క్రీడాభూమి

సంచలన విజయంతో అఫ్గాన్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 27: ‘పసికూన జట్టు’ అఫ్గానిస్తాన్ టి-20 వరల్డ్ కప్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్-1లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన వెస్టిండీస్ దూకుడుకు కళ్లెం వేసింది. విజయగర్వంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసింది. మహమ్మద్ షెజాద్ 24, కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జయ్ 16 పరుగులతో రాణించారు. నజీబుల్లా జద్రాన్ 40 బంతులు ఎదుర్కొని, 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, అఫ్గాన్‌ను ఆదుకున్నాడు. అతనితోపాటు రషీద్ ఖాన్ (6) కూడా నాటౌట్‌గా నిలిచాడు. విండీస్ బౌలర్లలో సామ్యూల్ బద్రీ 14 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. ఆండ్రి రసెల్ 23 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.
అఫ్గాన్‌ను ఓడించి, గ్రూప్ దశలో న్యూజిలాండ్ మాదిరి క్లీన్‌స్వీప్ చేయడానికి 124 పరుగులు సాధించాల్సిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేయగలిగింది. జాన్సన్ చార్లెస్ 22, దనీష్ రాందిన్ 18, డ్వెయిన్ బ్రేవో 28 చొప్పున పరుగులు సాధించారు. ఫస్ట్‌డౌన్ ఆటగాడు ఆండ్రి ఫ్లెచర్, కార్లొస్ బ్రాత్‌వెయిట్ క్రీజ్‌లో ఉన్న సమయంలో విండీస్ విజయం ఖాయంగా కనిపించింది. 19 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు విజయానికి కేవలం 10 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, మహమ్మద్ నబీ చివరి ఓవర్‌ను పకడ్బందిగా వేసి, విండీస్‌పై అఫ్గాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. అతను ఆ ఓవర్‌లో కేవలం మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ మ్యాచ్ ఫలితం వల్ల ఇరు జట్లకు లాభనష్టాలేవీ లేకపోయినా, వరుస విజయాల విండీస్‌కు బ్రేక్ పడడం, బలమైన జట్టును అఫ్గాన్ ఓడించడం అరుదైన సంఘటనలుగా చెప్పుకోవాలి. అఫ్గాన్ టాప్ స్కోరర్ నజీబుల్లా జద్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 (మహమ్మద్ షెజాద్ 24, అస్గర్ స్టానిక్‌జయ్ 16, నజీబుల్లా జద్రాన్ 48 నాటౌట్, సామ్యూల్ బద్రీ 3/14, ఆండ్రి రసెల్ 2/23).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 (జాన్సన్ చార్లెస్ 22, ఆండ్రె ఫ్లెచర్ 11 నాటౌట్, రాందిన్ 18, డ్వెయిన్ బ్రేవో 28, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 13, మహమ్మద్ నబీ 2/26, రషీద్ ఖాన్ 2/26).
విండీస్ క్రీడాస్ఫూర్తి
నాగపూర్: వరుస విజయాలకు బ్రేక్ పడినప్పటికీ వెస్టిండీస్ జట్టు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గాన్‌ను ఎదుర్కొన్న విండీస్ 6 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. వరుసగా మూడు విజయాలను సాధించిన తర్వాత అనూహ్యంగా అఫ్గాన్ చేతిలో ఓడడంతో దిగ్భ్రాంతికి గురైన విండీస్ వెంటనే తేరుకుంది. ఆనందంతో గంతులు వేస్తున్న అఫ్గాన్ క్రీడాకారులను విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, కోచ్ ఫిల్ సిమన్స్ ముందుగా మైదానంలోకి వచ్చి అభినందించారు. ఆతర్వాత మిగతా ఆటగాళ్లు కూడా అఫ్గాన్ క్రికెటర్లతో కరచాలనం చేస్తూ, వారిని అభినందించారు. అఫ్గాన్ ఆటగాళ్లు సంతోషంగా నృత్యం చేస్తుండగా, గేల్ వారితో కలిసి స్టెప్పులేశాడు. క్రీడాస్ఫూర్తికి ఎల్లలు లేవని నిరూపించాడు.