క్రీడాభూమి

ప్రతీకారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, డిసెంబర్ 12: ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డలో అనూహ్యంగా పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా బుధవారం జరిగే రెండో వనే్డలో శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇది మూడు మ్యాచ్‌ల సిరీస్ కావడంతో, ఈ మ్యాచ్‌ని నెగ్గితేనే భారత్ ఆశలు నిలబడతాయి. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా ఇది ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌గా మారింది. విజయానికి అతను కూడా అన్ని రకాలుగా అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకోవడం ఖాయం. కాగితంపై చూస్తే, శ్రీలంక కంటే భారత్ చాలా పటిష్టమైన జట్టుగా కనిపిస్తున్నది. కానీ, నిలకడలేమి, నిర్లక్ష్యం వంటి సమస్యలను భారత జట్టును పట్టి పీడిస్తున్నాయి. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం వల్లే మొదటి వనే్డలో రోహిత్ బృందం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందన్న విమర్శల్లో నిజం లేకపోలేదు. ధర్మశాలతో పోల్చదగినంత చలిగానీ, మంచుగానీ మొహాలీలో లేకపోయినప్పటికీ, ఉత్తర భారతాన్ని చలి వణికిస్తున్న నేపథ్యంలో, ఈ డే/నైట్ మ్యాచ్‌ని బుధవారం ఉదయం 11.30 గంటలకే మొదలు పెట్టనున్నారు. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేయాల్సివస్తే, భారత బ్యాట్స్‌మెన్‌కు మరోసారి పరీక్ష తప్పదు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మినహాయిస్తే, మిగతా వారిలో ఎవరూ తమ స్థాయికి తగిన ఆటతో రాణించలేకపోయారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, మనీష్ పాండే వంటి గొప్పగొప్ప బ్యాట్స్‌మెన్ పేర్లు కాగితంపై కనిపించినా, మైదానంలోకి దిగిన వెంటనే వీరు పెవిలియన్‌కు క్యూకట్టారు. భారత్ పరాజయానికి కారకులయ్యారు. ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 65 పరుగులు చేయకపోతే, భారత్ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నది వాస్తవం. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ లేనందుకే పరిస్థితి ఇంత దారుణంగా ఉందే విమర్శల నుంచి కూడా టీమిండియా బయటపడాలి. ఒకరిద్దరు ఆటగాళ్లపై పూర్తిగా ఆధారపడితే, భవిష్యత్తు దారుణంగా ఉంటుంది. అందుకే, కోహ్లీ లేకపోయినా, సమష్టిగా పోరాడి విజయాలను సాధించే సత్తా తమకు ఉందని ప్రస్తుత జట్టు సభ్యులు నిరూపించాలి. ఆ విషయంలో సెలక్టర్లకు భరోసా కల్పించాలి. ఇది జరగకపోతే, వచ్చే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లోగా మరికొన్ని ప్రయోగాలకు సెలక్షన్ కమిటీ సిద్ధపడితే, ప్రస్తుత జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్ల కెరీర్ కష్టాల్లో పడుతుంది.
తుది జట్టులో రహానే!
మొదటి వనే్డలో చేసిన పొరపాటును పునరావృతం కాకుండా, అజింక్య రహానేను భారత జట్టు మేనేజ్‌మెంట్ రెండో వనే్డలో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ 84 వనే్డలు ఆడిన అనుభవం ఉన్న అతనిని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవి శాస్ర్తీ కేవలం స్టాండ్ బై ఓపెనర్‌గానే చూశారు. అందుకే, ఓపెనింగ్ స్లాట్ ఖాళీ లేదన్న కారణంగా అతనిని బెంచ్‌కి పరిమితం చేశారు. అయితే, ఓపెనర్‌గానేకాదు.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గానూ రాణించే సత్తా అతనికి ఉందనేది వాస్తవం. ఇటీవల కాలంలో రహానే ఫామ్‌లో లేడన్నది అందరికీ తెలిసిందే. అయితే, సమర్థుడైన అతను ఏ క్షణంలోనైనా మళ్లీ ఫామ్‌లోకి రావడం ఖాయం. అందుకే, అతనితో ప్రయోగం చేయడానికి జట్టు మేనేజ్‌మెంట్ సుముఖత వ్యక్తం చేయవచ్చు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు రెండో వనే్డ పరీక్షగా మారింది. పేస్ బౌలింగ్ వేసే ఆల్‌రౌండర్ హోదాలో అతనికి జట్టులో చోటు దక్కింది. వచ్చేనెల దక్షిణాఫ్రికా టూర్ ఉన్న నేపథ్యంలో హార్దిక్ తన బౌలింగ్ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. కానీ, శ్రీలంకతో జరిగిన మొదటి వనే్డలో అతను ఏమాత్రం ప్రతిభావంతమైన బౌలింగ్ ప్రదర్శనను ఇవ్వలేకపోయాడు. ఐదు ఓవర్లలోనే ఏకంగా 39 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకు ముందు బ్యాటింగ్‌లోనూ విఫలమైన అతను 10 పరుగులకే వెనుదిరిగాడు. రెండో వనే్డలోనూ ఇదే విధంగా నాసిరకమైన ప్రదర్శనతో నిరాశ పరిస్తే, దక్షిణాఫ్రికా టూర్‌లో అతని భాగస్వామ్యంపై అనుమానాలు తలెత్తుతాయి. ఈ కారణంగానే, శ్రీలంకతో బుధవారం జరిగే రెండో వనే్డ హార్దిక్‌కు అత్యంత కీలకంగా మారింది.
స్పిన్నర్లపై భారం
శ్రీలంక భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసే బాధ్యత స్పిన్నర్లపై ఉంది. మొదటి వనే్డలో లక్ష్యం కేవలం 113 పరుగులు కావడంతో, మ్యాచ్‌ని లంక 20.4 ఓవర్లలోనే ముగించింది. దీనితో స్పినర్లు యుజువేంద్ర చాహల్, ‘చైనామన్’ కుల్దీప్ యాదవ్‌కు బౌల్ చేసే అవకాశం లభించలేదు. మొహాలీలో అదే పరిస్థితి తలెత్తుతుందని అనుకోవడానికి వీల్లేదు. సమర్థులైన స్పిన్నర్లుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
లంక క్రికెటర్ల ఆత్మవిశ్వాసం
భారత్‌ను మొదటి వనే్డలో ఓడించడంతో శ్రీలంక క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇదే ఉత్సాహంతో వారు రెండో మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నారు. తిసర పెరెరా నాయకత్వంలోని లంక జట్టుకు సురంగ లక్మల్, ఏంజెలో మాథ్యూస్ రూపంలో సమర్థులైన పేసర్లు ఉన్నారు. మరో పేసర్ నువాన్ ప్రదీప్ కూడా భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడంలో సమర్థుడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే, రెండో వనే్డలో అతనిని ప్లేయింగ్ ఎలెవెన్‌లకి తీసుకునే అవకాశం ఉంది. కానీ, విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి ఏ జట్టూ సిద్ధంగా ఉండదన్నది వాస్తవం. స్థూలంగా చూస్తే, భారత్ కంటే శ్రీలంక బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, అంచనాలను తారుమారు చేస్తే శక్తి ఆ జట్టుకు ఉందనేది వాస్తవం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, టీమిండియా ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే, మొదటి వనే్డలో ఎదురైన చేదు అనుభవం పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. అందుకే టీమిండియా ఆటగాళ్లు ఆచితూచి, జాగ్రత్తగా ఆడాలి.

చిత్రం..శ్రీలంకతో బుధవారం రెండో వనే్డ జరగనున్న నేపథ్యంలో, మొహాలీ స్టేడియంలో మంగళవారం నెట్ ప్రాక్టీస్‌కు హాజరైన భారత క్రికెటర్లు