క్రీడాభూమి

ఉత్ప్రేరకాలు వాడి తప్పుచేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

షరపోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడిందన్న వార్త తెలిసిన వెంటనే క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయాన్ని షరపోవా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించడాన్ని కొంత మంది స్వాగతించగా, ఇలాంటి సంఘటనల వల్ల యావత్ క్రీడారంగానికే నష్టం వాటిల్లుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ సంఘటన క్రీడా రంగాన్ని కుదిపేస్తున్న డోపింగ్ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. నిషిద్ధ మాదక ద్రవ్యాలు వినియోగించకుండా క్రీడాకారులను నిరోధించేందుకు ఎంతగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. అంతేగాక డోపింగ్ నిబంధనలు మారాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తున్నది.

లాస్ ఏంజిలిస్: డోపింగ్‌కు పాల్పడ్డానని రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా చేసిన ప్రకటన టెన్నిస్‌లోనేకాక యావత్ క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని, అభిమానులను తలదించుకునేలా ప్రవర్తించానని నగర శివార్లలోని ఒక హోటల్‌లో స్వయంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా జరిపిన డోప్ టెస్టులో దొరికిపోయానని చెప్పిన ఆమె, గత పది సంవత్సరాలుగా ‘మెల్డోనియం’ అనే మందును వాడుతున్నానని తెలిపింది. ఈఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ‘మెల్డోనియం’ను నిషిద్ధ ఉత్ప్రేరకాల జాబితాలో చేరుస్తున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ప్రకటించారని షరపోవా తెలిపింది. నిషిద్ధ ఔషధాల జాబితాను అధికారులు ముందుగానే తనకు పంపారని, అయితే, తాను జాబితాను పూర్తిగా చదలేదని కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పింది. పొరపాటు చేశానని, అందుకు ఫలితాన్ని అనుభవించక తప్పదన్న విషయం తనకు తెలుసునని తెలిపింది. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. డోపింగ్ నిబంధనలను మార్చాల్సిన అవసరాన్ని వాడా అధికారులు ఒకసారి ఆలోచించాలని కోరింది. వంశపారంపర్యంగా వస్తున్న షుగర్ వ్యాధి నుంచి బయటపడడంతోపాటు ఆరోగ్యపరమైన మరికొన్ని సమస్యల కారణంగా తాను ‘మెల్డోనియం’ను వాడుతున్నట్టు చెప్పింది. అయితే, ఇది నిషిద్ధ మాదక ద్రవ్యమన్న విషయం తనకు తెలియదని వాపోయింది. ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు వాడా నుంచి అందిన నిషిద్ధ మాదక ద్రవ్యాల జాబితాను చూడకపోవడం తన పొరపాటేనని అంగీకరించింది. ‘డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాను. మెల్డోనియం అనే మందును పది సంవత్సరాలుగా వాడుతున్నాను. తాజా సంఘటనలు నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. నేను పొరపాటు చేశానని అంగీకరిస్తున్నాను. అభిమానులు నా వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని నాకు తెలుసు. టెన్నిస్‌ను కూడా నేను కించపరిచాను. అందరినీ నేను నిరాశకు గురి చేశాను. ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెప్పుకొంటున్నాను. టెన్నిస్ అధికారులు నాపై చర్య తీసుకుంటారని నాకు తెలుసు. అయితే, ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అన్నది.
సస్పెన్షన్ వేటు
ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో తాను విఫలమయ్యానని, ‘మెల్డోనియం’ అనే ఉత్ప్రేరకాన్ని గత పదేళ్లుగా వాడుతున్నానని షరపోవా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటిఎఫ్) స్పందించింది. ఆమెను టెన్నిస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాడా ఇచ్చే నివేదిక, ఉత్ప్రేరకాన్ని వాడిన సందర్భం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సస్పెన్షన్ కాలాన్ని నిర్ధారిస్తారు. ఆరోగ్య సమస్యతోనే తాను ‘మెల్డోనియం’ను వాడుతున్నానని షరపోవా స్పష్టం చేయడం, నేరాన్ని అంగీకరించడం, శిక్షను అనుభవిస్తానని చెప్పడం వంటి అంశాలు విచారణ సమయంలో ఆమెకు ఉపయోగపడతాయి. అంతేగాక, ‘మెల్డోనియం’ నిషేధం ఈఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అంతకు ముందు వరకూ అది నిషిద్ధ మాదక ద్రవ్యాల జాబితాలో చేరలేదు. వాడా పంపిన జాబితాను గమనించకపోవడం షరపోవా తప్పుకావచ్చేమోగానీ, కఠిన శిక్ష విధించాల్సినంత పెద్ద నేరం కాదు. ఈ అంశం కూడా షరపోవాకు ఆదుకునే అవకాశం లేకపోలేదు.
వైదొలగిన స్పాన్సర్లు
షరపోవా డోపింగ్ పరీక్షలో విఫలమైనట్టు ప్రకటించిన మరుక్షణమే ఆమె ప్రధాన స్పాన్సర్లు నైక్, టిఎజి హ్యూయర్ కంపెనీలు తాము వైదొలగుతున్నట్టు ప్రకటించాయి. షరపోవా వివాదంలో చిక్కుకోవడం దురదృష్టకరమని నైక్ సంస్థ వ్యాఖ్యానించింది. బాధాకరమైన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రముఖ వాచ్ కంపెనీ హ్యూయర్ సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. నైక్ ద్వారా లభించే 70 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును షరపోవా కోల్పోయింది. హ్యూయర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మొత్తం వివరాలు తెలియలేదు.

బాధ పడుతున్నా..

న్యూయార్క్: షరపోవా నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడిందన్న వార్త తనను కలచివేసిందని, ఈ సంఘటనను చూసి తాను బాధపడుతున్నానని మాజీ టెన్నిస్ క్రీడాకారిణి జెన్నీఫర్ కాప్రియాటి వ్యాఖ్యానించింది. తాను కూడా మాదక ద్రవ్యాలను ఉపయోగించి టెన్నిస్‌కు దూరమయ్యానని, ఈ రకంగా వెలికి గురికావడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక సమర్థురాలు డోపింగ్ పరీక్షలో పట్టుబడడం నిరాశను కలిగిందని చెప్పింది. డోపింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ సంఘటన రుజువు చేస్తున్నదని తెలిపింది.