క్రీడాభూమి

ఫలించిన నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 22: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ కోసం భారత్ పదేళ్ల నిరీక్షణకు తెరపడింది. కల ఫలించి, ఈసారి విజేతగా నిలిచింది. చివరిసారి, 2007లో చెన్నైలో ఈ టోర్నీ జరిగినప్పుడు భారత్ టైటిల్‌ను సాధించింది. దశాబ్దం తర్వాత, ఆదివారం జరిగిన ఫైనల్‌లో మలేషియాను 2-1 తేడాతో ఓడించి, మరోసారి విజేతగా నిలిచింది. మొత్తం మీద ఆసియా కప్‌ను భారత్ సాధించడం ఇది మూడోసారి. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను రెండు పర్యాయాలు చిత్తుచేసి సత్తా చాటింది. ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోకుండా ఫైనల్ చేరింది. మొదటి మ్యాచ్‌ని జపాన్‌పై 5-1 ఆధిక్యంతో విజయం సాధించడం ద్వారా జైత్ర యాత్రను ప్రారంభించిన భారత్ ఆతర్వాత బంగ్లాదేశ్‌ను 7-0 తేడాతో ఓడించింది. గ్రూప్ దశలోనే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ని 3-1 తేడాతో గెల్చుకుంది. మలేషియాపై 6-2 ఆధిక్యంతో విజయభేరి మోగించిన భారత్ సూపర్ ఫోర్ దశలో మరోసారి పాకిస్తాన్‌ను ఢీకొంది. ఆ మ్యాచ్‌ని 4-0 తేడాతో గెల్చుకొని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. మొత్తం మీద గ్రూప్ దశ నుంచి సూపర్ ఫోర్స్ వరకూ కొనసాగిన ప్రయాణంలో దక్షిణ కొరియాతో మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకోవడం మినహా అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలను నమోదు చేసింది. అదే ఉత్సాహంతో ఫైనల్‌లో మలేషియాతో తలపడింది. ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరిన మలేషియా వేలాది మంది అభిమానుల సమక్షంలో, వారిని నుంచి అందుతున్న మద్దతుతో రెచ్చిపోయే ప్రయత్నం చేసింది. అయితే, మ్యాచ్ మూడో నిమిషంలోనే రమణ్‌దీప్ సింగ్ చక్కటి ఫీల్డ్ గోల్‌ను సాధించి, మలేషియాకు సవాలు విసిరాడు. పోరు తీవ్రంగా కొనసాగుతుండగా, 29వ నిమిషంలో లలిత్ ఉపాధ్యాయ ద్వారా భారత్‌కు రెండో గోల్ లభించింది. రెండు గోల్స్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకంజ వేయని మలేషియా దూకుడును కొనసాగించింది. అప్పటికే మెరుగైన స్థితిలో ఉన్న కారణంగా భారత్ రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, మలేషియా అందుకు భిన్నంగా ఆడింది. కానీ, ప్రథమార్ధం ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ద్వితీయార్ధంలో మరోసారి భారత గోల్‌పోస్టుపై దాడులకు ఉపక్రమించింది. కానీ, భారత రక్షణ వలయాన్ని సమర్థంగా ఛేదించలేకపోయింది. ముమ్మర పోరును కొనసాగించిన ఆ జట్టుకు 50వ నిమిషంలో షహ్రిల్ సబా గోల్‌ను అందించాడు. ఆతర్వాత చివరి పది నిమిషాలు అత్యంత ఉత్కంఠ భరితంగా గడిచాయి. ఈక్వెలైజర్ కోసం మలేషియా సర్వశక్తులు ఒడ్డగా, గోల్ కాకుండా అడ్డుకోవడానికి భారత ఆటగాళ్లు అంతకంటే ఎక్కువ శ్రమించారు. చివరికి ఈ శ్రమ ఫలించింది. మ్యాచ్‌ని భారత్ 2-1 తేడాతో ముగించి, మూడోసారి ఆసియా కప్ హాకీ విజేతగా అవతరించింది.
పాక్‌కు మూడో స్థానం
భారత్ చేతిలో రెండుసార్లు పరాజయాలను ఎదుర్కొని పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ మూడో స్థానానికి జరిగిన పోరులో దక్షిణ కొరియాను ఓడించి ఊరట చెందింది. అజీజ్ అహ్మద్ హ్యాట్రిక్‌తో రాణించగా పాకిస్తాన్ మొత్తం ఆరు గోల్స్ చేయగలిగింది. అందుకు సమాధానంగా కొరియా మూడు గోల్స్ చేసింది.

చిత్రం..ఆసియా కప్ హాకీ టైటిల్ సాధించిన భారత ఆటగాళ్ల ఆనందం