క్రీడాభూమి

‘రికార్డు’ ఫైనల్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెస్టిండీస్ జట్టు అంటే క్రిస్ గేల్ ఒక్కడే కాదని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ విండీస్‌లో గొప్ప ఆటగాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పాడు. ఈ టోర్నమెంట్‌కు రాక ముందే తనకు విండీస్ సత్తా ఏమిటో తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో విండీస్ విజయం సాధించిన తీరే ఆ జట్టు బలాన్ని తెలియ చేస్తున్నదని చెప్పాడు. అయతే, ప్రత్యర్థిని చూసి తాము బెంబేలెత్తడం లేదని, అలాగని తక్కువ అంచనా వేయడం లేదని స్పష్టం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బాగా పుంజుకున్నామని చెప్పాడు. ఫైనల్‌లో గెలవడమే తమ కష్టానికి తగిన ప్రతిఫలమని మోర్గాన్ అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, రెండు జట్లలో ఎన్నో వైరుధ్యాలు ఉన్నాయని అన్నాడు. ఒక జట్టుతో మరో జట్టును పోల్చడం తగదని చెప్పాడు. విజయమే లక్ష్యంగా ఆదివారం బరిలోక దిగుతామని మోర్గాన్ అన్నాడు.
--
గణాంకాలను పరిశీలిస్తే..
టి-20 ఫార్మెట్‌లో విజేత ఎవరన్నది ఎవరూ చెప్పలేరు. తమదైన రోజు చెలరేగిపోయే జట్టే గెలుస్తుంది. అందుకే అనామక జట్లు కూడా సంచలన విజయాలను సాధిస్తుంటాయి. అయితే, గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే, ఆదివారం నాటి టి-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్‌దే పైచేయిగా కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 13 టి-20 ఇంటర్నేషనల్స్‌లో తలపడ్డాయి. విండీస్ తొమ్మిది విజయాలు సాధించగా, ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్‌లను మాత్రమే గెల్చుకోగలిగింది. దీనిని బట్టి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌దే పైచేయిగా కనిపిస్తున్నది. కాగా, విండీస్ ఈసారి టి-20లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లను నమోదు చేసింది. ఈ జట్టు 36 సిక్స్‌లు కొడితే, ఇంగ్లాండ్ 34 సిక్సర్లతో రెండో స్థానంలో ఉంది. ప్రేక్షకులను అలరించడానికి ఈ సిక్సర్ల జట్లు ఆదివారం పోటీపడనున్నాయి. ఇలావుంటే, ఆదివారం జరిగే మ్యాచ్‌లో విజయం తమదేనని విండీస్ కెప్టెన్ సమీ ధీమా వ్యక్తం చేశాడు. ఓడడానికిగానీ, పేలవంగా ఆడి పరాజయాన్ని కొని తెచ్చుకో
వడానికిగానీ తాము సిద్ధంగా లేమన్నాడు.
--
కోల్‌కతా, ఏప్రిల్ 2: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఓ రికార్డు మ్యాచ్ ఆదివారం ప్రతిష్ఠాత్మక కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరగనుంది. ఇప్పటి వరకూ ఈ టోర్నీలో ఒకసారి టైటిల్ సాధించిన జట్టు రెండోసారి దానిని కైవసం చేసుకోలేదు. అయితే, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే ఒక్కోసారి విశ్వవిజేతగా నిలవడంతో, ఆదివారం నాటి విజేత రెండోసారి టి-20 వరల్డ్ కప్‌ను సాధించిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. 2010 ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ టైటిల్ సాధించింది. 2012లో శ్రీలంకతో ఫైనల్‌లో తలపడిన వెస్టిండీస్ 36 పరుగుల ఆధిక్యంతో గెలుపొంది పొట్టి ఫార్మెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి ఈరెండు జట్లు ఫైనల్ చేరడంతో, విజయం సాధించిన జట్టు రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదిస్తుంది.
ఫామ్‌లో వెస్టిండీస్
వెస్టిండీస్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఎదురైన ఓటమిని మినహాయిస్తే, ఆ జట్టు అన్ని మ్యాచ్‌ల్లోనూ అసాధారణ ప్రతిభ కనబరచింది. అప్పటికే సెమీ ఫైనల్ చేరిన కారణంగా, చివరి గ్రూప్ మ్యాచ్‌లో విండీస్ కొన్ని ప్రయోగాలు చేసింది. మ్యాచ్‌ని చేజార్చుకున్నప్పటికీ, సెమీ ఫైనల్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకోగలిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం నుంచి చివరి ఓవర్‌లో విజయభేరి మోగించే వరకూ విండీస్ వ్యూహాత్మకంగా ఆడింది. ఫలితంగా పటిష్టమైన టీమిండియాకు స్వదేశంలోనే పరాభవం తప్పలేదు. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన విండీస్‌కు ఫైనల్‌లో మరోసారి అదే జట్టు ఎదురుపడడం విచిత్రం. రెండో గ్రూప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో, మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను మూడు పరుగుల తేడాతో ఓడించిన వెస్టిండీస్ చివరి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఆరు పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో చెలరేగిపోయింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 పరుగులకు 192 పరుగులు చేయగలిగింది. రోహిత్ శర్మ 43, అజింక్య రహానే 40, విరాట్ కోహ్లీ 89 (నాటౌట్), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 15 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. ఆండ్రె రసెల్ 47 పరుగులకు ఒకటి, సామ్యూల్ బద్రీ 26 పరుగులకు ఒకటి చొప్పున వికెట్లు పడగొట్టారు. కాగా, బ్యాటింగ్‌కు అనుకూలించే ముంబయి వాంఖడే స్టేడియం పిచ్‌పై వెస్టిండీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. జాన్సన్ చార్లెస్ 52 పరుగులు చేసి, విండీస్ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. లెండల్ సిమన్స్ 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 82, రసెల్ 20 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 43 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌పై విండీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టారు. చివరి వరకూ పోరాడడం విండీస్‌కు ఉన్న బలం. ఒకరు విఫలమైనా, మరొకరు జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించడం మరో మంచి లక్షణం. క్రిస్ గేల్, మార్లొన్ సామ్యూల్స్ వంటి ఒకరిద్దరు స్టార్ ఆటగాళ్లు ఉన్న ఆ జట్టులో సిమన్స్, రసెల్ ఈటోర్నీలో సూపర్ స్టార్లుగా అవతరించారు. బౌలింగ్, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ విండీస్ సాధారణమైన జట్టుగానే కనిపిస్తున్నది. కానీ, సమష్టిగా పోరాడితే, ఎంతటి విజయమైనా అసాధ్యం కాదని విండీస్ నిరూపించింది. ఇదే ఫాన్‌ను కొనసాగిస్తూ, ఇదే పోరాట తత్వంతో ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు సిద్ధమైంది.
సంచలనాల ఇంగ్లాండ్
ఎలాంటి అంచనాలు లేకుండా టి-20 వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌ను ఢీకొని ఓటమిపాలైంది. ఈ జట్టుకు గెలిచే సత్తాలేదని, గ్రూప్ దశలోనే ఇంటిదారి పడుతుందని అంతా అనుకున్నారు.
కానీ,
రెండో మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణాఫ్రికాపై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా నిరూపించుకుంది. మూడో గ్రూప్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై 15 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. చివరి మ్యాచ్‌లో మరో బలమైన జట్టు శ్రీలంకను పది పరుగుల తేడాతో ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసి, ‘అండర్ డాగ్’ ట్యాగ్‌ను వదులుకొని ‘ఫేవరిట్’ ట్యాగ్ వేసుకున్న న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ ఆసక్తిని రేపింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 153 పరుగులు చేయగలిగింది. కేన్ విలియమ్‌సన్ 32, కొలిన్ మున్రో 46, కొరి ఆండర్సన్ 28 చొప్పున పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ 26 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. అనంతరం, 154 పరుగులు సాధించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 17.1 ఓవర్లలోనే విజయభేరి మోగించింది. జాసన్ రొయ్ 78 పరుగులు చేసి, ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశాడు. అలెక్స్ హాలెస్ 20 పరుగులు చేయగా, చివరిలో జో రూట్ (27 నాటౌట్), జొస్ బట్లర్ (32 నాటౌట్) చక్కటి ప్రతిభ కనబరచి ఇంగ్లాండ్‌ను గెలిపించారు.
మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.