క్రీడాభూమి

బాంబే హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టుకు ఎంసిఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22:క్రికెట్‌లోప్రతి చిన్న అంశానికి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆనవాయితీ పెరుగుతున్నది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నకారణంగా మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలో క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేయని ఎంసిఎ ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఆ అంశంపై వాదోపవాదాలు కొనసాగుతున్న సమయంలోనే మరో పిటిషన్‌ను ఎంసిఎ దాఖలు చేయడం విశేషం. లోధా సిఫార్సులను వెంటనే అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇటీవలే సూచించగా, వాటిలోని కొన్ని అంశాలు ఆచరణ యోగ్యంగా లేవని శరద్ పవార్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఎంసిఎ తేల్చిచెప్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ సంఘాలు, సమాఖ్యల్లో కార్యవర్గ సభ్యులకు వయోపరిమితిని ఖాయం చేయాలని, వరుసగా రెండుసార్లు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే ఎక్కువ సమయంలో కార్యవర్గంలో ఉండరాదని లోధా కమిటీ చేసిన సిఫార్సులు క్రికెట్ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. బెట్టింగ్‌కు చట్టబద్ధతను కల్పించాలన్న సూచన కూడా చర్చనీయాంశమైంది. మంత్రులకు క్రికెట్ సంఘాలు, సమాఖ్యలతో సంబంధం ఉండరాదని లోధా కమిటీ స్పష్టం చేయడం కూడా చాలా మందికి కొరుకుడు పడడం లేదు. ఈ సిఫార్సులను అమలు చేస్తే, చాలా మంది ప్రముఖులు భారత క్రికెట్‌పై తమ అధికారాన్ని కోల్పోవడం ఖాయం. చివరికి ఎంసిఎకు చీఫ్‌గా వ్యవహరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి, 75 ఏళ్ల శరద్ పవార్ కూడా పదవి నుంచి వైదొలగాల్సి వస్తుంది. లోధా కమిటీ చేసిన ప్రతిపాదన మేరకు 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరూ క్రికెట్ సంఘాల్లో ఉండకూడదు. పదవి కోల్పోయే ప్రమాదంలో పడిన పవార్ ఒత్తిడితోనే ఎంసిఎ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సమయంలో పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ఎంసిఎపై విమర్శలు గుప్పించింది.
లోధా కమిటీ సిఫార్సుల అమలు కేసు ఒకవైపు నడుస్తుండగా, మరోవైపు ఐపిఎల్ మ్యాచ్‌లపై ఎంసిఎ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. మే ఒకటోతేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాలని బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆ పిటిషన్‌లో కోరింది. మహారాష్టల్రోని ముంబయి, పుణె, నాగపూర్ నగరాలకు ఫైనల్‌సహా మొత్తం 20 ఐపిఎల్ మ్యాచ్‌లను కేటాయించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున, లక్షలాది లీటర్ల నీటిని మ్యాచ్‌ల కోసం వృథా చేయడం ఎంత వరకు సమంజసమని లోక్‌సత్తా మూమెంట్ సంస్థ దాఖలు చేసిన పిల్‌పై బాంబే హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, అప్పటికే మ్యాచ్‌లకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నామని, మ్యాచ్‌లను తరలించడం చాలా కష్టమవుతుందని ఎంసిఎ, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), ఐపిఎల్ పాలక మండలి చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఈనెల 30 వరకూ మ్యాచ్‌లను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించుకోవడానికి కోర్టు అంగీకరించింది. తాజాగా మే ఒకటిన ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, మహారాష్టల్రో మ్యాచ్‌లు ఆడాల్సిన రైజింగ్ పుణె, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్రత్యామ్నాయ వేదికలను వెతుక్కున్నారు. అయితే, మ్యాచ్‌లు తరలిపోతే భారీ నష్టం వస్తుందనే ఉద్దేశంతో అవి చేజారకుండా ఎంసిఎ ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.