క్రీడాభూమి

వెంటాడుతున్న వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 17: ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ని రెండో రోజు కూడా వర్షం వెంటాడింది. మొదటి రోజు ఆటలో కేవలం 11.5 ఓవర్ల ఆట సాధ్యంకాగా, టాప్ ఆర్డర్ విఫలం కావడంతో టీమిండియా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించాల్సి ఉన్నప్పటికీ, వర్షం కారణంగా మొదటి సెషన్‌లో అది సాధ్యం కాలేదు. మొదటి రోజులో వర్షం వల్ల ఎక్కువ భాగం కవర్ల కిందే ఉండిపోయిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కి రెండోరోజు కూడా అదే పరిస్థితి తప్పలేదు. మొదటి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ లోకేష్ రాహుల్ ఔట్‌కావడంతో మొదలైన టీమిండియా వికెట్ల పతనానికి రెండో రోజు జరిగిన కొద్దిసేపటి ఆటలోనూ తెరపడలేదు. చటేశ్వర్ పుజారా వికెట్ల వద్ద పాతుకుపోయి, 102 బంతుల్లో అజేయం 47 పరుగులు చేసినప్పటికీ, రెండో రోజు మరో రెండు వికెట్లు కూలాయి. మొదటిరోజు ఆటలో రాహుల్‌తోపాటు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (8), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) వికెట్లు చేజార్చుకున్న టీమిండియా, రెండో రోజు ఆటలో అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు కోల్పోయింది. పుజారాతో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికి రహానే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 21 బంతులు ఎదుర్కొన్న అతను నాలుగు పరుగులు చేసి, దుసాన్ షణక బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కువ సేపు ఆట కొనసాగే అవకాశం కనిపించకపోవడంతో, నైట్‌వాచ్‌మన్‌గా అశ్విన్‌ను పంపించడం ద్వారా కోహ్లీ చేసిన ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. 29 బంతులు పొరాడిన అతను నాలుగు పరుగులకే దుసాన్ షణక బౌలింగ్‌లో దిముత్ కరుణరత్నే క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. శ్రీలంక బౌలింగ్‌ను ఆచితూచి ఎదుర్కొన్న పుజారా మొత్తం 102 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండో రోజు ఆటను నిర్ణీత సమయానికంటే ముందుగానే ముగించగా, పుజారాతోపాటు వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా (6) క్రీజ్‌లో ఉన్నాడు. మొత్తంమీద 32.5 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 74 పరుగులు చేసి కష్టాల్లో పడింది. అయితే, వర్షం వల్ల అంతరాయం కొనసాగే అవకాశాలు ఉండడంతో, ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం టీమిండియాకు కష్టం కాదనే చెప్పాలి. మూడో రోజు ఆటను కూడా వర్షం భయం వెంటాడుతున్నది.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 17): లోకేష్ రాహుల్ సి నిరోషన్ డిక్‌విల్లా బి సురంగ లక్మల్ 0, శిఖర్ ధావన్ బి సురంగ లక్మల్ 8, చటేశ్వర్ పుజారా 47 నాటౌట్, విరాట్ కోహ్లీ ఎల్‌బి సురంగ లక్మల్ 0, అజింక్య రహానే సి నిరోషన్ డిక్‌విల్లా బి దుసాన్ షణక 4, రవిచంద్రన్ అశ్విన్ సి దిముత్ కరుణరత్నే బి దుసాన్ షణక 4, వృద్ధిమాన్ సాహా 6 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (32.5 ఓవర్లలో 5 వికెట్లకు) 74.
వికెట్ల పతనం: 1-0, 2-13, 3-17, 4-30, 5-50.
బౌలింగ్: సురంగ లక్మల్ 11-9-5-3, లాహిరు గామగే 11.5-3-24-0, దుసాన్ షణక 8-2-23-2, దిముత్ కరుణరత్నే 2-0-17-0.

చిత్రాలు..ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై కవర్లు కప్పుతున్న గ్రౌండ్స్ స్టాఫ్
*శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు రెండో రోజు
నాటౌట్‌గా ఉన్న భారత ఆటగాళ్లు వృద్ధిమాన్ సాహా, చటేశ్వర్ పుజారా