క్రీడాభూమి

ఈ ప్రశ్నకు బదులేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జనవరి 22: దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు టెస్టులను కోల్పోయి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రత్యర్థికి సమర్పించుకున్న విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా చివరిదైన మూడో టెస్టును గెల్చుకుంటుందా లేక దానినీ చేజార్చుకొని వైట్‌వాష్ వేయించుకుంటుందా? అన్న ప్రశ్న అభిమానులను వేధిస్తున్నది. జరిగిన పొరపాట్లను గుర్తించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారా? అని అభిమానులు వేస్తున్న ప్రశ్నకు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి సరైన సమాధానమే లేదు. క్రికెట్‌ను భుజాలపై మోస్తూ, విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చిన అభిమానుల వల్లే కోట్లకు పడగలెత్తిన భారత క్రికెటర్లు చివరికి అభిమానులనే పట్టించుకోవడం లేదన్న విమర్శ ఈనాటిది కాదు. దక్షిణాఫ్రికా పర్యటనలోనూ భారత క్రికెటర్లు, ప్రత్యేకించి కెప్టెన్ కోహ్లీ టీమిండియాను సొంత జట్టుగా భావిస్తూ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కోట్లాది మందికి జవాబుదారీ వహించాల్సిన జట్టు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయడం లేదన్నది వాస్తవం. స్వదేశంలో పిచ్‌లను తమకు అనుకూలంగా సిద్ధం చేయించుకొని గెలుస్తున్నారే తప్ప భారత క్రికెటర్లలో పస లేదని, విదేశాల్లో పిల్లులుగా మారిపోయి, ప్రత్యర్థులకు దాసోహమంటారని తీవ్ర స్థాయిలో విమర్శించే వారి వాదనకు ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీమిండియా పరిస్థితి మరింత బలాన్నిస్తున్నదనేది ఎవరూ కాదనలేని నిజం.
ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు, స్టీవ్ స్మిత్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడంటూ కోహ్లీ చేసిన ఫిర్యాదును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుట్టదాఖలు చేసింది. అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే డీఆర్‌ఎస్‌కు వెళ్లే ముందు ఆసీస్ కెప్టెన్ స్మిత్ నిబంధనలను తుంగలోతొక్కాడన్నది కోహ్లీ ఆరోపణ. ఒక కెప్టెన్ చేసిన ఫిర్యాదును ఐసీసీ పట్టించుకోలేదంటే, అందులో ఏమాత్రం బలం ఉందో స్పష్టమవుతున్నది. భారత క్రికెట్ అధికారులనుగానీ, సపోర్టింగ్ స్ట్ఫానుగానీ సంప్రదించకుండా, ఏకపక్షంగా వ్యవహరించిన కోహ్లీ ఏకంగా బీసీసీఐ పరువు తీశాడన్న విమర్శలున్నాయి. ఇలా ఎందుకు వ్యవహరించాడనే ప్రశ్నకు కోహ్లీనే సమాధానం చెప్పాలి. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల్లో దొర్లిన పొరపాట్లను కోహ్లీ సరిదిద్దుకుంటాడో లేదో అన్న అనుమానం రావడానికి స్మిత్ ఉదంతమే కారణం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ, బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా నూటికి 120 శాతం సేవలు అందించారంటూ అందరికీ కితాబునిచ్చాడు. స్వదేశంలో చక్కగా ఆడినందుకే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లపై టీమిండియారు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి, సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇక 120 శాతం శ్రమిస్తే, దక్షిణాఫ్రికాలో ఎలాంటి ఫలితాలు రావాలి? రెండు టెస్టుల్లోనూ నాసిరకంగా ఆడి, సిరీస్‌ను ఎందుకు కోల్పోయింది? కోహ్లీ చేసిన ఫిర్యాదుల్లోనేకాదు.. అతని మాటల్లోనూ పస లేదన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తున్నది. పరాజయాలకు సరైన కారణాలు లేవన్న నిజాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో, విమర్శకులు సంధిస్తున్న ప్రశ్నలకు ఏదో ఒక జవాబు చెప్పి తప్పించుకోవాలని కోహ్లీ ప్రయత్నించాడని అతని వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా వాతావరణానికి అలవాటు పడేందుకేకాదు.. అక్కడి పిచ్‌ల తీరును పరిశీలించడానికి కూడా పనికొచ్చే ప్రాక్టీస్ మ్యాచ్‌ని కోహ్లీ బృందం ఎందుకు వద్దంది? ఈ ప్రశ్నకు ఇంత వరకూ జట్టు మేనేజ్‌మెంట్ నుంచి సమాధానం రాలేదు. అన్ని విభాగాల్లోనూ టీమిండియా విఫలమైందనేది అందరికీ తెలిసిన నిజం. ఆ వైఫల్యాల నుంచి బయటపడేందుకు ఏం చేస్తున్నారనే ప్రశ్నకు కూడా జవాబు రావడం లేదు. బుధవారం నుంచి మొదలయ్యే చివరి, మూడో టెస్టులో అనుసరించే విధానాలను, వ్యూహాలను బయటపెట్టకపోయినా, కనీసం తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా భారత జట్టు మేనేజ్‌మెంచ్ చెప్పకపోవడం దారుణం. తాము ఎవరికీ జవాబుదారీ కాదన్న రీతిలో టీమిండియా ఆటగాళ్లు ప్రవర్తించడం అన్యాయం. సోషల్ మీడియా ద్వారా అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వారిపై ఉంది. కాదూ.. కూడదూ అంటే, చివరి మ్యాచ్‌ని గెలిచి సత్తా చాటడమేగాక, ఆతర్వాత జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లను కూడా కొల్లగొట్టాలి. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, తీరును ఏమాత్రం మార్చుకోకుండా కోహ్లీ సేన ఇదే తీరును కొనసాగిస్తే, స్వదేశంలో వీరాభిమనుల నుంచే నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చిత్రం..టీమిండియా కోచ్ రవి శాస్ర్తి, కెప్టెన్ విరాట్ కోహ్లీ