క్రీడాభూమి

ఒత్తిడిలో టీమిండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 12: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా తీవ్రమైన ఒత్తిడి మధ్య రెండో టెస్టుకు సిద్ధమవుతున్నది. కేప్ టౌన్‌లో జరిగిన మొదటి టెస్టు లో స్కోరింగ్ మ్యాచ్‌గా ముగిసిన విషయం తెలిసిందే. శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టును గెల్చుకుంటే తప్ప, ఈ సిరీస్‌ను సాధించే అవకాశాలను భారత క్రికెట్ జట్టు సజీవంగా నిలబెట్టుకోలేదు. రెండో టెస్టు చేజార్చుకున్నా లేదా డ్రాగా ముగించినా, దక్షిణాఫ్రికాలో మొదటిసారి టెస్టు సిరీస్‌ను అందుకోవాలన్న టీమిండియా కల నెరవేరదు. వరుసగా రెండు టెస్టుల్లో విజయాలను నమోదు చేసి, సిరీస్‌ను సాధించడం ద్వారా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించాలని అభిమానులను కోరుకుంటున్నప్పటికీ, అది అనుకున్నంత సులభం కాదు. దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్ ప్రదర్శనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అక్కడ సిరీస్‌ను గెల్చుకోవడం సాధ్యమా? అన్న ప్రశ్నకు సులభంగానే సమాధానం లభిస్తుంది.
ఇంత వరకూ దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటనను ఒకసారి మననం చేసుకుంటే, చేదు అనుభవాలే తప్ప, ఆశాజనకమైన అంశాలు చాలా తక్కువ. 56 రోజుల సుదీర్ఘ టూర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టెస్టులు, ఆరు వనే్డ, మరో మూడు టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. 1992లో తొలిసారి దక్షిణాఫ్రికాకు వెళ్లిన భారత్‌కు తాజా టూర్ ఏడోది. గత ఆరు టెస్టు సిరీస్‌ల్లో ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. 2015 ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఆడిన ప్రతి టెస్టు సిరీస్‌లోనూ విజయాలను నమోదు చేస్తున్న టీమిండియా అదే ఒరవడిని కొనసాగించి, దక్షిణాఫ్రికాపైనా సిరీస్‌ను సాధిస్తుందా లేక గతం మాదిరిగానే వైఫల్యాలను మూటగట్టుకుంటుందా అన్నది ఆసక్తి రేతున్నది. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉండే, దక్షిణాఫ్రికాది రెండో స్థానం. అంటే, రెండు ప్రపంచ మేటి జట్ల మధ్య పోరాటం జరగనుంది. సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, భారత్ నంబర్ వన్ స్థానానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ, స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అనే ముద్ర నుంచి బయటపడే అవకాశాన్ని కోల్పోతుంది. శుక్రవారం నుంచి ఇక్కడ మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, గత సిరీస్‌లపై ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జాత్యాహంకార విధానాలను అవలంభిస్తూ, వెలికి గురైన దక్షిణాఫ్రికా తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత, ఆ దేశంలో తొలిసారి భారత జట్టు పర్యటించింది. 1992-93 సీజన్‌లో జరిపిన ఈ టూర్‌లో భారత్ మొత్తం మూడు టెస్టులు ఆడింది. మొదటి టెస్టుకు వర్షం వల్ల అంతరాయం కలగడంతో, అది డ్రాగా ముగిసింది. ప్రవీణ్ ఆమ్రే సెంచరీ ఒక్కటే ఆ మ్యాచ్‌లో కీలక అంశం. రెండో టెస్టులో, విజయానికి 318 పరుగులు సాధించాల్సి ఉండగా, మ్యాచ్ డ్రాగా ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లకు 141 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో సచిన్ తెండూల్కర్ సెంచరీ చేయడం, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే ఆరు వికెట్లు కూల్చడం ఈ టెస్టులో ప్రధానాంశాలు. మొదటి రెండు టెస్టులు డ్రా కావడంతో మూడో టెస్టులో ఫలితం కోసం ఇరు జట్లు ప్రయత్నించాయి. కపిల్ దేవ్ ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో 129 పరుగులు సాధించినప్పటికీ, ఆ టెస్టును భారత్ గెల్చుకోలేకపోయింది. 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన దక్షిణాఫ్రికా చివరిదైన నాలుగో టెస్టును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చాలా నింపాదిగా ఆడి, ఒక ఓవర్‌కు సగటున కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాయి. దీనితో మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వెల్లడి కాలేదు. సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 తేడాతో గెల్చుకొని బోణీ చేసింది. అప్పుడు మొదలైన భారత్ పరాజయాల పర్వం దక్షిణాఫ్రికాలో ఆతర్వాత కూడా కొనసాగింది. 1996-97 సీజన్‌లో మూడు టెస్టు ఆడింది. రెండింటిని కోల్పోగా, ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకొని, 0-2 తేడాతో సిరీస్‌ను సమర్పించుకుంది. 2001-02 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. ఒక పరాజయాన్ని చవిచూసి, 0-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 2006-07 టూర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి, ఒక విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు అదే తొలి విజయం. అయితే, రెండు పరాజయాలను చవిచూడడంతో, సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకుంది. 2010-11 టూర్‌లో మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓడి, ఒక విజయాన్ని నమోదు చేసింది. మరో టెస్టు డ్రా అయింది. మొటదిసారి దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను భారత్ పరాజయంతో కాకుండా డ్రాతో ముగించింది. 2013-14 టూర్‌లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓటమి వెక్కిరించగా, మరో టెస్టు డ్రా అయింది. ఫలితంగా సిరీస్‌లో టీమిండియా 0-1 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, దక్షిణాఫ్రికా టూర్ భారత జట్టుగా అంతగా కలిసొచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఆరు సిరీస్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలై, ఒకసారి మాత్రం డ్రాతో గట్టెక్కింది. ఈసారి టూర్‌లో అద్భుతాలు సృష్టించకపోయినా, డ్రా చేసుకుంటే గెలిచినంత గొప్పగా భావించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న భారత్‌కు సిరీస్ విజయం కష్టం కాదని, మొదటిసారి టెస్టు సిరీస్‌ను గెల్చుకొని స్వదేశం చేరుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాలు సరైనవో, ఎవరి జోస్యాలు ఫలిస్తాయో చూడాలి.
మొత్తం మీద, ఈ గణాంకాలన్నీ దక్షిణాఫ్రికాలో భారత్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా ఉండదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేప్ టౌన్‌లో జరిగిన టెస్టులో అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు మూకుమ్మడిగా విఫలమై, జట్టు ఓటమికి కారకులయ్యారు. ఆ వైఫల్యాలను ఎంత వరకూ అధిగమించి, రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు ఏ స్థాయిలో పోటీనిస్తుందనే అంశంపైనే ఈ సిరీస్ భవిష్యత్తు ఆధారపడుతుంది.