క్రీడాభూమి

భారత్‌కు అగ్నిపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: మహిళల హాకీ ప్రపంచకప్ సంరంభం నేటినుంచి మొదలవుతోంది. నాలుగు గ్రూపుల్లో 16 దేశాలు ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నాయి. అప్రతిహత విజయాలతో పరుగులు తీస్తోన్న భారత్‌కు ప్రపంచకప్ మాత్రం అగ్నిపరీక్షే. బలమైన జట్లు తమ సత్తా చాటేందుకు బరిలోకి దిగుతుంటే, టోర్నీలో తొలి విజయం నమోదు చేస్తామన్న ధీమాతో భారత్ మైదానంలోకి దిగుతోంది. లండన్ వేదికగా మొదలవుతోన్న ప్రపంచకప్ సమరం ఆగస్టు 5న ఫైనల్స్‌తో ముగుస్తుంది. గ్రూప్-ఎలో నెదర్లాండ్స్, సౌత్ కొరియా, ఇటలీ, చైనా, గ్రూప్-బిలో ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇర్లాండ్ జట్లు పోరు సాగించనున్నాయి. గ్రూప్-సి నుంచి అర్జెంటీనా, జర్మనీ, స్పెయిన్, దక్షిణాఫ్రికా, గ్రూప్-డిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బెల్జియం జట్లు సత్తా చాటుకునేందుకు సమరాంగణంలోకి దిగుతున్నాయి. ఆరంభ మ్యాచ్‌లో భాగంగా శనివారం గ్రూప్-బిలో ఆతిథ్య దేశం, ఒలింపిక్ చాంపియన్ ఇంగ్లాండ్‌ను భారత్ ఎదుర్కోంటోంది. 16 ర్యాంక్‌లోని ఐర్లాండ్‌తో జూలై 26న, ఏడో ర్యాంకులోని యునైటెడ్ స్టేట్స్‌తో జూలై 29న భారత జట్టు గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప్-సి నుంచి జర్మనీ- దక్షిణాఫ్రికా, గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా -జపాన్‌లు శనివారం ఆరంభ మ్యాచ్‌లు ఆడతాయి. ప్రపంచకప్ హాకీలో తొలి విజయం నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత జట్టు కెప్టెన్ రాణి ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రూప్-బిలో తొలి మ్యాచ్ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్‌తో తలపడనున్న నేపథ్యంలో, ప్రత్యర్థి జట్టే స్వదేశంలో ఎక్కువ వత్తిడికి గురయ్యే పరిస్థితి ఉందని ఆమె విశే్లషించింది. ‘నిజానికి వత్తిడిని ఎదుర్కొనేది వాళ్లే, మనం కాదు. స్వదేశీ మైదానంలో ఆడటం వాళ్లకు ఆడ్వాంటేజ్ కావొచ్చు. కానీ క్రౌడ్స్ ముందు ఆడటం మాకు కొత్తకాదు. ఇంగ్లాండ్‌పై భారత జట్టు తన సత్తా చాటగలదన్న నమ్మకంతోవున్నా’ అంటూ ధీమా వ్యక్తం చేసింది. 2010లో అర్జెంటీనాలో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ మ్యాచ్‌ల నుంచే వెనుతిరగాల్సి వచ్చింది. అయితే, అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించి టోర్నీలో 7గోల్స్ సాధించిన రాణి, అప్పట్లో సెంటర్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈసారీ కెప్టెన్‌గా రాణికి అంత వత్తిడి ఉండకపోవచ్చు. ఎక్కడో అట్టడుగునున్న భారత మహిళా జట్టు రేటింగ్‌ను పదికి చేర్చిన సారథిగా గెలుపు బాధ్యత ఆమెపైనే ఎక్కువ. ‘జట్టు బలంగా ఉంది. ముఖ్యంగా ఫార్వార్డ్ లైన్ ఏ ఒక్కరిమీదో ఆధారపడి లేదు. గోల్స్ సాధించటంలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయలేం. ముఖ్యంగా జట్టు మొత్తం వందనా కటారియాలాంటి యువరక్తంతో నిండివుంది’ అంటోంది రాణి. ‘విజయంపై మేమిప్పుడు ఆభాభావంతో ఉన్నాం. గుర్జీత్ కౌర్‌లాంటి ప్రపంచ మేటి డ్రాగ్ ఫ్లికర్లు భారత జట్టులో ఉన్నారన్న విషయం మర్చిపోవద్దు’ అన్నది చీఫ్ కోచ్ జోర్డ్ మిర్జినె చెబుతోన్న మాట. వారం ముందుగానే లండన్ చేరుకున్న భారత జట్టు, మ్యాచ్‌లు జరగనున్న లీ వ్యాలీ హాకీ మరియు టెన్నిస్ స్టేడియంలో పదునైన సాధన ముగించింది. ఆస్ట్రేలియా, బెల్జియంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడింది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్ట్రేలియా, బెల్జియం జట్లతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. ఇప్పుడు జట్టు మొత్తం ఆరంభ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌పై విజయంపైనే ఫోకస్ చేస్తున్నాం. యుఎస్‌ఏ, ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల ఆడాల్సివున్నా, వాటికి ప్రత్యేక ప్రణాళిక ఉంది. కానీ, ప్రస్తుతం ఫోకస్ మాత్రం తొలి మ్యాచ్‌పైనే’ అంటోంది రాణి. తమ సత్తాతో అగ్నిపరీక్షను అధిగమించేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది.