క్రీడాభూమి

బెహ్రెన్‌డార్ఫ్ ధాటికి టీమిండియా చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 10: భారత పర్యటనలో వరుస పరాజయాలతో డీలా పడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జూలు విదిల్చింది. మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి బర్సపరా స్టేడియంలో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో కోహ్లీ సేనను మట్టికరిపించి చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంతో పాటు 1-1తో సిరీస్‌ను సమం చేసింది. భారత జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమష్టిగా విఫలమవడమే ఈ ఓటమికి కారణం. ఈ మ్యాచ్‌లో ఆసీస్ యువ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 21 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకుని టీమిండియా పతనాన్ని శాసించగా, ఆ తర్వాత ట్రవిస్ హెడ్ 34 బంతుల్లో 48 పరుగులు, మోజెస్ హెన్రిక్స్ (46 బంతుల్లో 62 పరుగులతో రాణించి తమ జట్టు విజయానికి చేదోడు వాదోడుగా నిలిచారు. టీమిండియాతో ఆడిన ఎనిమిది టి-20 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకి ఇదే తొలి విజయం. ఇక ఈ సిరీస్‌లో చివరిదైన నిర్ణాయక మ్యాచ్ శుక్రవారం హైదరాబాద్‌లో జరుగనుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుపై బెహ్రెన్‌డార్ఫ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. అతని జోరును ప్రతిఘటించలేక ఓపెనర్ రోహిత్ శర్మ (4 బంతుల్లో 8 పరుగులు)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (0), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే (7 బంతుల్లో 6 పరుగులు), నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6 బంతుల్లో 2 పరుగులు) వరుసగా పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత జట్టు 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో కేదార్ జాదవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఎంతోసేపు కొనసాగలేదు. 33 పరుగులు జోడించిన తర్వాత ధోనీ (16 బంతుల్లో 13 పరుగులు) ఆడమ్ జంపా బౌలింగ్‌లో వికెట్ల వెనుక టిమ్ పైన్ చేతికి చిక్కగా, కేదార్ జాదవ్ (27 బంతుల్లో 27 పరుగులు) కూడా జంపా బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతని స్థానంలో వచ్చిన భువనేశ్వర్ కుమార్ (1) ఆసీస్ స్పిన్నర్ నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో మోజెస్ హెన్రిక్స్ చేతికి చిక్కడంతో భారత జట్టు కేవలం 10 పరుగుల వ్యవధిలోనే మరో 3 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 25 పరుగులు సాధించి మార్కస్ స్టొయినిస్ బౌలింగ్‌లో డిటి.క్రిస్టియన్ (సబ్‌స్టిట్యూట్ ఆటగాడు)కు క్యాచ్ ఇవ్వగా, జస్‌ప్రీత్ బుమ్రా 9 బంతుల్లో 7 పరుగులు సాధించి రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 19 బంతుల్లో 16 పరుగులు సాధించి ఆండ్రూ టై బౌలింగ్‌లో టిమ్ పైన్ చేతికి చిక్కగా, రెండు బంతులను ఎదుర్కొని 3 పరుగులు సాధించిన యుజ్వేంద్ర చాహాల్ నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది.
ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 21 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకోగా, ఆడమ్ జంపా 2 వికెట్లు, మారస్కస్ స్టొయినిస్, నాథన్ కౌల్టర్ నీల్, ఆండ్రూ టై ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు.
అనంతరం 119 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరంభంలో ఇబ్బందులు పడింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (5 బంతుల్లో 2 పరుగులు)తో పాటు ఓపెనర్ ఆరోన్ ఫించ్ (8 బంతుల్లో 8 పరుగులు) స్వల్ప స్కోర్లకే నిష్క్రమించడంతో ఆ జట్టు 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ మోజెస్ హెన్రిక్స్, ట్రవిస్ హెడ్ క్రీజ్‌లో నిలదొక్కుకుని భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. చక్కటి సమన్వయంతో స్థిమితంగా ఆడిన వీరు చూడముచ్చటైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు తీయించారు. మరో వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడిన హెన్రిక్స్ (46 బంతుల్లో 62 పరుగులు), హెడ్ (34 బంతుల్లో 48 పరుగులు) అజేయంగా 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో 2 వికెట్లు నష్టపోయి 15.3 ఓవర్లలో 122 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు మరో 27 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు.

చిత్రం..జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 4/21