క్రీడాభూమి

స్వర్ణంతో చరిత్ర సృష్టిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన 22 ఏళ్ల దీప రియోలో క్వాలిఫయర్స్‌లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పలువురు అభిమానులు, కుటుంబ సభ్యులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం మొదలు పెట్టిన క్షణం నుంచే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కలలు కనేదానినని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. ఏదో ఒక రోజు దేశం తరఫున ఒలింపిక్స్‌లో ఆడతానన్న నమ్మకం ఉండిందని, అది ఇన్నాళ్లకు నిజమైందని పేర్కొంది. క్వాలిఫయర్స్‌లో రాణించి, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడం ఒక ఎత్తయితే, పతకం సాధించే స్థాయిలో శిక్షణ పొందడం మరో ఎత్తని వ్యాఖ్యానించింది. రియోలో స్వర్ణం సాధిస్తానన్న నమ్మకం తనకు ఉందని త్రిపురకు చెందిన యువ జిన్మాస్ట్ తెలిపింది. ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం తన మొదటి లక్ష్యమని, అది పూర్తికావడంతో ఇప్పుడు తన దృష్టి పతకంపై కేంద్రీకృతమైందని చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో కృషి చేస్తానని దీప తెలిపింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ తనను తాను స్టార్ అనుకోడం లేదని చెప్పింది. ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున 11 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొనగా, వారంతా పురుషులే కావడంతో, తొలి మహిళగా తనకు పేరు రికార్డు పుస్తకాల్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడే అవకాశాన్ని సంపాదించిపెట్టినందుకు గర్విస్తున్నానని చెప్పింది. అంతమాత్రం చేత తనను స్టార్‌గా అభివర్ణించవద్దని, తాను సామాన్యురాలినేనని దీప తెలిపింది.
కోచ్‌కి అంకితం..
ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో తన విజయాన్ని చాలాకాలంగా తనకు కోచ్‌గా ఉన్న బిశే్వశ్వర్ నందీకి అంకితం ఇస్తున్నానని దీప ప్రకటించింది. అతను లేకుండా తాను ఈ స్థాయికి చేరుకునే దానిని కానని తెలిపింది. అత్యంత నిష్ణాతులైన జిమ్నాస్ట్‌లు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న కారణంగా భయపడే ‘ప్రొడనొవా’ వాల్ట్‌ను క్వాలిఫయర్స్‌లో ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఏదైనా సాధించాలంటే అలాంటి ప్రయత్నాలు చేయక తప్పదని స్పష్టం చేసింది. ఈ విభాగంలో శిక్షణ పొందడానికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయని ఆమె తెలిపింది. అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోతే తాను ప్రొడనొవా వాల్ట్ చేయగలిగి ఉండేదానిని కానని చెప్పింది. ఈ సౌకర్యాలు కల్పించిన భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కి కృతజ్ఞతలు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్, లెజెండరీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ వంటి ప్రముఖులు అభినందించడం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని తెలిపింది. బాధ్యత కూడా రెట్టింపు అయిందని దీప అన్నది. రియోలో పతకం సాధించి, దేశానికి కీర్తిప్రతిష్ఠలను సంపాదించి పెడతానని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

చిత్రం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దీప కర్మాకర్‌కు ఘన స్వాగతం పలుకుతున్న కుటుంబ సభ్యులు, అభిమానులు