సమయమైన తర్వాత ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ద్వితీయార్ధం ప్రారంభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఈ డెడ్‌లాక్‌ను ఛేదిస్తూ, 55వ నిమిషంలో పరాగ్వే ఆటగాడు అలాన్ రోడ్రిగెజ్ గోల్ చేశాడు. అనంతరం మాలీకి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా పరాగ్వే మ్యాచ్‌ని ముగించింది.
*

నేటి మ్యాచ్‌లు
సాయంత్రం 5 గంటలకు: జర్మనీ/ కోస్టారిగా (మార్గోవాలోని ఫటోర్డా స్టేడియంలో), బ్రెజిల్/ స్పెయిన్ (కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో).
రాత్రి 8 గంటలకు: ఇరాన్/ గునియా (మార్గోవాలోని ఫటోర్డా స్టేడియంలో), ఉత్తర కొరియా/ నిగర్ (కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో).
*

చిత్రం..అమెరికాకు తొలి గోల్‌ను అందించిన జొష్ సార్జెంట్