క్రీడాభూమి

అమీతుమీ నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య టి-20 ఇంటర్నేషనల్ సిరీస్ శుక్రవారంతో ముగుస్తుండగా, విజేత ఎవరనే సస్పెన్స్‌కు కూడా తెరపడనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా చెరొక విజయంతో సమవుజ్జీగా నిలిచిన విషయం తెలిసిందే. దీనితో, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగే చివరి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న టీమిండియా సిద్ధమైంది. మరోపక్క ఆసీస్ కూడా అంతే పట్టుదలతో ఉంది. వనే్డ సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన ఆ జట్టు కనీసం టి-20 సిరీస్‌నైనా సొంతం చేసుకొని, పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నది. రెగ్యులర్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయపడడంతో, అతని స్థానంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకం చేస్తున్నాడు. గౌహతిలో జరిగిన రెండో టి-20లో అతను తనకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను సమర్థంగా వినియోగించాడు. ఫాస్ట్ బౌలర్ జాసన్ బెరెన్‌డార్ఫ్ అతనికి తరుఫుముక్కగా ఉపయోగపడ్డాడు. నాలుగు వికెట్లు పడగొట్టిన బెరెన్‌డార్ఫ్ ఆసీస్ విజయానికి బాటలువేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బలమైన ప్రత్యర్థిని ఓడించి, టి-20 సిరీస్‌పై ఆశలు నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా చివరి పోరాటంలో సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. అయితే, బరాస్పరా స్టేడియంలో దక్కించుకున్న ఫలితాన్ని పునరావృతం చేయడం వార్నర్ బృందానికి అనుకున్నంత సులభం కాదు.
తప్పులు దిద్దుకుంటేనే..
అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియా రెండో టి-20లో ఓడడారికి ఆసీస్ ప్రతిభ కంటే, స్వయంకృతమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. నిర్లక్ష్యమైన షాట్లతో టాప్ ఆర్డర్ విఫలం కావడం భారత్ ఇన్నింగ్స్ పతనానికి దారితీసింది. బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పుడు, జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించాల్సిన బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ రెండు విభాగాల్లోనూ చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందడుగు వేస్తేగానీ, అత్యంత కీలకమైన చివరి మ్యాచ్‌లో గెలవడం కోహ్లీ సేనకు సాధ్యం కాదు. రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (0) మొదటి ఓవర్‌లోనే పెవిలియన్ చేరడం భారత్‌ను దారుణంగా దెబ్బతీసింది. శిఖర్ ధావన్ 2, మనీష్ పాండే 6 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. టాప్ ఆర్డర్ ఈ విధంగా చేతులెత్తేయడంతో సహజంగానే మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. కేదార్ జాధవ్ చేసిన 27 పరుగులే భారత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచిందంటే, బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏ స్థాయిలో కొనసాగిందో ఊహించుకోవచ్చు. హార్దిక్ పాండ్య 25 పరుగులతో జట్టును ఆదుకోవడానికి విఫలయత్నం చేశారు. నిజానికి భారత బ్యాటింగ్ లైనప్ ఆరు లేదా ఏడు స్థానాల వరకూ పటిష్టంగానే ఉంది. కానీ, పిచ్ తీరును, వాతావరణం, ఆస్ట్రేలియా బౌలర్ల ఆధిపత్యానికి భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం కూడా తోడైంది. 118 పరుగులకే ఆలౌటైన భారత్‌కు బౌలర్ల అండ లభించి ఉంటే బాగుండేది. అయితే, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ పేలవమైన బంతులతో అభిమానులను నిరాశపరిచారు. ఆరోన్ ఫించ్ (8), డేవిడ్ వార్నర్ (2) తక్కువ స్కోర్లకే అవుటైనప్పటికీ, ఆ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మోజెస్ హెన్రిక్స్ (62 నాటౌట్), ట్రావిస్ హెడ్ (48 నాటౌట్) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆసీస్‌ను విజయపథంలో నడిపారు. వారిని అడ్డుకోవడంలో స్పిన్నర్లేగాక, పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా సైతం విఫలమయ్యారు. భువీ పొదుగా బౌలింగ్ చేసినప్పటికీ, ఆసీస్ బ్యాట్స్‌మెన్ దూకుడుకు బ్రేక్ పడలేదు. ఇలావుంటే, వాతావరణం సరిగ్గా లేని కారణంగా, భారత స్పిన్నర్లకు బంతిపై గ్రిప్ లభించలేదన్నది వాస్తవం. కుల్దీప్, చాహల్‌లో ఒకరిని తప్పించి, మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కుతుది జట్టులో చోటు కల్పించే అవకాశం లేకపోవచ్చు. గౌహితిలో పిచ్ తీరు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, స్పిన్నర్లు ఎవరైనా అదే రీతిలో విఫలమవుతారని విశే్లషకుల అభిప్రాయం. కెప్టెన్ కోహ్లీ కూడా ఇలాంటి ఆలోచనలోనే ఉండవచ్చు. భువీ, బుమ్రా తమకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్న తరుణంలో, పేస్ కాంబినేషన్‌ను కూడా కోహ్లీ మార్చకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏ రకంగా చూసినా, తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండానే చివరి టి-20లో కోహ్లీ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

చిత్రం..ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా గురువారం సహచరులతో కలిసి
ఫుట్‌బాల్ ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ