క్రీడాభూమి

టీమిండియా 172 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 18: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో మొదటి రెండు రోజుల ఆటకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 172 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 165 పరుగులు చేసింది. లాహిరు తిరిమానే, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అర్ధ శతకాలతో రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకునే దిశగా ముందడుగు వేసింది. అయితే, ఇప్పటికే మూడు రోజుల ఆట ముగియడంతో, ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయంగా కనిపిస్తున్నది. వెలుతురు సరిగ్గా లేని కారణంగా రెండో రోజు ఆటను నిలిపివేసే సమయానికి ఐదు వికెట్లకు 74 పరుగులు చేసిన శ్రీలంక కొద్ది సేపటికే చటేశ్వర్ పుజారా వికెట్‌ను కోల్పోయింది. జట్టును ఆదుకోవడానికి విశేషంగా కృషి చేసిన అతను 117 బంతులు ఎదుర్కొని, పది ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి, లాహిరు గామగే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 79 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోగా, ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహాతో కలిసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించారు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో దిల్‌రువాన్ పెరెరా భారత్‌ను దెబ్బతీశాడు. అతని బౌలింగ్‌లో ఎల్‌బిగా ఔటైన జడేజా 37 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు. ఆ ఓవర్‌లోనే సాహా వికెట్ కూడా కూలింది. అతను 83 బంతుల్లో 29 పరుగులు చేసి, ఏంజెలో మాథ్యూస్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అతని స్కోరులో ఆరు ఫోర్లు ఉన్నాయి. చివరిలో భువనేశ్వర్ కుమార్ 13, మహమ్మద్ షమీ 24 పరుగులు చేసి ఔట్‌కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌కు 172 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి ఉమేష్ యాదవ్ ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో సురంగ లక్మల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, లాహిరు గామగే, దసున్ షణక, దిల్‌రువాన్ పెరెరా తలా మూడేసి వికెట్లు కూల్చారు.
ఆరంభంలో లంక తడబాటు
భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ప్రారంభంలో తడబడింది. ఫలితంగా 29 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను దిముత్ కరుణరత్నే రూపంలో కోల్పోయింది. 15 బంతుల్లో 8 పరుగులు చేసిన అతను భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సదీర సమరవిక్రమ కొంత సేపు ధాటిగా బ్యాటింగ్ చేసి, 22 బంతుల్లో 23 పరుగు సాధించి భువీ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాకు చిక్కాడు. 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో లంకను ఆదుకునే బాధ్యతను లాహిరు తిరిమానే, ఏంజెలో మాథ్యూస్ స్వీకరించారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు స్కోరు బోర్డును ముందుకు దూకించారు. టీమిండియా ఫీల్డింగ్ పొరపాట్లు కూడా వీరి మధ్య మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొనడానికి కారణమైంది. తిరిమానే 94 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 51 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన డైవ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. మరో ఐదు పరుగుల తర్వాత మాథ్యూస్ వికెట్ కూడా పడింది. 94 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 52 పరుగులు చేసిన అతను కూడా ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. అతనిచ్చిన క్యాచ్‌ని లోకేష్ రాహుల్ అందుకున్నాడు. నాలుగు వికెట్లు కూలిన తర్వాత, కెప్టెన్ దినేష్ చండీమల్, వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో పడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 45 ఓవర్లలో నాలుగు వికెట్లకు 165 పరుగులు చేసింది. చండీమల్ 13, డిక్‌విల్లా 14 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భువనేశ్వర్, ఉమేష్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.

చిత్రం..హాఫ్ సెంచరీ చేసిన లంక బ్యాట్స్‌మన్ లాహిరు తిరిమానే