క్రీడాభూమి

గెలిచిన ఢిల్లీ.. ఓడిన ముంబయి..నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ముంబయి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలవడమేగాక, భారీ రన్‌రేట్‌ను కూడా సంపాదించాల్సిన స్థితిలో తీవ్రమైన ఒత్తిడికి లోనైన ముంబయి 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, మరో మూడు బంతులు మిగిలి ఉండగా, 163 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మొత్తం 14 మ్యాచ్‌ల్లో ఎనిమిదో పరాజయాన్ని చవిచూసిన రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి కేవలం 12 పాయింట్లకు పరిమితమై, ప్లే ఆఫ్ దశకు చేరుకోకుండానే వెనుదిరిగింది. మరోవైపు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఢిల్లీ తనకు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో గెలిచి, ముంబయిని నిలువునా ముంచేసింది. ఈ జట్టుకు 14 మ్యాచ్‌ల్లో ఇది ఐదో విజయం. మొత్తం 12 పాయింట్లు సంపాదించిన ఢిల్లీ చివరి స్థానం నుంచి బయటపడలేదు. కానీ, డిఫెండింగ్ చాంపియన్‌ను తనతోపాటు ప్లే ఆఫ్‌కు దూరం చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేర్ డెవిల్స్‌కు పృథ్వీ షా, గ్లేన్ మాక్స్‌వెల్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. బలపడుతున్న వీరి భాగస్వామ్యం పృథ్వీ షా రనౌట్‌తో విచ్ఛిన్నమైంది. 8 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసిన పృథ్వీ షా అదనపు పరుకోసం చేసిన ప్రయత్నంలో విఫలమయ్యాడు. 30 పరుగుల స్కోరువద్ద ఢిల్లీ తొలి వికెట్ చేజార్చుకుంది. తర్వాత కొద్ది సేపటికే మాక్స్‌వెల్ వికెట్ కూడా కూలింది. 18 బంతుల్లో, నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసిన అతనిని జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. హార్డ్ హిట్టర్ శ్రేయాస్ అయ్యర్ ఆరు పరుగులు చేసి, మాయాంక్ మార్కండే బౌలింగ్‌లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 75 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో ఢిల్లీని ఆదుకునే బాధ్యతను వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్, విజయ్ శేఖర్ స్వీకరించారు. ముంబయి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరు ఢిల్లీకి అండగా నిలిచి, నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. 44 బంతులు ఎదుర్కొన్న రిషభ్ పంత్ 64 పరుగులు చేసి, కృణాల్ పాండ్య బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్ క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, మరో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అనంతరం అభిషేక్ శర్మ (15 నాటౌట్)తో కలిసి విజయ్ శేఖర్ (30 బంతుల్లో 43 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ స్కోరును 20 ఓవర్లలో, నాలుగు వికెట్లకు 174 పరుగులకు చేర్చారు.
తొలి ఓవర్‌లోనే వికెట్
భారీ తేడాతో విజయభేరి మోగించడం ద్వారా, ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకున్న ముంబయి ఇండియన్స్ 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి, మొదటి ఓవర్‌లోనే సూర్యకుమార్ యాదవ్ వికెట్‌ను కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన తర్వాత ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ నాలుగు బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మరో సిక్సర్ సాయంతో ఆరు పరుగులు చేసి, సందీప్ లామిచానే బౌలింగ్‌లో విజయ్ శంకర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఐదు పరుగులకే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కు దొరికిపోగా, క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ అర్ధ శతకం పూర్తి చేయకుండానే ఔటయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్న అతను మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్ కోసం క్రీజ్ నుంచి బయటకు వచ్చి, రిషభ్ పంత్ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. వేగంగా పరుగులు సాధిస్తాడనుకున్న కీరన్ పొలార్డ్ కూడా నిరాశ పరిచాడు. అతను ఏడు బంతుల్లో ఏడు పరుగులు చేసి, సందీప్ లామిచానే బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి వికెట్ పారేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బాధ్యతాయుతంగా ఆడకుండా, నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించి, భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 11 బంతుల్లో 13 పరుగులు చేసిన అతను హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ వద్దకు బంతిని కొట్టి, చేతులారా వికెట్ చేజార్చుకున్నాడు. తర్వాతి ఓవర్‌లో ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్య వికెట్ కూడా కూలింది. నాలుగు పరుగులు చేసిన అతనిని సందీప్ లామిచానే బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రాహుల్ తెవాతియా క్యాచ్ అందుకొని వెనక్కు పంపాడు. 122 పరుగుల వద్ద ఏడో వికెట్ కూలడంతో ముంబయి కష్టాలు పెరిగాయి. ఈ దశలో కృణాల్ సోదరుడు హార్దిక్ పాండ్య వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించి, 17 బంతుల్లో 27 పరుగులు చేసి, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రాహుల్ తెవాతియా క్యాచ్ అందుకోగా ఔటయ్యాడు. ఈ దశలో బెన్ కట్టింగ్ ధాటిగా ఆడుతూ ముంబయి విజయంపై అభిమానుల్లో ఆశలు పెంచాడు. అతను ఎదురుదాడి కొనసాగించడంతో, చివరి మూడు ఓవర్లలో ముంబయి విజయానికి 38 పరుగుల దూరంలో నిలిచింది. లియామ్ ప్లంకెట్ వేసిన ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌లో మొదటి బంతిని ఫోర్‌గా కొట్టిన కట్టింగ్ రెండో బంతిలో భారీ సిక్స్ సాధించాడు. మూడో బంతిలో మరో ఫోర్ బాదాడు. తర్వాతి బంతిలో పరుగు లభించలేదు. ఐదో బంతిలో అతను సింగిల్ చేయగా, చివరి బంతిలో మాయాంక్ మార్కండే పరుగు చేయలేకపోయాడు. మొత్తం మీద ఆ ఓవర్‌లో ముంబయికి 15 పరుగులు దక్కాయి.
చివరి రెండు ఓవర్లలో ముంబయికి 23 పరుగులు అవసరంకావడంతో, ఆ జట్టు గెలుపు సాధ్యమేనన్న అభిప్రాయం ఏర్పడింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్‌లో ముంబయి ఐదు పరుగులు సాధించి, మాయాంక్ మార్కండే వికెట్ కోల్పోయింది. అతను మూడు పరుగులు చేసి, బౌల్ట్ వేసిన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయి ముంబయికి, కట్టింగ్ ఫామ్‌లో ఉండడంతో, చివరి ఓవర్‌లో 18 పరుగులు సాధించడం కష్టం కాదేమోనని అంతా అనుకున్నారు. కీలకమైన ఈ ఓవర్‌ను వేసే బాధ్యత హర్షల్ పటేల్‌కు లభించింది. అతను వేసిన మొదటి బంతిని కట్టింగ్ సిక్సర్‌గా మార్చడంతో, ముంబయి అభిమానుల్లో ఆశలు మరింతగా పెరిగాయి. కానీ, తర్వాతి బంతిలోనే, భారీ షాట్‌కు ప్రయత్నించిన కట్టింగ్ (20 బంతుల్లో 37/ రెండు ఫోర్లు/ మూడు సిక్సర్లు) మిడ్‌వికెట్ స్థానంలో కాపుకాసిన గ్లేన్ మాక్స్‌వెల్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. తర్వాతి బంతికే జస్‌ప్రీత్ బుమ్రా వికెట్ కూడా కూలింది. ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ అందుకోగా అతను చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 19.3 ఓవర్లలో ముంబయి 163 పరుగులకు ఆలౌటైంది. అమిత్ మిశ్రా, సందీప్ లామిచానే, హర్షల్ పటేల్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 (గ్లేన్ మాక్స్‌వెల్ 22, రిషభ్ పంత్ 64, విజయ్ శేఖర్ 43 నాటౌట్, కృణాల్ పాండ్య 1/11, జస్‌ప్రీత్ బుమ్రా 1/29, మాయాంక్ మార్కండే 1/21).
ముంబయి ఇండియన్స్: 19.3 ఓవర్లలో 163 ఆలౌట్ (ఎవిన్ లూయిస్ 47, హార్దిక్ పాండ్య 27, బెన్ కట్టింగ్ 37, సందీప్ లామిచానే 3/36, హర్షల్ పటేల్ 3/28, అమిత్ మిశ్రా 3/19).

చిత్రాలు..ముంబయి ని చావుదెబ్బ తీసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్
*ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్ ముంబయ ఇండియన్స్