రాష్ట్రీయం

పోలవరంపై విచారణ జరిపితే అందరూ జైలుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: పోలవరం ప్రాజెక్టు టెండర్లు, సబ్ కాంట్రాక్టుల ప్రహసనంపై కేంద్రం విచారణ జరిపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో పోలవరంపై ఆయన విలేఖరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 800 టీఎంసీలు వాడుకున్నా ఎవరూ అడిగేవారు ఉండరని, ఇది ఆఖరి పాయింట్ కావడమే అందుకు కారణమన్నారు. శ్రీరాంసాగర్ తరువాత గ్రావిటీ ద్వారా నీరు తీసుకునే వీలు పోలవరం దగ్గరే ఉందని వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని గుర్తుచేశారు. 2005లోనే పోలవరం టెండర్లు పిలిచి ఒక్కో అనుమతిని వైఎస్ సాధించారన్నారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలపై కూడా నష్ట నివారణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టిన పోలవరాన్ని తాము నిర్మిస్తామని రాష్ట్రం ఎందుకు పట్టుబట్టిందని అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. 2014 నాటి అంచనాల ప్రకారమే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి ఆయోగ్ చెబితే ముఖ్యమంత్రి ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖలో అమర్‌జిత్ సింగ్ టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్‌మెంట్ చేయాల్సిన ప్రభుత్వం రాష్ట్ర వెబ్‌సైట్‌లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టిందని ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారన్నారు. పేపర్ నోటిఫికేషన్‌లో రూ. 1300 కోట్లని చూపి, వెబ్‌సైట్‌లో సుమారు రూ. 1400 కోట్లు వ్యయవౌతుందని పెట్టారని, ఇది కేవలం కాంట్రాక్ట్ కమీషన్ల
కోసమేనని ప్రతిపక్షం చేసిన ఆరోపణలపై ఇప్పుడు కేంద్రం కూడా ప్రశ్నిస్తోందన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా? అని ఆయన నిలదీశారు. రూ. 1600 కోట్లు పట్టిసీమ కోసం, రూ. 1800 కోట్లు పురుషోత్తపట్నంకు కేటాయించారని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానికి రాసిన లేఖలో పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారని, ఈ ప్రాజెక్టులు సరిపోతాయని, ఇక పోలవరం అక్కరలేదని ఆయన లేఖలో పేర్కొన్నారని గుర్తుచేశారు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనిచేయడం లేదని భావిస్తే ఆ కంపెనీతో మాట్లాడి కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆనాడు వైఎస్‌ఆర్ పోలవరం పనులు చేయడం లేదని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు కంపెనీ వారిని పిలిచి మాట్లాడి పనుల నుంచి తప్పించారన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా పోలవరంపై నిజాలను ప్రజలతో పంచుకోవాలని హితవు పలికారు. లెక్కలు బయటపెడితే జైలుకు వెళ్తారని బీజేపీ అధికార ప్రతినిధే హెచ్చరించినా చంద్రబాబు కళ్లు తెరవడం లేదని విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు శే్వతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం గత మూడేళ్లలో రూ. 2.16 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయో లెక్కలు చెప్పాలని కోరారు. ఇక జస్టిస్ మంజునాథ నివేదిక వివరాలు లేకుండా కమిషన్ రిపోర్టుకు చట్టబద్ధత ఏమేరకు ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు చట్టాలపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.

చిత్రం.. ఉండవల్లి