క్రీడాభూమి

ఇండియా ఓపెన్ బాడ్మింటన్ సెమీస్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ శుక్రవారం ఇక్కడి సిరి ఫోర్ట్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌పై అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. గతంలో ఐదుసార్లు సంగ్‌ను మట్టికరిపించిన సైనా నెహ్వాల్ తాజాగా జరిగిన పోరు ఆరంభంలో ప్రత్యర్థి కంటే కాస్త వెనుకబడి తొలి గేమ్‌ను 19-21 తేడాతో చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత పుంజుకుని తీవ్రంగా శ్రమించింది. తనదైన శైలిలో విజృంభించి ఆడి పవర్‌ఫుల్ షాట్లతో సంగ్‌కు చుక్కలు చూపించింది. ఫలితంగా 21-14, 21-19 తేడాతో వరుసగా రెండు గేమ్‌లను కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. అనంతరం సైనా నెహ్వాల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో సంగ్ అద్భుతంగా ఆడిందని, ఆమె నుంచి ఇంత తీవ్రమైన పోటీ ఎదురవుతుందని ఊహించలేదని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ సంగ్‌పై మరోసారి విజయం సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సైనా స్పష్టం చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన మూడో సీడ్ క్రీడాకారిణి, ఒలింపిక్ చాంపియన్ లీ జెరుయితో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఉత్కంఠ భరితంగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్‌లో జెరుయి 22-20, 12-21, 21-17 గేముల తేడాతో చైనాకే చెందిన వాంగ్ షిగ్జియాన్‌ను ఓడించి సెమీఫైనల్‌లో ప్రవేశించింది.
ముగిసిన సింధు పోరాటం
ఇదిలావుంటే, ఈ టోర్నీలో ‘తెలుగు తేజం’ పివి.సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన సింధు శుక్రవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో 21-15, 15-21, 15-21 గేముల తేడాతో కొరియా క్రీడాకారిణి బే ఇయాన్ జు చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అభిమానులను తీవ్రంగా నిరాశపర్చిన సింధుకు ఇయాన్ చేతిలో ఇది మూడో ఓటమి.

మళ్లీ గ్లామర్‌కే పెద్దపీట
8న ఐపిఎల్-9 ఆరంభ వేడుకలు
ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న ‘టిబిసి’
ముంబయి, ఏప్రిల్ 1: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్‌కు మరికొద్ది రోజుల్లో తెర లేవబోతోంది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్, ఐపిఎల్‌లో కొత్తగా ప్రవేశించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ నెల 9వ తేదీన ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. దీంతో ఎప్పటి మాదిరిగానే మరోసారి గ్లామర్‌కు పెద్దపీట వేసి ఐపిఎల్-9 ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన జరిగే ఈ వేడుకల్లో పూర్తిగా మహిళలతో కూడిన ఇంగ్లాండ్ పాప్ బ్యాండ్ ‘టిబిసి’తో పాటు బాలీవుడ్ నటీనటులు తమ ఆట, పాటలు, అందచందాలతో అభిమానులను అలరించనున్నారు. భారత్‌లో ‘టిబిసి’ బ్యాండ్ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ పాప్ బృందంతో పాటు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణ్‌వీర్ సింగ్, యోయో హనీ సింగ్ తదితర బాలీవుడ్ స్టార్లు ఐపిఎల్-9 ఆరంభ వేడుకలకు మరింత సొబగులు అద్దనున్నారని ఈ ఉత్సవ నిర్వహణా హక్కులను కైవసం చేసుకున్న ‘ఫెర్రీస్‌వీల్ ఎంటర్‌టెయిన్‌మెంట్’ సంస్థ ఒక ప్రకనటలో పేర్కొంది.

మహిళల టి-20 ప్రపంచ కప్‌లో
నేడు ఆసీస్-విండీస్ టైటిల్ పోరు
ఫ్లై ఓవర్ ప్రమాద మృతులకు బ్లాక్‌వెల్ నివాళి
కోల్‌కతా, ఏప్రిల్ 1: మహిళల ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ టైటిల్ కోసం శనివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కోల్‌కతాలో గురువారం ఫ్లై ఓవర్ కుప్పకూలిన ఘటనలో పలువురు ప్రజలు దుర్మరణం చెందడం పట్ల ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలెక్స్ బ్లాక్‌వెల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె శుక్రవారం నివాళులర్పించింది. ‘కోల్‌కతా చేరుకున్న వెంటనే ఈ విషాద వార్త తెలిసింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని బ్లాక్‌వెల్ పేర్కొంది.