క్రీడాభూమి

రోహిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డల్లో టీమిండియా 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 392 పరుగులు చేయడం ఇది రండోసారి. 2009 మార్చి 8న క్రైస్ట్‌చర్చిలో న్యూజిలాండ్‌పై మొదటిసారి ఈ స్కోరు చేసింది. ఇప్పుడు శ్రీలంకతో మరోసారి అనే్న వికెట్లకు, అంతే స్కోరు నమోదు చేయడం గమనార్హం. కాగా, వనే్డల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లలో ఇది ఆరోది. ఇంతకు ముందు వెస్టిండీస్‌పై 2011లో 5 వికెట్లకు 418, శ్రీలంకపై 2009లో 7 వికెట్లకు 414, బెరర్ముడాపై 2007లో 5 వికెట్లకు 413, శ్రీలంకపై 2014లో 5 వికెట్లకు 404, దక్షిణాఫ్రికాపై 2010లో 3 వికెట్లకు 401 చొప్పున పరుగులు సాధించింది.

భారత వనే్డ చరిత్రలో రెండు వందల పరుగుల మైలురాయిని అధిగమించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 2011లో వెస్టిండీస్‌తో ఇండోర్‌లో జరిగిన వనే్డలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తూ వీరేందర్ సెవాగ్ డబుల్ సెంచరీ సాధించాడు.

36 బంతుల్లోనే..

రోహిత్ శర్మ బుధవారం మొదటి వంద పరుగులు పూర్తి చేయడానికి 115 బంతులు తీసుకున్నాడు. అయితే, రెండో వందను అతను కేవలం 36 బంతుల్లోనే సాధించాడు. అతను 116 నుంచి 208 పరుగులకు, 11 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 27 బంతుల్లోనే చేరుకోవడం విశేషం.

ఏడింటిలో మూడు..

మొహాలీ, డిసెంబర్ 13: వనే్డ ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటి వరకూ ఏడు పర్యాయాలు మాత్రమే ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేయగలిగారు. వీటిలో మూడు రోహిత్ శర్మవే కావడం గమనార్హం. 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన రోహిత్, 2014లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. వనే్డ చరిత్రలో ఇప్పటి వరకూ ఒక ఆటగాడికి ఇదే అత్యధిక స్కోరు. తాజాగా తిరిగి శ్రీలంకపైనే అతను 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సచిన్ తెండూల్కర్ రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలి యర్‌లో దక్షిణాఫ్రికాపై అతను 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరేందర్ సెవాగ్ 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 219 పరుగులు, 2015లో క్రిస్ గే ల్ జింబాబ్వేపై కాన్‌బెరా (ఆస్ట్రేలియా)లో 215 పరుగులు, మార్టిన్ గుప్టిల్ 2015 మార్చి 22న వెల్లింగ్టన్‌లో వెస్టిండీస్‌పై 237 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

భార్యకు ప్రేమతో..

మొహాలీ: తమ రెండో పెళ్లిరోజైన డిసెంబర్ 13న తన భార్య రితికకు భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో విలువైన బహుమతినే ఇచ్చాడు. కెరీర్‌లో మూడో వనే్డ డబుల్ సెంచరీ చేసిన వెంటనే, స్టాండ్స్‌లో కూర్చొని, ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ చూస్తున్న ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తన అభిమానాన్ని చాటాడు. రోహిత్ డబుల్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే రితిక ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. రోహిత్ తనవైపు చూస్తూ, ఓ ముద్దు విసరడంతో సేదతీరి, నవ్వులు చిందించింది. మొత్తం మీద రోహిత్ పెళ్లిరోజున భార్యకు చిరస్మరణీయ డబుల్ టాన్‌ను బహుమతిగా ఇచ్చి, తన జీవితంలో ఆమెకు ఉన్న స్థానమేమిటో స్పష్టం చేశాడు.

సిక్సర్ల రికార్డు

మొహాలీ: ఒక వనే్డ ఇంటర్నేషనల్ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ కొత్త రికార్డు సృష్టించాడు. 1998లో సచిన్ తెండూల్కర్ 40 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును రోహిత్ 41 సిక్సర్లతో అధిగమించాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2000 సంవత్సరంలో 35 సిక్సర్లు సాధించాడు.
వనే్డల్లో, నాలుగు వరుస బంతుల్లో సిక్సర్లు కొట్టిన రెండో భారతీయుడిగా కూడా రోహిత్ గుర్తింపు సంపాదించాడు. 2000లో జింబాబ్వే బౌలర్ హెన్రీ ఒలాన్గా బౌలింగ్‌లో జహీర్ ఈ ఫీట్ సాధించాడు. ఇప్పుడు సురంగ లక్మల్ వేసిన ఒకే ఓవర్‌లో, నాలుగు వరుస బంతుల్లో రోహిత్ నాలుగు సిక్సర్లు కొట్టాడు.
వనే్డ కెరీర్‌లో ఎక్కువ సిక్సర్లు సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ పేరు రికార్డుల్లోకి ఎక్కింది. మహేంద్ర సింగ్ ధోనీ 208, సచిన్ తెండూల్కర్ 195, సౌరవ్ గంగూలీ 189 వనే్డ సిక్సర్లతో మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. రోహిత్ 155 సిక్సర్లు కొట్టి నాలుగో స్థానంలో ఉండగా, యువరాజ్ సింగ్ 153 సిక్సర్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత కెప్టెన్‌గానూ రోహిత్ రికార్డు నెలకొల్పాడు. మొహాలీలో అతను ఎనిమిది సిక్సర్లు సాధించగా, వీరేందర్ సెవాగ్, సచిన్ తెండూల్కర్ చెరి 7 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు.
వనే్డల్లో ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలోనూ రోహిత్‌కు నాలుగో స్థానం దక్కింది. సచిన్ 49 శతకాలతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ 32, సౌరవ్ గంగూలీ 22 శతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ 16వ వనే్డ సెంచరీ సాధించి, ఇన్నాళ్లూ 15 శతకాలతో నాలుగో స్థానంలో ఉన్న వీరేందర్ సెవాగ్‌ను ఐదో స్థానానికి నెట్టేశాడు. యువరాజ్ సింగ్ 14 శతకాలతో ఆరో స్థానంలో ఉన్నాడు.
వనే్డల్లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు పరుగులను ఎక్కువసార్లు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ తెండూల్కర్, డేవిడ్ వార్నర్ సంయుక్తంగా పంచుకుంటున్న రికార్డులో రోహిత్ కూడా వాటాదారుడయ్యాడు. మిగతా ఇద్దరి మాదిరిగానే రోహిత్ సైతం ఐదోసారి వనే్డల్లో 150 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సనత్ జయసూర్య, క్రిస్ గేల్, హషీం ఆమ్లా తలా నాలుగు పర్యాయాలు ఈ ఘనతను సాధించారు.
కెప్టెన్‌గా తక్కువ మ్యాచ్‌ల్లోనే శతకాన్ని సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో గౌతం గంభీర్, విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ రెండో స్థానాన్ని పంచుకుంటున్నాడు. సచిన్ తెండూల్కర్ తాను కెప్టెన్సీ బాధ్యతలు వహించిన తొలి వనే్డలోనే సెంచరీ చేయగా, గంభీర్, కోహ్లీ, రోహిత్ కెప్టెన్‌గా తమతమ రెండో మ్యాచ్‌లో శతకాన్ని నమోదు చేశారు. అజయ్ జడేజా నాలుగో మ్యాచ్‌లో, మహమ్మద్ అజరుద్దీన్ ఆరో మ్యాచ్‌లో కెప్టెన్‌గా తమతమ మొదటి సెంచరీ సాధించారు.
వనే్డల్లో ఎక్కువ పర్యాయాలు 180 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా మార్టిన్ గుప్టిల్ రికార్డును రోహిత్ సమం చేశాడు. గుప్టిల్ మూడు పర్యాయాలు ఈ ఫీట్‌ను నమోదు చేయగా, రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని అధిగమించాడు. వివియన్ రిచర్డ్స్, సచిన్ తెండూల్కర్ రెండేసి పర్యాయాలు వనే్డల్లో 180 కంటే ఎక్కువ పరుగులు చేసి, ఈ జాబితాలో రెండో స్థానాన్ని పంచుకుంటున్నారు.

భారత స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ వనే్డ కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ చేసి, సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మొదటి వనే్డలో విఫలమై, తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన అతను బుధవారం నాటి రెండో వనే్డలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. అజేయ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతని విజృంభణతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 392 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్ ఆతర్వాత శ్రీలంకను 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులకే కట్టడి చేసి, 141 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ అజేయ శతకంతో పోరాడినప్పటికీ, భారీ లక్ష్యాన్ని శ్రీలంక ఛేదించలేకపోయింది.
టాస్ గెలిచిన ప్రత్యర్థి శ్రీలంక ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌కు శిఖర్ ధావన్‌తో కలిసి రోహిత్ బలమైన పునాది వేశాడు. మొదటి వికెట్‌కు 115 పరుగులు జత కలిసిన తర్వాత ధావన్ ఔటయ్యాడు. 67 బంతుల్లోనే 68 పుగులు చేసిన అతనిని లాహిరు తిరిమానే క్యాచ్ అందుకోగా సచిత్ పథిరన పెవిలియన్‌కు పంపాడు. కెరీర్‌లో రెండో వనే్డ ఆడిన శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, రోహిత్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. రెండో వికెట్‌కు 213 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతని వికెట్‌ను సబ్‌స్టిట్యూట్ ఆటగాడు చతురంగ సిల్వ క్యాచ్ పట్టగా తిసర పెరెరా సాధించాడు. ధర్మశాలలో వనే్డ కెరీర్‌ను ప్రారంభించి, కేవలం తొమ్మిది పరుగులకే వెనుదిరిగిన శ్రేయాస్ ఈ మ్యాచ్‌లో 70 బంతులు ఎదుర్కొని 88 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తొలి వనే్డలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ మొహాలీలో ఏడు పరుగులతోనే సరిపుచ్చుకున్నాడు. తిసర పెరెరా బౌలింగ్‌లో అతను ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి హార్దిక్ పాండ్య వికెట్ పడింది. 5 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన అతను తిసర పెరెరా బౌలింగ్‌లో లాహిరు తిరిమానేకు చిక్కాడు. నాటౌట్‌గా నిలిచిన రోహిత్ 153 బంతుల్లో, 13 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 208 పరుగులు సాధించాడు. కాగా, భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు లంక కెప్టెన్ తిసర పెరెరా ఖాతాలోకి వెళ్లాయి. ఒక వికెట్‌ను సచిత్ పథిరన పడగొట్టాడు.
మాథ్యూస్ పోరాటం
భారత్ నిర్దేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపించగా, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ద్వారా ఓటమి తేడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాల్సిన శ్రీలంక అందుకు భిన్నంగా ఆడింది. 15 పరుగుల స్కోరువద్ద ఉపుల్ తరంగ (7) వికెట్‌ను కోల్పోయిన ఆ జట్టు తిరిగి కోలుకోలేదు. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఒక్కడే పోరాటం చేసినప్పటికీ, మిగతా వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో, పరుగుల వేటతో లంక సఫలం కాలేకపోయింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ క్యాచ్ పట్టగా ఉపుల్ తరంగ ఔట్‌కాగా, మరో 15 పరుగుల తర్వాత రెండో ఓపెనర్ దనుష్క గుణతిలక కూడా పెవిలియన్ చేరాడు. 19 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేసిన అతను జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి చిక్కాడు. కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడి, ఆదుకుంటాడన్న ఆశలు కల్పించిన లాహిరు తిరిమానే 35 బంతుల్లో 21 పరుగులు చేసి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన సుందర్‌కు ఇదే మొదటి వికెట్. ఆతర్వాత, మాథ్యూస్ పోరాటాన్ని కొనసాగిస్తుండగా, ఒకరి తర్వాత మరొకరిగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యాచ్ కట్టారు. వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా 22, అసెల గుణరత్నే 34 పరుగులతో కొంత మెరుగనిపించుకున్నప్పటికీ, కెప్టెన్ తిసర పెరెరా 5, సచిత్ పథిరన 2, అకిల ధంజయ 11 పరుగులకే వెనుదిరిగి, శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశారు. పరుగుల వేటను కొనసాగించలేకపోయిన లంక ఆలౌట్‌కాకుండా నిలవడం ద్వారా కొంత వరకైనా పరువు నిలబెట్టుకోగలిగింది. 50 ఓవర్లలో 8 వికెట్లకు శ్రీలంక 251 పరుగులు చేసింది. సురంగ లక్మల్ (11)తోపాటు నాటౌట్‌గా నిలిచిన మాథ్యూస్ 132 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించాడు. అతని స్కోరులో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.

స్కోరుబోర్డు

భారత్ ఇన్నింగ్స్:
రోహిత్ శర్మ 208 నాటౌట్,
శిఖర్ ధావన్ సి లాహిరు తిరిమానే బి సచిత్ మథిరన 68,
శ్రేయాస్ అయ్యర్ సి సబ్‌స్టిట్యూట్ (చతురంగ డిసిల్వ) బి తిసర పెరెరా 88,
మహేంద్ర సింగ్ ధోనీ ఎల్‌బి తిసర పెరెరా 7,
హార్దిక్ పాండ్య సి లాహిరు తిరిమానే బి తిసర పెరెరా 8,
ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 392.
వికెట్ల పతనం: 1-115, 2-328, 3-354, 4-392.
బౌలింగ్: ఏంజెలో మాథ్యూస్ 4-1-9-0,
సురంగ లక్మల్ 8-0-71-0,
తిసర పెరెరా 8-0-80-3,
నువాన్ ప్రదీప్ 10-0-106-0,
అకిల ధనంజయ 10-0-51-0,
సచిత్ పథిరన 9-0-63-1,
అసెల గుణరత్నే 1-0-10-0.

శ్రీలంక ఇన్నింగ్స్:

ధనుష్క గుణతిలక సి ధోనీ బి జస్‌ప్రీత్ బుమ్రా 16,
ఉపుల్ తరంగ సి దినేష్ కార్తీక్ బి హార్దిక్ పాండ్య 7,
లాహిరు తిరిమానే బి వాషింగ్టన్ సుందర్ 21,
ఏంజెలో మాథ్యూస్ 111 నాటౌట్,
నిరోషన్ డిక్‌విల్లా సి వాషింగ్టన్ సుందర్ బి యుజువేంద్ర చాహల్ 22,
అసెల గుణరత్నే స్టంప్డ్ ధోనీ బి యుజువేంద్ర చాహల్ 34,
తిసర పెరెరా సి ధోనీ బి యుజువేంద్ర చాహల్ 5,
సచిత్ పథిరన సి శిఖర్ ధావన్ బి భువనేశ్వర్ కుమార్ 2,
అకిల ధనంజయ సి రోహిత్ శర్మ బి జస్‌ప్రీత్ బుమ్రా 11,
సురంగ లక్మల్ 11 నాటౌట్,
ఎక్‌స్ట్రాలు 11, మొత్తం
(50 ఓవర్లలో 8 వికెట్లకు) 251.

వికెట్ల పతనం:
1-15, 2-30, 3-62, 4-115, 5-159, 6-166, 7-180, 8-207.

బౌలింగ్:

భువనేశ్వర్ కుమార్ 9-0-40-1,
హార్దిక్ పాండ్య 10-0-39-1,
జస్‌ప్రీత్ బుమ్రా 10-0-43-2,
వాషింగ్టన్ సుందర్ 10-0-65-1,
యుజువేంద్ర చాహల్ 10-0-60-3,
శ్రేయాస్ అయ్యర్ 2-0-2-0.