క్రీడాభూమి

బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, నవంబర్ 23: మొదటి టెస్టులో రెండు రోజుల ఆటకు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడగా, చివరిలో ఉత్కంఠ రేపినప్పటికీ ఎలాంటి ఫలితం తేలకపోవడంతో, శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తా చాటేందుకు భారత్, శ్రీలంక క్రికెటర్లు సిద్ధమయ్యారు. బౌన్సీ వికెట్లు ఉండాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుతున్న నేపథ్యంలో, నాగపూర్ పిచ్‌ని క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్ అందుకు తగినట్టే తీర్చిదిద్దినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. పచ్చిక ఎక్కువగా ఉండడంతో, పేసర్లకు అనుకూలిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో బంతి దూసుకొస్తే, ఖచ్చితంగా ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడతారు. ఒక రకంగా చెప్పాలంటే, మొదటిసారి మన దేశంలో పిచ్ బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టనుంది. ఈ పిచ్‌ని సీమర్లు ఎంత వరకూ ఉపయోగించుకుంటారన్నది ఆసక్తిని రేపుతుంటే, త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో అనుభవాన్ని సంపాదిస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడిన భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో రాణించారు. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, రికార్డు శతకాన్ని నమోదు చేసి, టీమిండియా బ్యాటింగ్ సామర్థ్యాన్ని లంక బౌలర్లకు రుచి చూపించారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ను బెంబేలెత్తించిన సురంగ లక్మల్ బృందం రెండో ఇన్నింగ్స్‌లో గొప్ప ప్రభావాన్ని చూపలేకపోయారు.
విజయ్‌కి అవకాశం
మొదటి టెస్టులో అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి 94 పరుగులు సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టుకు దూరంకాగా, అతని స్థానంలో మురళీ విజయ్‌కి అవకాశం దక్కనుంది. ధావన్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడితే, విజయ్ బ్యాటింగ్ తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. వికెట్‌ను కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అతను ఆచితూచి షాట్లకు వెళతాడు. ఒక రకంగా అతని రాకతో భారత బ్యాటింగ్ విధానంలో మార్పులు తెస్తుంది. కాగా, ఈటెస్టులో సీనియర్ పేసర్ ఇశాంత్ శర్మ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. భువనేశ్వర్ కుమార్ వివాహం చేసుకుంటుండగా, అతని స్థానంలో ఇశాంత్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు ఖరారైంది. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న మిగతా ఆటగాళ్లకంటే అతనే అత్యధికంగా 77 టెస్టులు ఆడాడు. రెండో టెస్టులో బౌలింగ్ వేసే అవకాశం లభిస్తే, దానిని అతను రెండు లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా జట్టులో స్థిరమైన స్థానం కోసం ప్రయత్నించాలి. ఆతర్వాత, దక్షిణాఫ్రికా టూర్‌లో తాను అద్భుతంగా రాణించగలనని నిరూపించుకోవాలి. సెలక్టర్లను ఆకట్టుకోవడానికి లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇశాంత్ ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి. స్పిన్ విభాగానికి వస్తే, మొదటి టెస్టులో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపే అవకాశం రవీంద్ర జడేజాకు లభించలేదు. పేసర్లు అద్భుతం ప్రతిభ కనబరిస్తే, జడేజా మొదటి ఇన్నింగ్స్‌లో ఒకటి, రెండో ఇన్నింగ్స్ ఒకటి చొప్పున రెండు ఓవర్లు బౌల్ చేసి, మొత్తం 8 పరుగులిచ్చాడు. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం (విసిఎ) స్టేడియంలో పిచ్‌ని ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా మార్చారని వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకుంటే, జడేజాకు రెండో టెస్టులో అవకాశం దక్కడం అనుమానంగానే ఉంది. బౌలింగ్‌లో వైవిధ్యాన్ని కోహ్లీ కోరుకుంటే, జడేజాకు బదులు ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అదే విధంగా విజయ్ శంకర్ కూడా కోహ్లీకి అందుబాటులో ఉంటాడు. మిగతా స్పిన్నర్ల కంటే భిన్నంగా, గంటకు సగటున 120 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే శంకర్ ఇంత వరకూ 32 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 27 పరుగులు పడగొట్టాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం కోహ్లీ అతనికి ఇస్తాడో లేదో చూడాలి. బ్యాటింగ్‌లోనూ రాణించగలగడం శంకర్‌కు ప్లస్ పాయింట్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 49.15 పరుగులు. ఇందులో ఐదు సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా అతని సేవలను ఉపయోగించుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించినా ఆశ్చర్యం లేదు.
శ్రీలంక విషయానికి వస్తే, మొదటి టెస్టు ఆరంభంలో గొప్పగా ఆడిన ఆ జట్టు ఆతర్వాత క్రమంగా పట్టు కోల్పోయింది. టీమిండియా ఆధిపత్యానికి తలవంచింది. నాగపూర్ వికెట్ బౌన్సీగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో, మొదటి టెస్టులో అంతగా ప్రభావం చూపలేకపోయిన లాహిరు గామగేకు రెండో టెస్టులో అవకాశం ఇవ్వకపోవచ్చు. అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 156 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒక వికెట్‌ను సాధించగలిగాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై భారత పేసర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిస్తే, గామగే అందుకు భిన్నంగా విఫలమయ్యాడు. అందుకే, అతని స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ విశ్వ ఫెర్నాండోను శ్రీలంక ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అదనంగా స్పిన్నర్‌ను ఆడించాలని అనుకుంటే, ‘చైనామన్’ లక్షన్ సండాకన్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాగితంపై చూస్తే, శ్రీలంక కంటే భారత్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. అయితే, మితిమీరిన క్రికెట్ ఆటగాళ్లను తీవ్ర అలసటకు గురి చేస్తున్నది. దాని ప్రభావం వల్ల పూర్తిస్థాయి ప్రతిభ కనబరచలేకపోతే, టీమిండియా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కానీ, మొదటి టెస్టు ఆరంభంలో వెనుకబడినప్పటికీ, ఆతర్వాత పుంజుకొని మంచి ఊపుమీద ఉన్న టీమిండియా అదే దూకుడును కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో లంక ఎంత వరకు సఫలమవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాచ్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

చిత్రాలు..ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్. శుక్రవారం నుంచి శ్రీలంకతో మొదలయ్యే రెండో టెస్టులో వీరికి అవకాశం దక్కుతుందా? లేదా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నది. అయతే, వీరు మాత్రం నెట్స్‌లో చెమటోడ్చారు
*నెట్స్‌లో భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అద్భుత విన్యాసం