క్రీడాభూమి

క్రికెట్‌కు చేసిందేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: క్రికెట్ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ఒక వ్యవస్థను రూపొందించారేగానీ క్రికెట్‌కు మీరు చేసింది మృగ్యమని విమర్శించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదనడంలో అర్థం లేదని మండిపడింది. అనుబంధ క్రికెట్ సంఘాలకు నిధులు ఇవ్వడంలో సరైన విధివిధానాలను పాటించడం లేదని విమర్శించింది. కేసును శుక్రవారం నాటికి వాయిదా వేసింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణల అనంతరం బిసిసిఐ ప్రక్షాళనకు లోధా కమిటీ పలు సిఫార్సులు చేసిన విషయం తెలిసిందే. వాటిని యథాతథంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అయితే, బోర్డు మాత్రం లోధా సిఫార్సులను వ్యతిరేకిస్తున్నది. బిసిసిఐ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో కేసును కోర్టు విచారిస్తున్నది.
అమలు అసాధ్యం: బిసిసిఐ
ఇలావుంటే, లోధా కమిటీ సమర్పించిన నివేదికలోని పలు అంశాలు ఆచరణలో కష్టమని, వాటిని అమలు చేయడం అసాధ్యమని బిసిసిఐ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో తేల్చిచెప్పింది. బోర్డులోగానీ, దాని సభ్య సంఘాల కార్యవర్గాల్లో మంత్రులకు స్థానం ఉండరాదని, కార్యవర్గ సభ్యులకు గరిష్ట వయోపరిమితిని విధించాలని లోధా కమిటీ చేసిన సూచనలను ఆచరణయోగ్యం కాదని పేర్కొంది. ఒక అనుబంధ సంఘానికి ఒకే ఓటు ఉండాలంటూ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనను కూడా బోర్డు వ్యతిరేకించింది. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించాలన్న సిఫార్సును ఎలా అమలు చేస్తామని ప్రశ్నించింది.
అభ్యంతరాలపై సుప్రీం ఆగ్రహం
కౌంటర్ అఫిడవిట్‌లో బిసిసిఐ లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా సిఫార్సులు అమలు చేయడం ఎందుకు సాధ్యం కాదో స్పష్టంగా తెలపాలని హితవు పలికింది. కోట్లాది రూపాయల లావాదేవీలపై పర్యవేక్షణ సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవని అనుమానం వ్యక్తం చేసింది. ప్రజలకు జవాబుదారీ వహించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆర్‌టిఐ పరిధిలోకి వస్తేనే పాలన పా రదర్శకంగా ఉంటుందని తెలిపింది.
ఏం చేయాలి?
బిసిసిఐని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. కోట్లాది రూపాయల ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బోర్డు ఇప్పుడు సుప్రీం కోర్టులో నడుస్తున్న కేసుతో ఇరకాటంలో పడింది. బోర్డు ప్రక్షాళనపై దృష్టిపెట్టిన కోర్టు అన్ని కోణాలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐపిఎల్‌లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వంలోని కమిటీ రెండు విడతలుగా విచారించిన అనంతరం రెండు విడతలుగా సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలోని అంశాలు సంచలనం సృష్టించింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా, దోషులపై తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేయడంతోపాటు బోర్డు ప్రక్షాళనకు మార్గదర్శకాలను ఇవ్వడానికి లోధా కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీ పలు అంశాలను పరిశీలించిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. అదే విధంగా చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రెండేసి సంవత్సరాలు ఐపిఎల్ నుంచి నిషేధించింది. బిసిసిఐలో అనుసరించాల్సిన విధివిధానాలపై దృష్టి సారించి, అనేక సమావేశాలు, అధ్యయనాల, విశే్లషణల అనంతరం 159 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అందులోని అంశాలే ఇప్పుడు బిసిసిఐకి తలనొప్పిగా మారాయి.
మార్పులను సూచించిన ‘లోధా’
భారత క్రికెట్ రంగంలో అత్యవసరంగా జరగాల్సిన పలు మార్పులను లోధా కమిటీ సూచించింది. బిసిసిఐ ప్రక్షాళనకు, పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉంచేందుకు అవసరమైన చర్యలను తన నివేదికలో వివరించింది. ప్రధానంగా క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ప్రశ్నించింది. మంత్రులు ఎవరూ బిసిసిఐ లేదా దాని అనుబంధ సంఘాల పాలక మండళ్లలో సభ్యులుగా ఉండరాదని స్పష్టం చేసింది. అదే విధంగా బిసిసిఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి వంటి కీలక హోదాలను చేపట్టే వారికి కొన్ని ప్రత్యేక అర్హతలు ఉండాలని స్పష్టం చేసింది. వారి వయసు 70 సంవత్సరాలకు మించకూడదని షరతు విధించింది. పాలక మండలికి ఒక వ్యక్తి వరుసగా రెండు, మొత్తం మీద గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని పేర్కొంది. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వం ఉండడాన్ని తప్పుపట్టింది. ఇలాంటి అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో సంఘానికి మాత్రమే బిసిసిఐలో సభ్యత్వం ఉండాలని లోధా కమిటీ సూచించింది. అంతేగాక, బోర్డు అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే హక్కును తీసివేయాలని పేర్కొంది. వ్యాపారేతర సంస్థగా నమోదైనందున ఎవరికీ జవాబుదారి వహించాల్సిన అవసరం లేదన్న బిసిసిఐ చేస్తున్న వాదనను కూడా లోధా కమిటీ తోసిపుచ్చింది. బోర్డు కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది. బోర్డులో ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని వ్యాఖ్యానించింది. వీటిలో ప్రతి అంశాన్నీ బిసిసిఐ వ్యతిరేకిస్తున్నది. ఇవన్నీ అమలైతే బిసిసిఐపై తమ పట్టు పోతుందని ఇప్పటికే అక్కడ తిష్టవేసుకొని కూర్చున్న నాయకులు, బడా వ్యారవేత్తలు భయపడుతున్నారు. బంగారు బాతుగా మారిన బోర్డును కేవలం క్రికెట్‌కే పరిమితం చేయడం వారికి ఇష్టం లేనట్టు సుప్రీం కోర్టులో చేసిన వాదనలు స్పష్టం చేస్తున్నాయి.
పరస్పర ప్రయోజనాలు వాస్తవం
బిసిసిఐలో చాలా మంది పరస్పర ప్రయోజనాలు కలిగించే రెండు హోదాల్లో కొనసాగడం వాస్తవం. అయితే, ఈ విధంగా రెండు పదవుల్లో ఎవరూ కొనసాగరాదంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో బిసిసిఐ ఇరకాటంలో పడింది. మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ నుంచి ఆటగాళ్ల వరకూ బోర్డుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలున్న చాలా మందికి ఈ విధంగా పరస్పర ప్రయోజనాలు అందుతున్నాయన్నది బహిరంగ రహస్యం. అందుకే మంగళవారం సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఒకదానితో మరొకటి ముడిపడే విధంగా ప్రయోజనాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం మినహా క్రికెట్ అభివృద్ధికి చేసిన కృషిగానీ, ప్రయత్నంగానీ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా కమిటీ సిఫార్సులను ఎందుకు అమలు చేయలేరన్న విషయంలో స్పష్టత లేదని వ్యాఖ్యానించింది.