క్రీడాభూమి

టి-20 ప్రపంచ కప్ సెమీస్‌కు విండీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, మార్చి 25: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న వెస్టిండీస్ జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా శుక్రవారం నాగ్‌పూర్‌లో ఉత్కంఠ భరితంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటుకోవడంతో సెమీఫైనల్ బెర్తు ఖరారైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన చివరి ఓవర్‌లో సిక్సర్ బాది 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కార్లోస్ బ్రాత్‌వైట్ వెస్టిండీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మర్లాన్ శామ్యూల్స్ (44) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ క్వింటోన్ డీకాక్ మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఓవర్‌లో ఓపెనర్ హషీమ్ ఆమ్లా (1), రెండో ఓవర్‌లో కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (9), మూడో ఓవర్‌లో రిలీ రొస్సోవు (0) త్వరత్వరగా నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికా జట్టు 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో క్వింటోన్ డీకాక్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన వారిని నుంచి సరైన సహకారం లభించలేదు. సీనియర్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ (10), డేవిడ్ మిల్లర్ (1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా, 46 బంతుల్లో 47 పరుగులు సాధించిన డీకాక్ 16వ ఓవర్‌లో ఆండ్రూ రసెల్ వేసిన బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత డేవిడ్ వైస్ 28 పరుగులు, ఆరోన్ పంగిసో 4 పరుగులు సాధించి పెవిలియన్‌కు చేరగా, క్రిస్ మోరిస్ (16) అజేయంగా నిలిచాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో క్రిస్ గేల్, డ్వెన్ బ్రావో, ఆండ్రూ రసెల్ రెండేసి వికెట్లు సాధించారు.
అనంతరం 123 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు కూడా ఆరంభంలో తడబడింది. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ (4), ఆండ్రూ ఫ్లెచర్ (11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో 34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టును ఓపెనర్ జాన్సన్ చార్లెస్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మర్లాన్ శామ్యూల్స్ ఆదుకున్నారు. స్థిమితంగా ఆడిన వీరు మూడో వికెట్‌కు 32 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం చార్లెస్ (32) వైస్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు దొరికిపోగా, అతని స్థానంలో వచ్చిన బ్రావో (8), ఆండ్రూ రసెల్ (4), కెప్టెన్ డారెన్ సమీ (0) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తారు. కొద్దిసేపటికి మర్లాన్ శామ్యూల్స్ (44 బంతుల్లో 44 పరుగులు) కూడా క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. అయితే చివర్లో కార్లోస్ బ్రాత్‌వైట్ (10), వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్ (1) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టుకు ఇది రెండో ఓటమి. దీంతో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు అడుగంటిపోయాయి.