క్రీడాభూమి

సాకర్ పోటీలకు పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 12: రష్యాలో ఈనెల 14వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీవరకు అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహించనున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో టెర్రిరిస్టు తరహా దాడులు, దౌర్జన్యాలు వంటి హింసాత్మక చర్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల క్రీడల్లో ఒకటిగా వెలుగొందుతున్న సాకర్ పోటీల్లో ఎలాంటి అపశృతులు దొర్లకుండా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించించి. భద్రతా చర్యల్లో భాగంగా గట్టి రష్యా రక్షణ వ్యవస్థలు ముందుకు వచ్చి, అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. ఇందుకు అనుగుణంగా స్థానిక పోలీసుల సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించాయి. ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, ఫ్యాక్టరీలు ఉండే ప్రాంతాల్లో దాడులు, దౌర్జన్యాలకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు చర్యలు ముమ్మరం చేశారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బలమైన వ్యవస్థను ప్రభుత్వ ఏర్పాటు చేసింది. వరల్డ్ కప్‌ను తిలకించేందుకు ఇక్కడకు వస్తున్న అభిమానులు, మద్దతుదారులు ఎవరైనా పోటీలకు ఆతిథ్యమిచ్చే 12 ప్రాంతాల్లోని ఆయా పోలీస్ స్టేషన్లలో తమ వివరాలను సమగ్రంగా నమోదు చేసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు. రహదారులపైనే కాకుండా సముద్రయానం ద్వారా కూడా పోటీలను తిలకించేందుకు వచ్చేవారిపై కూడా దాడులు, దౌర్జన్యాలు జరిగే ప్రమాద ఘంటికలు పొంచివున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా రివర్‌బోట్ ట్రాఫిక్‌ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 30వేల మంది భద్రతా సిబ్బంది లుజ్‌నికీ స్టేడియంతోపాటు మాస్కో అంతటా మోహరించనున్నారు. స్వాడ్రన్ ఫైటర్ జెట్ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా దేశ రాజధాని ప్రాంతంలోని విమానాశ్రయంలో ఎలాంటి ఉపద్రవాలు జరిగేందుకు ఆస్కారం లేకుండా తగినన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను రెడీగా ఉంచారు. ఇదిలావుండగా, చాలా కాలం తర్వాత ఫిఫా వరల్డ్ కప్ పోటీలను నిర్వహిస్తున్నందున తగిన ప్రణాళిక ప్రకారం గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని ఎఫ్‌ఎస్‌బీ డొమెస్టిక్ సెక్యూరిటీ సర్వీస్ డిప్యూటీ చీఫ్ అలెక్సీ లావ్రిస్‌చెవ్ అన్నాడు. ఎలాంటి బెదిరింపులు, దాడులు ఎదురైనా వాటిని తిప్పికొట్టేందుకు తాము అన్ని విభాగాల్లో భద్రతను పటిష్టం చేశామని పేర్కొన్నాడు. తమ దేశంలోని 12 స్టేడియంలలో నెలరోజులపాటు 64 మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో పోటీలను ఆసాంతం విజయవంతం చేయడంతోపాటు భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయడం ద్వారా రష్యాలో కొత్తదనం తీసుకువచ్చేందుకు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షలకు అనుగుణంగా తామంతా నడుచుకుంటున్నామని అన్నాడు. కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా అందర్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే కాకుండా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూపుల నుంచి వస్తున్న బెదిరింపులను సమర్థవంతంగా తిప్పికొడతామని పేర్కొన్నాడు. ముఖ్యంగా సాకర్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ ప్రఖ్యాత స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, నేమార్ వంటివారిని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ ఉగ్రవాదులు వివిధ సోషల్ మీడియాలలో చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో వీరితోపాటు పోటీల్లో పాల్గొనే అన్ని దేశాల ఆటగాళ్లకు సైతం సరైన భద్రత కల్పించాల్సిన అవసరం తమపై ఎంతో ఉందని అన్నాడు. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ హింసాత్మక ఘటనలు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన కొంతమందిని స్థానిక జైళ్లలో నిర్బంధించామని, దీనివల్ల క్రీడాకారులతోపాటు అభిమానులు, స్థానికులకు ఎంతో మేలు జరుగుతుందని తాము భావిస్తున్నామని అన్నాడు. కాగా, మ్యాచ్‌లను తిలకించేందుకు వచ్చే అభిమానులంతా తమ గుర్తింపు కార్డులను టికెట్‌తోపాటు తీసుకువస్తే భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డాడు.
చిత్రం..సాకర్ పోటీలు జరిగే ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న భద్రతా దళాలు