క్రీడాభూమి

టీమిండియాను ముంచేసిన తప్పుడు నిర్ణయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, జనవరి 18: కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే భారత క్రికెట్ జట్టును ముంచేశాయా? పొరపాటు నిర్ణయాలకు ఆటగాళ్ల నిర్లక్ష్యం కూడా తోడైన కారణంగానే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమిపాలైందా? మూడుమ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండానే కోల్పోవడానికి గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా ఒక కారణమా? నిపుణులు, విశే్లషకులు ఔననే అంటున్నారు. చాలా మంది అభిప్రాయం ప్రకారం, దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడడానికి స్వయంకృతమే ప్రధాన కారణం. కేప్ టౌన్‌లో మొదటి టెస్టును కోల్పోయిన తర్వాత, సెంచూరియన్ టెస్టుకు కోహ్లీ మూడు మార్పులు చేశాడు. శిఖర్ ధావన్ స్థానంలో లోకేష్ రాహుల్‌ను తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్‌ను తప్పించి, ఇశాంత్ శర్మకు ఆహ్వానం పలికాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహాను బెంచ్‌కి పరిమితం చేసి, పార్థీవ్ పటేల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. మంచి ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్‌ను తప్పించడం, అజింక్య రహానేను తీసుకోకుండా లోకేష్ రాహుల్‌కు అవకాశం ఇవ్వడంపై ఆరంభంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. విదేశాల్లో గొప్పగా రాణించే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్‌గా రహానేకు మంచి పేరు ఉంది. గత ఐదు ఇన్నింగ్స్‌లో అతను 17 పరుగులు మాత్రమే చేశాడు. అంతమాత్రం చేత, విదేశాల్లో అతని రికార్డులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు. జస్‌ప్రీత్ బుబ్రాను కొనసాగించి, భువీకి మొండి చేయి చూపించడం, ఇశాంత్‌ను ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకోవడం విమర్శలకు కారణమైంది. మొత్తం మీద తుది జట్టు ఎంపిక సక్రమంగా లేదన్నది అందరి ఏకాభిప్రాయం.
బ్యాట్స్‌మెన్ వైఫల్యం
దక్షిణాఫ్రికా బౌలర్లు సమర్థులనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, భారత బ్యాట్స్‌మెన్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నిజానికి టీమిండియా తక్కువ స్కోర్లకే ఆలౌట్ కావడానికి దక్షిణాఫ్రికా బౌలర్ల ప్రతిభ కంటే భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్న వాదన బలంగా వినిపిస్తున్నది. భారత బౌలర్లు నుంచి కొన్ని సందర్భాల్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, క్రీజ్‌లో నిలదొక్కుకోవాలన్న పట్టుదల, జట్టుకు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు అందించాలన్న తపన వారిలో స్పష్టంగా కనిపించింది. ఆ లక్షణాలు భారత బ్యాట్స్‌మెన్‌లో లేకపోవడం దురదృష్టకరం. రెండో టెస్టులో ఏబీ డివిలియర్స్ మైదానంలోకి దిగేసమయానికి దక్షిణాఫ్రికా కేవలం మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ, డివిలియర్స్ బాధ్యతాయుతమైన ఆట ఆ జట్టును ఆదుకుంది. అలాంటి ఏకాగ్రత, అంకిత భావం భారత బ్యాట్స్‌మెన్‌లో లేదనడం తప్పుకాదు. మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడాన్ని మినహాయిస్తే, కీలకమైన రెండో టెస్టులో భారత బ్యాటింగ్ గురించి చెప్పడానికి ఏమీ లేదు.
నాసిరకమైన బౌలింగ్
బౌలింగ్ కాంబినేషన్‌ను మార్చాలన్న కోహ్లీ నిర్ణయం సిరీస్‌ను భారత్‌కు దూరం చేసింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇశాంత్ శర్మసహా ఎవరూ అద్భుతంగా బౌల్ చేయలేకపోయారు. ఆరంభంలో పైచేయి సంపాదించినప్పటికీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను సకాలంలో కట్టడి చేయలేకపోయారు. మొత్తానికి బ్యాట్స్‌మెన్ వైఫల్యాలతోపాటు, నాసిరకమైన బౌలింగ్ కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ, అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. బౌలర్ల ఎంపికైలో కోహ్లీ చేసిన పొరపాట్లే భారత దయనీయమైన పరిస్థితికి ఒక కారణం.
అంతులేని నిర్లక్ష్యం
భారత ఆటగాళ్లలో అంతులేని నిర్లక్ష్యం రెండు మ్యాచ్‌ల్లోనూ స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసిన కారణంగా మొదటి టెస్టును చేజార్చుకుందని సరిపుచ్చుకోవచ్చు. కానీ, రెండో టెస్టులోనూ అలాంటి సంఘటనలే పునరావృతమయ్యాయి. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్య రనౌటైన తీరే ఇందుకు ఉదాహరణ. కెప్టెన్ కోహ్లీతో కలిసి 45 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన పాండ్య అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. బంతి స్టంప్స్‌ను తలిగే సమయానికి పాండ్య కాలుగానీ, బ్యాట్‌గానీ క్రీజ్‌లో లేవు.
వికెట్ల మధ్య పరిగెత్తడంలో చటేశ్వర్ పుజారా దారుణంగా విఫలమయ్యాడు. అతను రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో రనౌట్ కావడమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఒక టెస్టులో రెండు పర్యాయాలు రనౌటైన తొలి భారత క్రికెటర్ అతనే. ప్రపంచ టెస్టు క్రికెట్‌లో అతనికి 25వ స్థానం. మొదటి ఇన్నింగ్స్‌లో రనౌటైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, రెండో ఇన్నింగ్స్‌లో జాగ్రత్త పడాలన్న ఆలోచన పుజారాకు లేకపోయింది. కోహ్లీ అతనికి సరైన సూచనలు చేయలేదు. కెప్టెన్‌తోపాటు ఆటగాళ్ల నరనరాల్లో జీర్ణించుకుపోయిన నిర్లక్ష్యమే భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది.
రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ కొద్దిపాటి ప్రతిఘటనను తప్పించి, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో సఫలమైన సందర్భాలు లేదు. దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నదనే విషయాన్ని గమనించినప్పటికీ, షాట్ల ఎంపికలో చేసిన పొరపాట్లు భారత బ్యాటింగ్‌ను నిలువునా ముంచేశాయి. ఆఫ్ స్టంప్ నుంచి దూరంగా దూసుకెళుతున్న బంతిని వెంటాడి మరీ స్లిప్స్ లేదా గల్లీ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ కావడం భారత బ్యాట్స్‌మెన్‌కు అలవాటుగా మారింది. మాజీ బ్యాట్స్‌మన్ చందూ బోర్డే వంటి ఎంతో మంది హెచ్చరించినప్పటికీ, భారత బ్యాట్స్‌మెన్ తమ తీరు మార్చుకోలేదు. ఫలితంగా భారీ మూల్యానే్న చెల్లించుకున్నారు. ‘స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి’ అనే విమర్శ సరైనదేనని తమ చేష్టలతో నిరూపించారు. అంతా కలిసి అభిమానులను నిరాశకు గురి చేశారు.
*అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2017 ఉత్తమ వనే్డ క్రికెటర్‌గా ఎంపికైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. 2016 సెప్టెంబర్ 21 నుంచి 2017 సెప్టెంబర్ 20వ తేదీ మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనలను పరిశీలించి, విశే్లషించి, గణాంకాలను లెక్కగట్టి, కోహ్లీని ఉత్తమ వనే్డ క్రీడాకారుడిగా నిర్ధారించింది. ఉత్తమ టెస్టు కెప్టెన్ అవార్డుకు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్ స్మిత్ ఎంపికయ్యాడు.

చిత్రం..కోహ్లీ