క్రీడాభూమి

కోహ్లీ శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు శతకాన్ని నమోదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. టామ్ లాథమ్, రాస్ టేలర్ అసాధారణ బ్యాటింగ్ ప్రతిభ కనబరచడంతో, న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు సాధించిన టీమిండియా ఆ తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయింది. లాథమ్ సెంచరీతో రాణించగా, టేలర్ ఐదు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నప్పటికీ, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. వీరిద్దరి ప్రతిభతో న్యూజిలాండ్ 49 ఓవర్లలో నాలుగు వికెట్లకు 284 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకున్న భారత్ 16 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను శిఖర్ ధావన్ రూపంలో కోల్పోయింది. 12 బంతుల్లో 9 పరుగులు చేసిన అతనిని టామ్ లాథమ్ క్యాచ్ అందుకోగా ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత కొద్ది సేపటికే మరో ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. 18 బంతులు ఎదుర్కొని, రెండు సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేసిన అతనిని ట్రెంట్ బౌల్డ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించిన కోహ్లీ వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే, కేదార్ జాధవ్ (12) తక్కువ స్కోరుకే అవుట్‌కాగా, దినేష్ కార్తీక్ (37), హార్దిక్ పాండ్య (16) అండగా స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. 125 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 121 పరుగులు సాధించిన అతను ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ పట్టగా, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 270 పరుగులు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (25), భువనేశ్వర్ కుమార్ (26) చివరిలో స్కోరును వేగంగా పెంచేందుకు శ్రమించినా ఫలితం కనబడలేదు. టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ ఒక్క బంతి కూడా ఎదుర్కొనే అవకాశం రాకపోవడంతో, పరుగుల ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా రాణించి 35 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చాడు. టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ, 73 పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌ని గెలిచి, శుభారంభం చేయాలనుకున్న భారత్ పరిస్థితి మొదట్లో మెరుగ్గానే కనిపించింది. 48 పరుగుల వద్ద కొలిన్ మున్రో (28) వికెట్‌ను దినేష్ కార్తీక్ క్యాచ్ పట్టగా జస్‌ప్రీత్ బుమ్రా సాధించాడు. తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా వెనుదిరిగాడు. కేవలం ఆరు పరుగులు చేసిన అతను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కేదార్ జాధవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటి వరకూ జాగ్రత్తగా ఆడుతున్న మార్టిన్ గుప్టిల్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు దొరికిపోయాడు. 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను టేలర్, లాథమ్ ఆదుకున్నరు. వీరు నాలుగో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి, జట్టు విజయాన్ని సులభతరం చేశారు. 100 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 95 పరుగులు చేసిన టేలర్‌ను యుజువేంద్ర చాహల్ క్యాచ్ అందుకోగా భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. అప్పటికే విజయానికి చేరువలో ఉన్న న్యూజిలాండ్‌కు హెన్రీ నికోల్స్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మార్చి విజయాన్ని అందించాడు. అతనితోపాటు నాటౌట్‌గా ఉన్న లాథమ్ 102 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 103 పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ పడగొట్టారు.

చిత్రం..విరాట్ కోహ్లీ (121)