క్రీడాభూమి

6 వికెట్లకు 265

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 13: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం ఇక్కడ మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో ఇరు జట్లు సమాన ప్రతిభ కనబరిచాయి. మొదటి రెండు సెషన్లలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగితే, మూడో సెషన్ చివరిలో, ఆతర్వాత నాలుగో సెషన్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. మొత్తం మీద మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 24, కేశవ్ మహారాజ్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అశ్విన్ 90 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ఇశాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు డీన్ ఎల్గార్, ఎయిడెన్ మర్‌క్రామ్ బలమైన పునాది వేసేందుకు ప్రయత్నించారు. అయితే, తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించిన వీరి భాగస్వామ్యాన్ని అశ్విన్ ఛేదించాడు. 84 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 31 పరుగులు చేసిన ఎల్గార్‌ను మురళీ విజయ్ క్యాచ్ పట్టగా, అశ్విన్ ఔట్ చేశాడు. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్న మర్‌క్రామ్ రెండో వికెట్‌కు హషీం ఆమ్లాతో కలిసి 63 పరుగులు జోడించాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే, వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు దొరికిపోయిన అతను 150 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్న అతని స్కోరులో 15 ఫోర్లు ఉన్నాయి. స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 153 బంతుల్లో, 14 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసిన హషీం ఆమ్లా భారత ఫీల్డర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో విఫలమై రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్య వేసిన బంతిని అతను షార్ట్ లెగ్ దిశగా కొట్టి, పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే, ఓవర్ త్రూలోనే వేగంగా పరిగెత్తిన హార్దిక్ బంతిని నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌ను గురిచేసి విసిరాడు. అది నేరుగా వికెట్లకు తగలడంతో, ఆమ్లా పెవిలియన్ చేరాడు. క్వింటన్ డికాక్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే వెనుదిరిగాడు. అశ్విన్ వేసిన బంతిని సమర్థంగా ఆడలేకపోయిన అతను విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 250 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. వెర్నన్ ఫిలాండర్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌటయ్యాడు. బంతిని ఫీల్డ్ చేసిన హార్దిక్ దానిని నేరుగా వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు అందించాడు. ఫిలాండర్ క్రీజ్‌లోకి చేరుకోక ముందే అతను స్టంప్స్‌ను తొలగించాడు. కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (24), కేశవ్ మహారాజ్ (10) క్రీజ్‌లో ఉండగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 265 పరుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయింది.
*సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో దక్షిణాఫ్రికా 23వ టెస్టు ఆడుతున్నది. ఇప్పటి వరకూ జరిగిన 22 టెస్టుల్లో 17 విజయాలు సాధించింది. రెండు పరాజయాలను ఎదుర్కోగా, మిగతా మూడు టెస్టులు డ్రాగా ముగిశాయ.

*హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతున్న ఎయిడెన్ మర్‌క్రామ్ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి, గత ఆరు ఇన్నింగ్స్‌లో 16, 119, 87, 51 (నాటౌట్), 56 (నాటౌట్), 18 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 94 పరుగులు సాధించి, అభిమానులను అలరించాడు. డీన్ ఎల్గార్‌తో కలిసి అతను మొదటి వికెట్‌కు యాభై లేదా అంతకు మించి పరుగులు జోడించడం ఏడు ఇన్నింగ్స్‌లో ఇది ఐదోసారి.
స్కోరుబోర్డు
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గార్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 31, ఎయిడెన్ మర్‌క్రామ్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 94, హషీం ఆమ్లా రనౌట్ 82, ఏబీ డివిలియర్స్ బి ఇశాంత్ శర్మ 20, ఫఫ్ డు ప్లెసిస్ 24 నాటౌట్, క్వింటన్ డికాక్ సి విరాట్ కోహ్లీ బి అశ్విన్ 0, వెర్నన్ ఫిలాండర్ రనౌట్ 0, కేశవ్ మహారాజ్ 10 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (90 ఓవర్లలో 6 వికెట్లకు) 265.
వికెట్ల పతనం: 1-85, 2-148, 3-199, 4-246, 5-250, 6-251.
బౌలింగ్: బుమ్రా 18-4-57-0, షమీ 11-2-46-0, ఇశాంత్ శర్మ 16-3-32-1, హార్దిక్ పాండ్య 14-4-37-0, అశ్విన్ 31-8-90-3.

చిత్రం..ఎయిడెన్ మర్‌క్రామ్