క్రీడాభూమి

నాకౌట్ మ్యాచ్‌కి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో ఆడిన గత ఐదు టి-20 ఇంటర్నేల్ మ్యాచ్‌ల్లో భారత్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో మరోసారి విజయభేరి మోగించి, తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. 2013 అక్టోబర్ 10న రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా, 2014 మార్చి 30న 73 పరుగులు, ఈఏడాది జనవరి 26న అడెలైడ్ మ్యాచ్‌లో 37, జనవరి 29న మెల్బోర్న్‌లో జరిగిన పోరులో 27 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేసింది. చివరి సారి, జనవరి 31న సిడ్నీలో జరిగిన మ్యాచ్‌ని ఏడు వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఈ గణాంకాలు టీమిండియాను ఫేవరిట్‌గా నిలబెడుతున్నాయ. అయతే, భారత్ ఆధిపత్యానికి గండి కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా కూడా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది.
---
మొహాలీ, మార్చి 26: భారత్, ఆస్ట్రేలియా జట్లు టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగే తమతమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకోగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నిష్క్రమించాయి. భారత్, ఆసీస్ చెరి మూడు మ్యాచ్‌లు ఆడి, రెండేసి విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్ల చెరి నాలుగు పాయింట్లు సంపాదించాయి. దీనితో చివరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. ఒక రకంగా ఇది రెండు జట్లకు నాకౌట్ లేదా క్వార్టర్ ఫైనల్‌గా చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడి, 47 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు ఆతర్వాత ఎదురుదాడి చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. కానీ, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో తడబడింది. చివరిలో అదృష్టం వరించడంతో ఒక పరుగు తేడాతో గెలిచింది. హార్దిక్ పాండ్య చివరి ఓవర్ చివరి మూడు బంతుల్లో బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోవడంతో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. ‘హాట్ ఫేవరిట్’గా బరిలోకి దిగిన టి-20 ఫార్మెట్ నంబర్ వన్ జట్టు టీమిండియా నిలకడలేని ఆటతో అభిమానులను భయపెడుతున్నది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని జట్టుకు ఈతీరు ఒక ఆనవాయితీగా మారింది. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి మేటి బ్యాట్స్‌మెన్ భారత జట్టులో ఉన్నారు. కెప్టెన్ ధోనీ కూడా మ్యాచ్ విన్నరే. కానీ, వీరంతా ఎప్పుడు రాణిస్తారో తెలియని పరిస్థితి. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం, నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు పారేసుకోవడం టీమిండియా బలహీనతలు. యువరాజ్ సింగ్‌కు మొహాలీ హోంగ్రౌండ్ కావడంతో తుది జట్టులో అతనికి అవకాశం దక్కడం ఖాయం. యువీకి మొహాలీలో మ్యాచ్ ఆడడం వల్ల ప్రేక్షకుల మద్దతు లభిస్తుంది. అదే సమయంలో అతనిపై ఒత్తిడి కూడా తీవ్రమవుతుంది. బ్యాటింగ్‌లో తిరుగులేదని నిర్లక్ష్యంగా ఆడకుండా, నిలదొక్కుకొని ఆడితే తప్ప ఆసీస్‌ను ఓడించడం సాధ్యం కాదు.
బౌలింగ్ బలహీనం!
బ్యాటింగ్ విభాగంతో పోలిస్తే భారత బౌలింగ్ బలహీనంగా కనిపిస్తున్నది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు. స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా కూడా సంతృప్తికరంగానే ఆడుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వంటి జట్టును నిలువరించడానికి వీరంతా సర్వశక్తులు ఒడ్డాల్సి ఉంటుంది. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య భారీగా పరుగులు ఇస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన అతను హీరో అయ్యాడు. చివరి బంతికి ముస్త్ఫాజుర్ రహ్మాన్ రనౌట్ కావడం కూడా పాండ్యకు కలిసొచ్చింది. కానీ, నిలకడగా బంతులు వేయకుండా, చివరి క్షణాల్లో అదృష్టం వరించి నెగ్గడం ప్రతిసారీ సాధ్యపడదు. భారత బౌలర్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోకపోతే, భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.
పుంజుకుంటున్న స్మిత్ బృందం
స్టీవెన్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు బలాన్ని పుంజుకుంటున్నది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు గట్టిపోటీనిచ్చినప్పటికీ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు ఆతర్వాత లోపాలను సరిదిద్దుకొని, బంగ్లాదేశ్‌పై మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. రోజురోజుకు పుంజుకుంటున్న ఆసీస్ జట్టు కూడా బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉంది. కెప్టెన్ స్మిత్‌తోపాటు షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజా వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. గ్లేన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ ఆల్‌రౌండర్ల రూపంలో సేవలు అందిస్తున్నారు. నాథన్ కౌల్టర్ నైల్, జేమ్స్ ఫాల్క్‌నెర్, జొష్ హాజెల్‌వుండ్ వంటి మేటి బౌలర్ల అండ ఆస్ట్రేలియాకు ఉంది. ఏ రకంగా చూసినా భారత్‌కు సమవుజ్జీగా కనిపిస్తున్న ఆసీస్ సమీస్‌లో స్థానం కోసం పోరాటం చేయడం ఖాయం. పైగా ఈటోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు వాట్సన్ ఇప్పటికే ప్రకటించాడు. అతనితో సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలన్న పట్టుదల కూడా ఆసీస్ ఆటగాళ్లకు ఉంది. ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండడంతో ఆదివారం నాటి మ్యాచ్ ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది.