క్రీడాభూమి

దోనీ సేన బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 9: తొమ్మిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో కొత్త జట్టుకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని సాధించి బోణీ చేశాడు. అతని నాయకత్వంలో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తొమ్మిది వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది. ఎనిమిది సంవత్సరాలు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన చెన్నై సూపర్ కింగ్స్‌ను లోధా కమిటీ రెండేళ్లు సస్పెండ్ చేయడంతో, జట్టులోని మిగతా ఆటగాళ్లతోపాటు ధోనీకి కూడా స్థాన చలనం తప్పలేదు. చెన్నై, రాజస్థాన్ జట్లపై వేటుపడగా, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్లు కొత్తగా వచ్చి చేరాయి. ఐపిఎల్‌లో పుణె సూపర్‌జెయింట్స్ శనివారం మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయిని ఢీ కొంది. చెన్నైకి కాకుండా మొదటిసారి మరో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ మొదటి మ్యాచ్‌లోనే విజయాన్ని అందుకొని శుభారంభం చేశాడు. కాగా, తొమ్మిదో ఐపిఎల్ తొలి మ్యాచ్ దాదాపుగా ఏకపక్షంగా కొనసాగింది. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అజేయంగా 45 పరుగులు సాధించి, తన జట్టు అత్యల్ప స్కోరుకు పరిమితం కాకుండా ఆదుకోవడాన్ని మినహాయిస్తే, ఈ మ్యాచ్‌లో ముంబయి అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. రహానే బ్యాటింగ్ ప్రతిభ పుణె సూపర్‌జెయింట్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది.
ఆదుకున్న భజ్జీ
టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకొని చేతులు కాల్చుకుంది. జట్టు స్కోరు ఎనిమిది పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (7) అవుటయ్యాడు. ఇశాంత్ శర్మ బఔలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్‌కాగా, లెండల్ సిమన్స్ (8), హార్దిక్ పాండ్య (9), జొస్ బట్లర్ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరాడు. కీరన్ పోలార్డ్ కేవలం ఒక పరుగు చేసి రజత్ భాటియా బౌలింగ్‌లో ఎల్‌గా వెనుదిరిగాడు. శ్రేయాస్ గోపాల్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. 51 పరుగులకే ముంబయి ఆరు వికెట్లు కోల్పోగా, వారిలో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. అంబటి రాయుడు కొద్ది సేపు క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. 27 బంతుల్లో, రెండు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసిన అతనిని ఫఫ్ డు ప్లెసిస్ క్యాచ్ అందుకోగా రవిచంద్రన్ అశ్విన్ వెనక్కు పంపాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను హర్భజన్ సింగ్ స్వీకరించాడు. పుణె సూపర్‌జెయింట్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న అతను స్కోరును ముందుకు దూకించాడు. కొంతసేపు భజ్జీగా అండగా నిలిచిన వినయ్ కుమార్ 11 బంతుల్లో 12 పరుగులు చేసి, ఆర్పీ సింగ్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. 20 ఓవర్లలో ముంబయి 8 వికెట్లకు 121 పరుగులు సాధించగా, భజ్జీ 30 బంతుల్లో అజేయంగా 45 పరుగులు చేశాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అతనితోపాటు మిచెల్ మెక్‌క్లీనగన్ (2) నాటౌట్‌గా నిలిచాడు. పుణె సూపర్‌జెయింట్స్ బౌలర్లలో ఇశాంత్ శర్మ, మిచెల్ మార్ష్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి వికెట్‌కు 78 పరుగులు
ముంబయి నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్ ఆరంభించిన ఫఫ్ డు ప్లెసిస్, ఆజింక్య రహానే ముంబయి బౌలర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటూ మొదటి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగులు జోడించారు. డు ప్లెసిస్ 33 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 34 పరుగులు చేసి హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్‌కాగా, పుణె సూపర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. గత ఏడాది ఐపిఎల్‌లో ఆడలేకపోయిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. 12.1 ఓవర్లలో పుణె సూపర్‌జెయింట్స్ వంద పరుగుల మైలురాయిని చేరింది. అదే ఊపును కొనసాగిస్తూ 14.4 ఓవర్లలోనే పుణె సూపర్‌జెయింట్స్ లక్ష్యాన్ని చేరింది. రహానే 42 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 66, పీటర్సన్ 14 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, మరో 32 బంతులు మిగిలి ఉండగానే పుణె సూపర్‌జెయింట్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

స్కోరుబోర్డు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: లెండల్ సిమన్స్ బి ఇశాంత్ శర్మ 8, రోహిత్ శర్మ ఎల్‌బి ఇశాంత్ శర్మ 7, హార్దిక్ పాండ్య సి మహేంద్ర సింగ్ ధోనీ బి మిచెల్ మార్ష్ 9, జొస్ బట్లర్ సి రవిచంద్రన్ అశ్విన్ బి మిచెల్ మార్ష్ 0, అంబటి రాయుడు సి ఫఫ్ డు ప్లెసిస్ బి రవిచంద్రన్ అశ్విన్ 22, కీరన్ పోలార్డ్ ఎల్‌బి రజత్ భాటియా 1, శ్రేయాస్ గోపాల్ సి ఆజింక్య రహానే బి మురుగన్ అశ్విన్ 2, హర్భజన్ సింగ్ నాటౌట్ 45, వినయ్ కుమార్ సి స్టీవెన్ స్మిత్ బి ఆర్పీ సింగ్ 12, మిచెల్ మెక్‌క్లీనగన్ నాటౌట్ 2, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1-8, 2-29, 3-29, 4-30, 5-40, 6-51, 7-68, 8-96.
బౌలింగ్: ఆర్పీ సింగ్ 3-0-30-1, ఇశాంత్ శర్మ 4-0-36-2, మిచెల్ మార్ష్ 4-0-21-2, రజత్ భాటియా 4-1-10-1, మురగన్ అశ్విన్ 4-0-16-1, రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-1.
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: ఫఫ్ డు ప్లెసిస్ బి హర్భజన్ సింగ్ 34, ఆజింక్య రహానే నాటౌట్ 66, కెవిన్ పీటర్సన్ నాటౌట్ 21, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (14.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 126.
వికెట్ల పతనం: 1-78.
బౌలింగ్: మిచెల్ మెక్‌క్లీనగన్ 3-0-27-0, జస్‌ప్రీత్ బుమ్రా 3-0-30-0, వినయ్ కుమార్ 2-0-14-0, శ్రేయాస్ గోపాల్ 3-0-18-0, హర్భజన్ సింగ్ 3-0-24-1, హార్దిక్ పాండ్య 0.4-0-12-0.