క్రీడాభూమి

బీసీసీఐకి కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ)కి ఊరట లభించింది. లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలు చేయడానికి వీలుగా నిబంధనావళిని మార్చాలన్న ఆదేశాలను ఒకవైపు శిరసావహిస్తూనే, మరోవైపు గతంలో తాను చేసిన వాదనను నెగ్గించుకుంది. సవరణలతో కూడిన తీర్మానాలను ఆమోదించిన తర్వాత సమర్పించిన సరికొత్త నిబంధనావళిని సుప్రీం కోర్టు ఆమోదించింది. లోధా కమిటీ చేసిన కీలక సిఫార్సులకు గండికొట్టినప్పటికీ, సుప్రీం కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్‌ను పొందగలిగింది. ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ నిబంధనకు మొదటి నుంచి ససేమిరా అంటున్న బీసీసీఐ తన వాదనను నెగ్గించుకుంది. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో, ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్ సభ్యులుగా
ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని ఒప్పించగలిగింది. అదే విధంగా ‘కూలింగ్ ఆఫ్
పీరియడ్’ అంశంలోనూ బీసీసీఐ వాదన నెగ్గింది. మొత్తం మీద లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తూ, నిబంధనావళిలో చేసిన మార్పుల్లో కీలక అంశాలు మాత్రం బీసీసీఐకి అనుకూలంగానే ఉండడం విశేషం.
లోధా కమిటీ సూచించిన విధంగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అన్న విధానాన్ని అమలుచేస్తే సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవని బీసీసీఐ మొదటి నుంచి వాదిస్తునే ఉంది. దీని వల్ల సమస్యలు తప్పవని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక రాష్ట్రానికి ఎవరు ప్రాతినిథ్యం వహించాలన్న విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంటుందని, దీనితో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. సర్వీసెస్, ముంబయి, విదర్భ తదితర క్రికెట్ సంఘాలు దేశానికి అందిస్తున్న సేవల గురించి ప్రస్తావించింది. హఠాత్తుగా వాటి ఓటు హక్కును రద్దు చేయడం వల్ల భారత క్రికెట్‌లో ఘర్షణలు తలెత్తుతాయని పేర్కొంది. అదే విధంగా, లోధా కమిటీ సిఫార్సులను ఉన్నవి ఉన్నట్టుగా అమలు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
లోధా కమిటీ కీలక సూచనలు
ఐపీఎల్ వంటి టోర్నీల్లో బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం నుంచి బీసీసీఐలో రాజకీయ నాయకుల జోక్యాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడం వరకూ ఎన్నో అంశాలపై లోధా కమిటీ కీలక సూచనలు చేసింది. మంత్రలు ఎవరూ బిసీసీఐఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని సూచించింది. బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పోస్టులకు ఎన్నికయ్యే వ్యక్తులకు కొన్ని అర్హతలను పేర్కొంది. ఈ పోస్టుల్లో సేవలు అందించేవారు భారతీయులై ఉండాలని, వారి వయసు 70 సంవత్సరాలకు దాటరాదని, దివాలాదారుడై ఉండకూడదని, మంత్రిగా లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదని స్పష్టం చేసింది. ఇలాంటి నియమాలను పాటించినప్పుడే బీసీసీఐ పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడింది.
కూలింగ్ ఆఫ్ పీరియడ్..
లోధా కమిటీ చేసిన సూచనల్లో అత్యంత కీలకమైనది కార్యవర్గ సభ్యులకు సీలింగ్‌ను విధించడం. ఒక వ్యక్తి బీసీసీఐ పాలక మండలికి గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని, అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండకూడదని స్పష్టం చేసింది. పాలక మండలి మూడేళ్లు పదవిలో ఉండవచ్చని, అయితే, అధ్యక్షుడు రెండుసార్లు, మిగతా కార్యవర్గ సభ్యులు వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే అధికంగా పదవిలో కొనసాగేందుకు వీలులేదని వివరించింది. ఒక టెర్మ్ పూర్తయిన తర్వాత వెంటనే మరోసారి పోటీ చేయడానికి వీల్లేదని పేర్కొన్న లోధా కమిటీ ఆ విశ్రాంత సమయానే్న ‘కూలింగ్ పీరియడ్’గా అభివర్ణించింది. బీసీసీఐ కార్యవర్గంలో మొదటి టెర్మ్ పూర్తయిన వెంటనే ‘కూలింగ్ పీరియడ్’ మొదలుకావాలన్నది లోధా కమిటీ సూచన. కానీ, ఈ సూచనను బోర్డు కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఆచరణకు అసాధ్యం కాదని తన వాదనల్లో తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ అంశంపై స్పందిస్తూ, ‘కూలింగ్ పీరియడ్’ ఉండితీరాలని స్పష్టం చేసింది. అయితే, మొదటి టెర్మ్ తర్వాత కాకుండా, రెండో టెర్మ్ పూర్తయిన తర్వాత అమల్లోకి తీసుకురావచ్చని వెసులుబాటు కల్పించింది.
బీసీసీఐ నిర్మాణం, నియమ నిబంధనలకు సంబంధించి కూడా లోధా కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలను చేసింది. బోర్డులో 30 యూనిట్లకు సభ్యత్వం ఉందని, అయితే, సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవని లోధా కమిటీ గుర్తుచేసింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలకు బీసీసీఐలో సభ్యత్వం ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ విధమైన అసమానతలను తొలగించి, ఒక రాష్ట్రానికి ఒక్కో సంఘం, ఒక ఓటు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలను తాజాగా సవరించక పూర్వం బీసీసీఐ అధ్యక్షుడికి మూడు ఓట్లు వేసే అవకాశం ఉంది. తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి ఓటు ఉంటుంది. ఏదైనా అంశంపై ఓట్లు చెరి సమానంగా పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది. అయితే ఈ విధానాన్ని లోధా కమిటీ తప్పుపట్టింది. ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఎందుకని లోధా కమిటీ ప్రశ్నించింది. సంబంధిత క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే సరిపోతుందని అభిప్రాయపడింది. ఇలావుంటే, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు విధానాన్ని అమలు చేసేందుకు మొదటి నుంచి విముఖంగా ఉన్న బీసీసీఐ తాజా సవరణల్లో ఆ అంశాన్ని చేర్చలేదు. ఈ పద్ధతి ప్రస్తుత పరిస్థితుల్లో పనికి రాదని తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు ధర్మాసనం కూడా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనే అంశంపై పట్టుపట్టక పోవడం విశేషం. దీనితో ముంబయి, సౌరాష్ట్ర, వడోదర, విదర్భ క్రికెట్ సంఘాలు మళ్లీ బీసీసీఐలో చేరాయి. అదే విధంగా రైల్వేస్, సర్వీసెస్, యూనివర్శిటీస్ క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐ అంతర్భాగంగానే కొనసాగుతాయి.
ఆర్‌టీఐ పరిధిలోకి..
లోధా కమిటీ చేసిన అత్యంత కీలక సిఫార్సులో ఒకటైన సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి బీసీసీఐ చేరాలన్న అంశం ఇనే్నళ్లకు సాకారమైంది. బీసీసీఐ కార్యకలాపాల్లో ఎక్కువ శాతం ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న లోధా కమిటీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. తమిళనాడులో ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున బోర్డు పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బీసీసీఐ చాలాకాలంగా వాదిస్తున్నది. బోర్డును ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావడానికి గతంలో చాలా సందర్భాల్లో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. అయితే, సుప్రీం కోర్టు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో, బోర్డుకు తదనుగుణంగా నిబంధనావళిని మార్చక తప్పలేదు.