క్రీడాభూమి

జోరుగా.. హుషారుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, డిసెంబర్ 9: టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో గెల్చుకున్న టీమిండియా మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ విజయభేరి మోగించడానికి అన్ని విధాలా సన్నాహాలు పూర్తి చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో, మోతాదు మించిన వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయగా, అక్కడి నుంచి వేదిక అత్యంత ఆహ్లాదకరమైన ధర్మశాలకు మారడం ఆటగాళ్లకు కొత్త ఉత్సాహానిస్తున్నది. దౌలాధార్ పర్వత శ్రేణులు కనువిందు చేస్తుండగా, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) మైదానంలో మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, అంతగా ఫామ్‌లో లేని శ్రీలంకపై వివిధ కాంబినేషన్స్‌పై ప్రయోగాలు చేయాల్సిన అవసరం టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ, స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఉంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ విభాగాల్లో సరికొత్త కూర్పు ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. మంచు కురిసే అవకాశం ఉన్న ధర్మశాలలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలించవచ్చని అంటున్నారు. వాతావరణం, పిచ్ తీరును బట్టి తుది జట్టును ఎంపిక చేయడానికి రవి శాస్ర్తీ, రోహిత్ కసరత్తు చేయక తప్పదు. సాయంత్రం త్వరగా చీకటి పడుతుందనే కారణంగా మ్యాచ్‌ని ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారు. సహజంగానే ఇలాంటి వికెట్‌పై మ్యాచ్ ఆడే సమయంలో టాస్ కీలకమవుతుంది. శ్రీలంకపై వరుసగా ఐదు ద్వైపాక్షిక వనే్డ సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలిస్తే, దక్షిణాఫ్రికాను రెండో స్థానానికి నెట్టేసి నంబర్ వన్‌గా స్థిరపడుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో నంబర్ వన్ స్థానాన్ని టీమిండియా పంచుకుంటున్నది.
బ్యాటింగే బలం
భారత జట్టుకు బ్యాటింగే బలమన్నది అందరికీ తెలిసిన విషయమే. అద్భుతమైనఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ లేకపోయినప్పటికీ, టీమిండియా బ్యాటింగ్‌లో పదును తగ్గదనే చెప్పాలి. రోహిత్‌తోపాటు అజింక్య రహానే, దినేష్ కార్తీక్, మాజీ కెప్టెన్ ధోనీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. ఇన్నింగ్స్‌ను ఒకవేళ శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ ప్రారంభిస్తే, ఫస్ట్‌డౌన్‌లో రహానేను దించే అవకాశం ఉంది. అయితే, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ధావన్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ధావన్ అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. ఈ ఏడాది జూన్, జూలై మాసాల్లో వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటించినప్పుడు రోహిత్ మూడు అర్ధ శతకాలు, ఒక శతకంతో రాణించాడు. అంతకు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాపై నాలుగు వరుస మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఓపెనర్లతోపాటు రహానే బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఖరారైతే, ఆతర్వాత రెండు స్థానాల్లో దినేష్ కార్తీక్, ధోనీ బ్యాటింగ్‌కు రావచ్చు. వాషింగ్టన్ సుందర్‌ను ఆరో స్థానంలో పంపే అవకాశం ఉంది. వెస్టిండీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని దక్కించుకున్న వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ ఒక అర్ధ శతకాన్ని సాధించాడు. ఆతర్వాత న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 37, 64 (నాటౌట్), 4 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. ధోనీ వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న కారణంగా, దినేష్ కార్తీక్‌ను స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ రూపంలో జట్టులోకి తీసుకోవాలి. కాగా, రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని ధోనీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, తనను తాను నిరూపించుకోవడానికి అతను శ్రమించక తప్పదు. న్యూజిలాండ్‌తో జరిగిన టి-20 సిరీస్‌లో, ప్రత్యేకించి రెండో మ్యాచ్‌లో ధోనీ తడబడ్డాడు. అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌ని టీమిండియా 40 పరుగుల తేడాతో కోల్పోయింది. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ, ధోనీ జట్టులో అవసరమని కోహ్లీ వాదించాడు. ఫామ్‌ను కోల్పోయిన ధోనీని విమర్శిస్తున్న వారు పలు సందర్భాల్లో ఫామ్‌లో లేనప్పుడు తనను ఎందుకు విమర్శించలేదని నిలదీశాడు. ఒక రకంగా చెప్పాలంటే, కోహ్లీ మద్దతుతోనే ధోనీ పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో ధోనీ కెరీర్ కొనసాగుతున్నది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిలేదని నిరూపించుకునే అవసరం ఇప్పుడు ధోనీపై ఉంది.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సహజంగానే భారత జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. లంకతో టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి లభించడంతో అలసట నుంచి కోలుకున్న అతను కొత్త ఉత్సాహంతో సిరీస్‌కు రెడీగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ యుజువేంద్ర చాహల్, ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్‌లో ఒకరికి తుది జట్టులో అవకాశం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. ఫాస్ట్ బౌలింగ్‌కు వస్తే, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కీలక బాధ్యతలు స్వీకరించక తప్పదు. మూడో పేసర్‌గా సిద్ధార్థ్ కౌల్‌కు అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ధర్మశాల పిచ్‌పై బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి, కౌల్‌ను తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదని విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద శ్రీలంకపై టీమిండియా ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయాన్ని శ్రీలంక అడ్డుకోలేదన్నది వాస్తవం.
ఈ సిరీస్‌కు ఎంపికైన జట్టులో శ్రేయాస్ అయ్యర్, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ తంపీ, మహమ్మద్ సిరాజ్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. తమకు అవకాశం దక్కితే, సత్తా చాటాలన్న ఉత్సాహం వీరిలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఎంత మందికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కుతుందో చూడాలి. కెప్టెన్‌గా రోహిత్ శర్మ చేయబోయే ప్రయోగాలపై ఉత్కంఠ నెలకొంది.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఒక నైట్ క్లబ్‌లో మద్యం తాగి, పార్కింగ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులపై దాడికి దిగి, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న విషయం ఇంకా మరవక ముందే, మరో ఆటగాడు బెన్ డకెట్ యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. క్లబ్‌లో మద్యం సేవించిన అతను తన సహచర ఆటగాడు జేమ్స్ ఆండర్సన్ తలపై బీరు కుమ్మరించాడు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిని యాషెస్ సిరీస్ నుంచి సస్పెండ్ చేసి, వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సిందిగా ఆదేశించింది. స్టోక్స్ లేక బలహీన పడిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లోనూ పరాజయాలను చవిచూసింది. స్టోక్స్‌ను పిలిపించాలన్న డిమాండ్ పెరుగుతుంటే, డకెట్ ఉదంతం ఆ జట్టును మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టింది.