క్రీడాభూమి

నల్లేరుపై నడకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: ఈ సీజన్‌లో ఇంత వరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆధిపత్యాన్ని కనబరుస్తున్న టీమిండియా మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఇరు జట్ల ఆటగాళ్లు శనివారం ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్‌ను కొనసాగించారు. రొటీన్ వామప్‌తోపాటు నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌పై శ్రద్ధ పెట్టారు. కాగా, ఇటీవలే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై వనే్డ సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు న్యూజిలాండ్‌ను ఓడించడం కష్టం కాకపోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలను అందుకొని, నిలకడగా రాణిస్తున్న కారణంగా, కివీస్‌పై కోహ్లీ బృందానిదే పైచేయిగా కనిపిస్తున్నది. మూడేళ్ల క్రితం ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాను ఢీకొన్న భారత్ ఓడినప్పటికీ, అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో రెట్లు బలాన్ని పుంజుకుంది. అన్ని విధాలా పటిష్టంగా ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్‌పై విజయం సులభమేనని విశే్లషకుల అభిప్రాయం. హార్డ్ హిట్టింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేకపోయినా ఆస్ట్రేలియాను వనే్డ సిరీస్‌లో చిత్తుచేయడం బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌కు నిదర్శనం. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది హోం గ్రౌండ్ కావడంతో అతను మరోసారి విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను మొత్తం 296 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో ఒక శతకం, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. మరో కీలక బ్యాట్స్‌మన్ అజింక్య రహానే 244 పరుగులు సాధించాడు. అతను నాలుగు అర్ధ శతకాలు నమోదు చేయడం విశేషం. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 222 పరుగులు చేస్తే, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంత బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేసి, తక్కువ స్కోరుకే పరిమితం చేయడం న్యూజిలాండ్ బౌలర్లకు సులభసాధ్యం కాదన్నది వాస్తవం. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ కొంత వరకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపవచ్చు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ భారత పిచ్‌ల తీరును ఎంత వరకూ ఉపయోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
భారత్ బౌలింగ్ విభాగానికి వస్తే, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా పేస్‌ను ముందుండి నడిపిస్తున్నారు. స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. స్వదేశంలో, బాగా తెలిసిన పిచ్‌లపై వీరు సంధించే బంతులను ఎదుర్కోవాలంటే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ సర్వశక్తులు ఒడ్డి పోరాడక తప్పదు. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌తోపాటు సీనియర్లు మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్ పూర్తి ఫామ్‌లోకి వస్తేగానీ కివీస్‌కు భారీ స్కోర్లను ఊహించలేం. మొత్తం మీద ప్రత్యర్థి కంటే అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న టీమిండియా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్‌కు విజయం సాధ్యం కాదని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.