క్రీడాభూమి

మాంటే కార్లో మాస్టర్స్ విజేత నాదల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటే కార్లో, ఏప్రిల్ 17: మాంటే-కార్లో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్ ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 13వ సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్‌పై చెమటోడ్చి విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మోన్‌ఫిల్స్ కంటే ఎంతో ఉన్నత స్థానం (2వ ర్యాంకు)లో ఉన్న నాదల్ ఈ మ్యాచ్ ఆరంభంలో బాగానే రాణించి 7-5 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఫలితంగా 5-7 తేడాతో రెండో సెట్‌ను కోల్పోయిన నాదల్ నిర్ణాయక మూడో సెట్‌లో విజృంభించి ఆడాడు. పవర్‌ఫుల్ షాట్లతో తనదైన శైలిలో రెచ్చిపోయి మోన్‌ఫిల్స్‌కు చుక్కలు చూపించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ సెట్‌ను నాదల్ 6-0 తేడాతో గెలుచుకుని మరోసారి టైటిల్ కైవసం చేసుకోవడంతో పాటు క్లేకోర్టు టోర్నమెంట్లలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ టోర్నీలో ఇంతకుముందు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన నాదల్‌కు ఇది తొమ్మిదో టైటిల్. అయితే ఈ టోర్నీలో నాదల్ చాంపియన్‌గా నిలవడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014లో నాదల్ మాడ్రిడ్‌లో విజేతగా నిలిచిన తర్వాత నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మాస్టర్స్ టోర్నీలో టైటిల్ గెలుచుకోలేదు. అయితే ప్రస్తుతం అతను విజయం సాధించడంతో కెరీర్‌లో 100వ సారి ఎటిపి టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకున్న మోన్‌ఫిల్స్‌కు నిరాశ తప్పలేదు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు
హెరత్ గుడ్‌బై

కొలంబో, ఏప్రిల్ 17: శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ రంగన హెరత్ (38) అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లతో పాటు వనే్డలకు గుడ్‌బై చెప్పాడు. ఇక మీదట టెస్టు మ్యాచ్‌లలో మాత్రమే కొనసాగుతానని అతను స్పష్టం చేశాడు. ‘ప్రతి క్రికెటర్ ఏదో ఒక సరైన సమయంలో ఆటను ఆపేయాల్సిందే. కొత్త ప్రతిభావంతులకు చోటు కల్పించి, 2019లో జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్ నాటికి వారు ఎదిగేలా అవకాశం కల్పించేందుకు ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నా. అందుకే అంతర్జాతీయ టి-20లతో పాటు వనే్డ మ్యాచ్‌ల నుంచి రిటైర్ అవుతున్నా’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్వారా విడుదల చేసిన ప్రకటనలో హెరత్ స్పష్టం చేశాడు. 2010లో ‘స్పిన్ మాంత్రికుడు’ ముత్తయ్య మురళీధరన్ రిటైర్ అయినప్పటి నుంచి టెస్టు మ్యాచ్‌లలో శ్రీలంక జట్టుకు హెరత్ ప్రధాన స్ట్రైక్ బౌలర్‌గా సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.
గాలేలో ఆస్ట్రేలియాతో 1999లో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన హెరత్ చాలా కాలం పాటు పెవిలియన్‌కే పరిమితమయ్యాడు. అప్పటికే ముత్తయ్య మురళీధరన్ ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదిగి శ్రీలంక జట్టుకు సేవలు అందిస్తుండటమే ఇందుకు కారణం. అయితే మురళీధరన్ రిటైర్మెంట్ తర్వాత శ్రీలంక జట్టు హెరత్‌పైనే ఎక్కువగా ఆధారపడింది. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకూ 71 వనే్డ మ్యాచ్‌లు ఆడిన రంగన హెరత్ 74 వికెట్లు కైవసం చేసుకోవడంతో పాటు 17 ట్వంటీ-20 మ్యాచ్‌లలో 18 వికెట్లు రాబట్టాడు. 2014లో అతను ఢాకాలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ టి-20 మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన చేసిన హెరత్ రెండు మెయిడిన్ ఓవర్లు వేయడంతో పాటు 5 పరుగులిచ్చి 3 వికెట్లు కైవసం చేసుకున్నాడు. దీంతో అతను టి-20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.
అలాగే అతను ఇప్పటివరకూ 67 టెస్టు మ్యాచ్‌లలో 23 సార్లు ఐదేసి వికెట్లు, ఐదుసార్లు పదేసి వికెట్లు కైవసం చేసుకోవడంతో పాటు మొత్తం 297 వికెట్లు సాధించి ప్రతిభను చాటుకున్నాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో 2014 ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో హెరత్ 127 పరుగులకు 9 వికెట్లు రాబట్టి ఈ ఫార్మాట్‌లో ఉత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఆడిన చివరి టెస్టు ఇదే. ఈ ఏడాది జులైలో శ్రీలంకలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అతను మరో 3 వికెట్లు సాధిస్తే టెస్టుల్లో 300 పైగా వికెట్లు సాధించిన శ్రీలంక మాజీ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్‌ల సరసన చేరుతాడు.