క్రీడాభూమి

అజ్లన్ షా హాకీ టోర్నీ ఫైనల్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇపో (మలేసియా), ఏప్రిల్ 15: ప్రతిష్టాత్మకమైన సుల్తాన్ అజ్లన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ పోరుకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత్ శుక్రవారం ఇక్కడ ఆతిథ్య మలేసియా జట్టును 6-1 గోల్స్ తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి. ఇంతకుముందు ఈ టోర్నీలో ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన భారత జట్టు ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి ఫైనల్‌కు చేరుకోవాలంటే మలేసియాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మ్యాచ్ ఆరంభం నుంచే తనదైన శైలిలో విజృంభించి దూకుడుగా ఆడిన భారత జట్టుకు రెండవ నిమిషంలోనే ఎస్‌వి.సునీల్ తొలి గోల్‌ను అందించగా, 7వ నిమిషంలో హర్జీత్ సింగ్ రెండో గోల్‌ను సాధించిపెట్టాడు. ఆ తర్వాత రమణ్‌దీప్ సింగ్ 25, 39 నిమిషాల్లో రెండు గోల్స్‌తో సత్తా చాటుకుని భారత జట్టు ఆధిక్యతను మరింత పెంచగా, 27వ నిమిషంలో దినేష్ ముజ్తబా, 50వ నిమిషంలో తల్వీందర్ సింగ్ చెరో గోల్ రాబట్టారు. అయితే మలేసియా జట్టుకు షహ్రిల్ సాబా 46వ నిమిషంలో కంటితుడుపు గోల్‌ను అందించడంతో భారత జట్టు 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రౌండ్ రాబిన్ లీగ్ దశలో మొత్తం 12 పాయింట్లు సాధించిన భారత జట్టు న్యూజిలాండ్ (11 పాయింట్లు)ను వెనక్కినెట్టి మరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంతకుముందు ఈ టోర్నీలో భారత జట్టు 2010లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే అప్పట్లో భారత్-దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ వర్షం వలన తుడిచిపెట్టుకుపోవడంతో టైటిల్‌ను రెండు జట్లు పంచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు టైటిల్ కోసం రౌండ్ రాబిన్ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా (18 పాయింట్లు)తో శనివారం అమీతుమీ తేల్చుకోనుండగా, కాంస్య పతకం కోసం న్యూజిలాండ్, మలేసియా (8 పాయింట్లు) జట్లు పోటీపడనున్నాయి. కాగా, శుక్రవారం జరిగిన మరో మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ఆస్ట్రేలియా 3-0 గోల్స్ తేడాతో కెనడా జట్టును చిత్తు చేసింది. దీంతో రౌండ్ రాబిన్ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లలోనూ విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా జట్టు ఖాతాలో మొత్తం 18 పాయింట్లు జమ అయ్యాయి.
ఇదిలావుంటే, మలేసియాతో శుక్రవారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించి విజయాన్ని అందుకోవడం పట్ల జట్టు కోచ్ రోలాంట్ అల్తామస్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్న భారత జట్టు శనివారం కంగారూలతో జరిగే టైటిల్ పోరులోనూ మెరుగ్గా రాణించగలదని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

కీలక మ్యాచ్‌లో మలేసియాను మట్టికరిపించిన భారత ఆటగాళ్లు