క్రీడాభూమి

పంజాబ్‌పై ప్రతీకారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: సొంత గడ్డపై గురువారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యోచిస్తోంది. ఇదే వేదికలో ఈనెల 15న జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగులతో ఓడిపోయిన హైదరాబాద్ ఆ తర్వాత మొహాలీ ఈనెల 19న జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మంగళవారం ముంబయిని 31 పరుగుల తేడాతో ఓడించి ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఇంతవరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగింట్లో విజయం సాధించి రెండింట్లో ఓడిపోయింది. మొహాలీ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ 63 బంతులు ఎదుర్కొని 104 పరుగులు చేసి జట్టును గెలిపించే బాధ్యతను తీసుకున్నాడు. కాగా, మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టును 87 పరుగులకే కట్టడి చేసి ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ కూడా ఆశించిన స్కోరు చేయడానికి తడబడింది. చివరికి ఎలాగోలా 118 పరుగులకు ఆలౌటైంది. ముంబయి టీమ్ ఈ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 18.5 ఓవర్లకే ఆలౌటై కేవలం 87 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో పేసర్ సిద్ధార్ధ కౌల్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కొండంత అండగా నిలబడి రెండుసార్లు చాంపియన్‌గా అవతరించిన ముంబయిని మట్టికరిపించారు. ఈ విజయంతో ఊపుమీదున్న హైదరాబాద్ తమ తదుపరి లక్ష్యం స్వంత గడ్డపై తమను ఓడించిన పంజాబ్‌పై గెలవడం ద్వారా తగిన ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతోంది. కెప్టెన్ కనే విలియమ్‌సన్ ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లలో 259 పరుగులు చేసి జట్టును విజయవంతంగా నడుపుతుండగా, అతనికి తోడుగా బౌలింగ్‌లో పేసర్ సిద్ధార్థ కౌల్ ఇప్పటివరకు తొమ్మిది వికెట్లు పడగొట్టి బలమైన జట్టుగా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టులో క్రిస్ గేల్ లేని లోటు కనబడినా గురువారం హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో గేల్ ఆడే అవకాశం ఉంది. ఈ జట్టులో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బాగా రాణిస్తుండడంతో ఇది కూడా పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. రాహుల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 236 పరుగులు చేయగా, ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉండడం విశేషం. గేల్, రాహుల్‌ను తొలి దశలో పడగొడితే తమ గెలుపు సులువు అవుతుందని హైదరాబాద్ ఆలోచనగా ఉంది. ఈ టీమ్‌లో భువనేశ్వర్ కుమార్ లేని లోటును సిద్ధార్థ కౌల్, బాసిల్ థంపితోపాటు స్పిన్నర్ల త్రయం రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్, మహ్మద్ నబీ సమర్ధవంతంగా పూడ్చుతున్నారు. గురువారం నాటి మ్యాచ్‌లో ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను పడగొడితే గెలుపు వీజీ అవుతుందని జట్టు యోచిస్తోంది. ఇక బ్యాట్స్‌మెన్‌లలో చేతి గాయం కారణంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయిన స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మంగళవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచినా కెప్టెన్ విలియమ్‌సన్‌తో కలసి పరుగుల వరద సృష్టిస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.