క్రీడాభూమి

మహిళలంటే అంత చులకనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ (అమెరికా): మహిళలంటే గౌరవం లేదా? అంత చులకనగా చూస్తారా? అంటూ ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్ డైరెక్టర్ రేమండ్ మూర్‌పై ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ మండిపడింది. అతని వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నది. మహిళల టెన్నిస్ మొత్తం పురుషుల విభాగంపై ఆధారపడి ముందుకు వెళుతున్నదని మూర్ ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. మహిళా క్రీడాకారిణులంతా ప్రతిరోజూ మోకాళ్లపై కూర్చొని రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ వంటి మేటి క్రీడాకారులు టెన్నిస్‌లో ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పురుషుల టెన్నిస్‌తో కలిస్తేనే మహిళల విభాగానికి విలువ ఉంటుందని పేర్కొన్నాడు. కాగా మూర్ వ్యాఖ్యలపై సెరెనా తీవ్రంగా స్పందించింది. ఏ మహిళా క్రీడాకారిణి కూడా ఈ విధంగా ప్రార్థనలు చేయరని చెప్పింది. క్రీడారంగంలో ఇప్పటికీ లింగ వివక్ష కొనసాగుతున్నదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అన్నది. పురుషుల ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఏ క్రీడాకారిణికి రాదని స్పష్టం చేసింది. గత ఏడాది యుఎస్ ఓపెన్‌లో మహిళల మ్యాచ్‌లకే విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, ముందుగానే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయని గుర్తుచేసింది. మహిళల విభాగంలో నాదల్‌గానీ, ఫెదరర్‌గానీ ఆడలేదన్న విషయాన్ని మూర్ గ్రహించాలని అన్నది. ఇలాంటి అవగాహన లేని ప్రకటనలను, అసంబద్ధ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని వ్యాఖ్యానించింది.
నోరు జారాను.. క్షమించండి: మూర్
పొరపాటున నోరు జారానని టెన్నిస్ క్రీడాకారిణులు తనను క్షమించాలని 69 ఏళ్ల మూర్ ఒక బహిరంగ ప్రకటనలో కోరాడు. మహిళలను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నాడు. పురుషుల విభాగంపైనే ఆధారపడి మహిళల విభాగం ముందుకు సాగుతున్నదని, అందుకు క్రీడాకారిణులంతా కృతజ్ఞతలు తెలుపుకోవాలని తాను చేసిన వ్యాఖ్యలను ఎవరూ హర్షించలేరని అన్నాడు. ఫెదరర్, నాదల్ వంటి గొప్ప క్రీడాకారులు టెన్నిస్‌కు మూల స్తంభాలుగా నిలుస్తున్నారని, అలాంటి వారిని పుట్టించినందుకు భగవంతుడికి మోకాళ్లపై కూర్చొని మహిళలంతా కృతజ్ఞతలు తెలపాలనీ తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందిని బాధపెట్టి ఉంటాయని అన్నాడు. అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా బహిరంగ క్షమాపణలు కోరుకుంటున్నానని అన్నాడు. తనకు మహిళలను చులకనగా చూసే స్వభావం లేదని చెప్పాడు.

విమర్శలు పట్టించుకోను
పాకిస్తాన్ కెప్టెన్ అఫ్రిదీ స్పష్టీకరణ

మొహాలీ, మార్చి 21: విమర్శలను పట్టించుకోనని, జట్టుకు ఎలాంటి సేవలు అందించాలో తనకు తెలుసునని పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షహీద్ అఫ్రిదీ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లోనే అభిమానుల ఆదరాభిమానాలే ఎక్కువని వ్యాఖ్యానించిన అఫ్రిదీపై స్వదేశంలో పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. భారత్‌ను ప్రశంసించడం ద్వారా పాకిస్తాన్ ప్రతిష్ఠను దెబ్బతీశాడని ఒకరంటే, ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని మరికొందరు విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి తెరపడక ముందే, టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఐసిసి నిర్వహించే వరల్డ్ కప్, టి-20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా భారత్‌ను పాక్ ఓడించలేకపోయింది. వరల్డ్ కప్‌లో ఆరు పర్యాయాలు భారత్‌ను ఢీకొని అన్ని మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేసని పాక్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో ఐదోసారి భారత్‌ను ఎదుర్కొని, గతంలో నాలుగు మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా ఓటమిపాలైంది. వ్యూహ రచన సక్రమంగా లేదని, పోరాట పటిమ కూడా కొరవడిందని ఆటగాళ్లపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోచ్ వకార్ యూనిస్, కెప్టెన్ అఫ్రిదీనే ఈ పరాజయానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, స్వదేశంలో వ్యక్తమవుతున్న విమర్శలను అఫ్రిదీ తేలిగ్గా తీసుకున్నాడు. విమర్శలను తాను పట్టించుకోనని మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ కోసం సిద్ధమైన అతను విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. జట్టుకు ఉత్తమ సేవలు అందించడమే తన లక్ష్యమన్నాడు. చాలా మంది మాదిరి తాను భయపడి వెనక్కు తిరిగే వ్యక్తిని కానని వ్యాఖ్యానించాడు. కొంత మంది జట్టును నడిపించలేక రిటైర్మెంట్ తీసుకున్నారని, తాను చాలాకాలంగా పాక్ జట్టుకు సేవలు అందిస్తునే ఉన్నానని చెప్పాడు.