క్రీడాభూమి

ఆసీస్ ఆశలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, మార్చి 25: ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరాలన్న ఆశలను ఆస్ట్రేలియా సజీవంగా నిలబెట్టుకుంది. మొహాలీలోని ఐఎస్.బింద్రా స్టేడియంలో శుక్రవారం గ్రూప్-2లో జఠిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించగా, పాక్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. లీగ్ దశలో ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియాకు ఇది రెండో విజయం కాగా, లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసిన పాకిస్తాన్‌కు ఇది మూడో ఓటమి. దీంతో పాకిస్తాన్ జట్టు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. బౌలింగ్‌లో చక్కగా రాణించి ఆస్ట్రేలియా విజయంలో ముఖ్యపాత్ర పోషించిన జేమ్స్ ఫాల్క్‌నర్ (5/27) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (21), ఆరోన్ ఫించ్ (15)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ (9) స్వల్పస్కోర్లకే నిష్క్రమించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో కెప్టెన్ స్టీవెన్ స్మిత్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. స్థిమితంగా ఆడుతూ పాక్ బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన అతనికి గ్లెన్ మ్యాక్స్‌వెల్ చక్కటి సహకారాన్ని అందించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న స్మిత్ నాలుగో వికెట్‌కు 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లు సహా 30 పరుగులు) ఇమద్ వాసిమ్ బౌలింగ్‌లో అహ్మద్ షెహజాద్‌కు దొరికిపోగా, అతని స్థానంలో దిగిన షేన్ వాట్సన్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుని స్మిత్‌కు సహకరించాడు. దీంతో 35 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్న స్మిత్ మొత్తం మీద 43 బంతుల్లో 61 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలువగా, దూకుడుగా ఆడిన వాట్సన్ 21 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్ల సహాయంతో 44 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో వహాబ్ రియాజ్, ఇమద్ వాసిమ్ రెండేసి వికెట్లు అందుకున్నారు.
అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ స్వల్ప స్కోరుకే అహ్మద్ షెహజాద్ (1) వికెట్‌ను చేజార్చుకుంది. అయితే ఓపెనర్ షర్జీల్ ఖాన్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఖలీద్ లతీఫ్ కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరి ప్రయత్నాలు ఎంతోసేపు కొనసాగలేదు. రెండో వికెట్‌కు 20 పరుగులు జోడించిన తర్వాత షర్జీల్ ఖాన్ (30) జేమ్స్ ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అతని స్థానంలో దిగిన ఉమర్ అక్మల్ కూడా కొద్దిసేపు స్థిమితంగా ఆడి లతీఫ్‌కు సహకరించాడు. దీంతో మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత అక్మల్ (32)ను ఆడమ్ జంపా క్లీన్‌బౌల్డ్ చేయగా, అతని స్థానంలో దిగిన కెప్టెన్ షహీద్ అఫ్రిదీ (14), లతీఫ్ (46) త్వరత్వరగా నిష్క్రమించారు. ఈ తరుణంలో షోయబ్ మాలిక్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఒంటరి పోరాటం సాగించినప్పటికీ మిగిలిన వారి నుంచి అతనికి సహకారం లభించలేదు. ఇమద్ వాసిం (0), సర్‌ఫ్రాజ్ అహ్మద్ (2), వహాబ్ రియాజ్ (0) పెవిలియన్‌కు క్యూకట్టగా, షోయబ్ మాలిక్ (20 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు సహా 40 పరుగులు), మొహమ్మద్ సమీ (4) అజేయంగా నిలిచారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే రాబట్టిన పాకిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జేమ్స్ ఫాల్క్‌నర్ అద్భుతంగా రాణించి 27 పరుగులకే 5 వికెట్లు కైవసం చేసుకోగా, ఆడమ్ జంపా రెండు వికెట్లు, జోష్ హాజెల్‌వుడ్ ఒక వికెట్ అందుకున్నారు.