క్రీడాభూమి

వర్షం వెంటాడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: ముందుగా అనుమానించిన విధంగానే భారత్, ఆస్ట్రేలియా జట్ల చివరి టి-20 ఇంటర్నేషనల్‌ను వర్షం వెంటాడింది. ఒకవైపు జల్లులు, మరోవైపు చిత్తడిగా మారిన ఔట్ ఫీల్డ్ మ్యాచ్ జరిగే అవకాశాలకు గండికొట్టాయి. దీనితో టాస్‌కు కూడా నోచుకోని చివరి, మూడో ఇంటర్నేషనల్ టి-20 ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) అధికారులు భారీ ఫ్యాన్లతో మైదానంలో తేమ లేకుండా చూసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, వారి శ్రమ ఫలించలేదు. కనీసం ఐదేసి ఓవర్లతో మ్యాచ్‌ని ఆడించే ప్రయత్నం కూడా జరిగింది. కానీ, అది కూడా సాధ్యం కాదని అంపైర్లు నిర్ధారణకు వచ్చారు. చివరి మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించారు. దీనితో మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ డ్రాగా ముగిసింది. మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే, రెండో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా స్వదేశానికి వెళుతుంది. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లకు తొమ్మిది రోజుల ఆట విడుపు లభిస్తుంది.
అభిమానుల ఆందోళన: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి, మూడో టి-20 ఇంటర్నేషనల్‌ను తిలకిద్దామని ఎంతో ఆసక్తిగా స్టేడియానికి తరలి వచ్చిన అభిమానులు తీరా మ్యాచ్ రద్దుకావడంతో నిరాశ చెందారు. కొంత మంది స్టేడియం వెలుపల ఆందోళనకు దిగారు. పది లేదా కనీసం ఐదేసి ఓవర్లతో మ్యాచ్‌ని కొనసాగించి ఉంటే బాగుండేదని వాపోయారు. అయితే, ఔట్‌ఫీల్డ్ బురదమయమైతే, ఫీల్డర్లు గాయపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మ్యాచ్‌ని రద్దు చేసినట్టు అంపైర్లు అనిల్ చౌదరి, నందన్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా, రోడ్లు జలమయమైనా పట్టించుకోకుండా మ్యాచ్‌ని తిలకించడానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. మొత్తం 29,851 మంది ప్రేక్షకులు వచ్చినట్టు అధికారి ఒకరు తెలిపారు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని స్టేడియానికి వచ్చినప్పటికీ మ్యాచ్ జరగపోవడంతో అభిమానులంతా నిరాశతో వెనుదిరిగారు.

చిత్రం..ఔట్‌ఫీల్డ్‌ను ఆటకు అనువుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న గ్రౌండ్ సిబ్బంది