క్రీడాభూమి

హోరాహోరీ పోరులో పైచేయి ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 22: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) దశ చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ జట్ల మధ్య జరిగే భీకర పోరు ఉత్కంఠను కలిగించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబయి వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఇందులో చె న్నై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇక బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందే జట్టు క్వాలిఫయర్-1లో ఓడిపోయిన సన్‌రైజర్స్‌తో తలపడుతుంది.
ఈ నేపథ్యంలో బుధవారం కోల్‌కతా, రాజస్థాన్ మధ్య జరిగే పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆతిధ్య జట్టు కోల్‌కతాకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సొంత స్టేడియం బాగా కలిసివచ్చింది. కోల్‌కతా ఇంతవరకు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా వాటిలో ఎనిమిదింట్లో విజయం సాధించింది. ఆరింట్లో పరాజయాన్ని చవిచూసి 16 పాయింట్లతో ప్రత్యర్థి రాజస్థాన్ కంటే రెండు పాయింట్లు ఎక్కువ సాధించింది. రాజస్థాన్ ఇంతవరకు 14 మ్యాచ్‌లు ఆడగా ఏడింట్లో గెలుపొంది, మరో ఏడింట్లో పరాజయాన్ని ఎదుర్కొని 14 పాయింట్లు సాధించింది. ఈ రెండు జట్లలోనూ రన్‌రేట్‌పరంగా చూసుకుంటే రాజస్థాన్ 0.250, కోల్‌కతా 0.070తో ఉన్నాయి.
ఇప్పటికే రెండుసార్లు ఐపీఎల్‌లో చాంపియన్‌గా అవతరించిన కోల్‌కతా నైట్ రైడర్స్ బుధవారం జరిగే ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్‌పై పైచేయి సాధించడం ద్వారా క్వాలిఫయర్-2లో పోటీ పడేందుకు ఎంతో నమ్మకం, విశ్వాసంతో ఉంది. గత నెలలో రాజస్థాన్ స్వంత మైదానంలో ఆతిధ్య జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓడించిన కోల్‌కతా వారం క్రితం తమ స్వంత మైదానం (ఈడెన్ గార్డెన్స్)లో రాజస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌పై ఆశలు నిలబెట్టుకుంది. మొత్తం ఐపీఎల్ సీజన్‌లో నైట్ రైడర్స్ ఆరుసార్లు ప్లే ఆఫ్‌కు బెర్తులు ఖాయం చేసుకుంది. అదేవిధంగా తమ సొంత మైదానంలో నాలుగుసార్లు ఎలిమినేటర్ దశకు చేరుకున్న ఘనత కూడా కోల్‌కతాదే.
కోల్‌కతా టీమ్ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇంతవరకు 438 పరుగులు చేసి కెప్టెన్సీ విలువను నిలబెట్టాడు. సునీల్ నరైన్, పీయూష్ చావ్లా, క్రిస్ లీన్, కుల్దీప్ యాదవ్ వంటివారు అద్భుతంగా రాణిస్తుండడం జట్టుకు కలిసివచ్చే అంశం. కోల్‌కతా రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించడంలో కీలక పాత్రధారి సునీల్ నరైన్ ఈసారి కూడా తన సత్తా ఏమిటో ప్రత్యర్థికి రుచి చూపించడంతోపాటు జట్టును మళ్లీ గెలిపించేందుకు అతి పెద్ద బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నాడు. రాజస్థాన్ జట్టులోని ప్రమాదకర బ్యాట్స్‌మన్ సమర్థవంతమైన పాత్రను పోషిస్తుండడంతో అతనిని అడ్డుకుంటే కోల్‌కతాకు ఎంతో మేలు జరుగుతుంది. ఇక 2008 ఐపీఎల్ సీజన్‌లో చాంపియన్‌గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోని పలువురు స్టార్ ఆటగాళ్ల సహకారంతో విజయవంతంగా ప్లే ఆఫ్‌లో బెర్త్ ఖాయం చేసుకుని కోల్‌కతాతో బుధవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. అయితే, ఈ టీమ్‌లో ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు జోష్ బట్లర్, బెన్ స్టోక్స్‌లకు వారి దేశం నుంచి పిలుపు రావడంతో జట్టును వీడారు. ఈనెల 19నన లీగ్ ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించిన రాజస్థాన్ ప్లే ఆఫ్‌లో బెర్త్ దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోకపోవడంతో రాజస్థాన్‌కు అవకాశం దక్కింది. రాజస్థాన్ టీమ్‌లో కెప్టెన్ అజింక్య రహానేతోపాటు స్టువర్ట్ బిన్నీ, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, జోఫ్రా ఆర్చెర్, జయదేవ్ ఉనద్కత్ వంటివారు జట్టును ముందుకు తీసుకువెళ్లే సత్తా కలిగి ఉన్నారు.