క్రీడాభూమి

సన్‌రైజర్స్‌కు ఫించ్ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 20: హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఓడించి సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆరోన్ ఫించ్ భయపెడుతున్నాడు. గురువారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌తో ఢీ కొంటున్న సన్‌రైజర్స్‌ను ఫించ్ ఏ విధంగా చెలరేగుతాడోనన్న ఆందోళన వెంటాడుతున్నది. ఈసారి ఐపిఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఫించ్ మూడు అర్ధ శతకాలతో రాణించి, ఈ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై 74, ముంబయి ఇండియన్స్‌పై 50 పరుగులు చేసిన అతను, హోం గ్రౌండ్ రాజ్‌కోట్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌పై అజేయంగా 67 పరుగులు సాధించాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతనిని ఎంత త్వరగా పెవిలియన్‌కు పంపితే తమ విజయావకాశాలు అంత మెరుగుపడతాయన్నది సన్‌రైజర్స్ అభిప్రాయం. ఫించ్‌తోపాటు సన్‌రైజర్స్ బౌలర్లకు సవాళ్లు విసిరే మరో బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెక్‌కలమ్. మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ, రైజింగ్ పుణె సూపర్‌కింగ్స్‌పై అతను 49 పరుగులు చేశాడు. గురువారం నాటి మ్యాచ్‌లో అతను భారీ స్కోరు చేసే అవకాశాలు లేకపోలేదు. వివాహం చేసుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. ఆ వేడుక పూర్తికావడంతో అతను తిరిగి జట్టుతో చేరడంతో గుజరాత్ బలం పెరిగింది. కెప్టెన్ సురేష్ రైనా, దినేష్ కార్తీక్, ధవళ్ కులకర్ణి, డ్వెయిన్ స్మిత్, వెటరన్ బౌలర్ ప్రవీణ్ తంబే వంటి మేటి క్రికెటర్లు ఆ జట్టులో ఉన్నారు.
హోం గ్రౌండ్‌లో ముంబయి ఇండియన్స్‌పై విజయం అదృష్టవశాత్తు దక్కింది కాదని నిరూపించుకోవాలంటే గుజరాత్‌ను సన్‌రైజర్స్ తప్పక ఓడించాల్సి ఉంటుంది. అయితే, పటిష్టంగా కనిపిస్తున్న గుజరాత్‌పై విజయం అనుకున్నంత సులభం కాదన్నది వాస్తవం. కెప్టెన్ డేవిడ్ వార్నర్ విజృంభణ ముంబయిపై సన్‌రైజర్స్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. కానీ, ప్రతి మ్యాచ్‌లోనూ అతను అదే స్థాయిలో ఆడతాడని అనుకోవడానికి వీల్లేదు. శిఖర్ ధావన్ వరుస వైఫల్యాలు జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న ఆశిష్ నెహ్రా మ్యాచ్‌లో ఆడే అవకాశం లేకపోవడం సన్‌రైజర్స్‌ను వేధిస్తున్న మరో సమస్య. అయితే దీపక్ హూడా, మోజెస్ హెన్రిక్స్, ఇయాన్ మోర్గాన్ వంటి సుమర్థులైన బ్యాట్స్‌మెన్ అండ ఆ జట్టుకు ఉంది. యువరాజ్ సింగ్ ఫిట్నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద గుజరాత్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో ఫించ్ దూకుడుకు సన్‌రైజర్స్ బౌలర్లు సమర్థంగా అడ్డుకట్ట వేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది. బౌలింగ్‌లో బలహీనంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్ అన్ని విభాగాల్లోనూ నిలకడగా ఆడితే గుజరాత్‌పై విజయం సాధించడం కష్టం కాదు.