క్రీడాభూమి

టైటిల్‌పై కోహ్లీ సేన గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోని బలమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి టైటిల్‌పై గురిపెట్టింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలో బెంగళూరు తొమ్మిదో ఐపిఎల్‌లో తొమి మ్యాచ్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం ఆడనుంది. 2008లో ఐపిఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ బెంగళూరుకు టైటిల్ లభించలేదు. 2009, 2011 సంవత్సరాల్లో ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్ ట్రోఫీతోనే సరిపుచ్చుకుంది. కీలక మ్యాచ్‌ల్లో తీవ్రమైన ఒత్తిడికి గురై విజయాలను చేజార్చుకోవడం బెంగళూరుకు ఆనవాయితీగా మారింది. అయితే, ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన కోహ్లీ మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు అనుకూలిస్తున్న అంశం. ఆస్ట్రేలియా పించ్ హిట్టర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్ పేస్ అటాక్‌ను ఆశిష్ నెహ్రా ముందుకు తీసుకెళతాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉంది. అతి తక్కువ కాలంలో ప్రపంచ మేటి మీడియం పేసర్ల జాబితాలో చేరిపోయిన బంగ్లాదేశ్ స్టార్ ముస్త్ఫాజుర్ రహ్మాన్‌ను ఎదుర్కోవడం బెంగళూరుకు సులభసాధ్యం కాదన్నది వాస్తవం. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో కర్న్ శర్మ, దీపక్ హూడా, బిపుల్ శర్మ, తిరుమలశెట్టి సుమన్ తదితరులున్నారు. యువరాజ్ సింగ్ పార్ట్ టైమ్ బౌలర్‌గా సేవలు అందించే సత్తా ఉన్నవాడే. కానీ, అతను ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటున్న కారణంగా కనీసం రెండు మూడు మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదు. మంళవారం యువీ ఆడడం లేదని జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికీ ప్రకటించింది. మొత్తం మీద సమతూకంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ బౌలింగ్‌ను కోహ్లీ బృందంలోని బ్యాట్స్‌మెన్ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తిని రేపుతున్నది. షేన్ వాట్సన్, ఎబి డివిలియర్స్ వంటి బ్యాట్స్‌మెన్ ఆ జట్టు బ్యాటింగ్ బలాన్ని పెంచుతున్నారు. కాగా, ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి, పరుగుల వరద సృష్టించే క్రిస్ గేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఈ ఏడాది ఐపిఎల్ వేలంలో అత్యధికంగా 9.5 కోట్ల రూపాయల ధర పలికిన వాట్సన్ తనపై బెంగళూరు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటాడన్నది ఆసక్తిని రేపుతోంది. ట్రావిస్ హెడ్, సర్ఫ్‌రాజ్ అహ్మద్ వంటి పించ్ హిట్టర్లు బెంగళూరు బ్యాటింగ్‌లో తమ వంతు పాత్రను పోషించనున్నారు.
బౌలింగ్ విభాగానికి వస్తే బెంగళూరుకు ఒకప్పుడు మిచెల్ స్టార్క్, ఆడం మిల్లే వంటి స్టార్ల అండ ఉండేది. వారు ఇప్పుడు జట్టులో లేకపోవడంతో పేస్ విభాగం బాధ్యత కేన్ రిచర్డ్‌సన్, హర్షల్ పటేల్, శ్రీనాథ్ అరవింద్, వరుణ్ ఆరోన్ భుజాలపై పడింది. లెగ్ స్పిన్నర్ సామ్యూల్ బద్రీ భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతను మంగళవారం నాటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడు. అతని స్థానంలో యజువేంద్ర చాహల్ ఎంతవరకు రాణిస్తాడన్నది అనుమానంగానే ఉంది. కాగా, బెంగళూరు బౌలింగ్ విభాగాన్ని సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ఏ విధంగా ఢీ కొంటారో చూడాలి. ఈ జట్టులో వార్నర్‌తోపాటు శిఖర్ ధావన్, ఇయాన్ మోర్గాన్ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. స్థూలంగా చూస్తే ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ, కోహ్లీ కారణంగా బెంగళూరులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టైటిల్ సాధించితీరాలన్న పట్టుదలతో ఉన్న కోహ్లీ బృందం తొలి మ్యాచ్‌ని గెల్చుకొని శుభారంభం చేయాలని యోచిస్తున్నది. ప్రయత్నం సఫలమవుతుందో లేదో చూడాలి.