క్రీడాభూమి

హోరాహోరీలో నిలిచిన నైట్ రైడర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఏప్రిల్ 24: చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ నిలబడితే, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 162 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ మరో మూడు బంతులు ఉండగా చేదించింది. తిసర పెరెరా వేసిన చివరి ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా మార్చిన ఉమేష్ యాదవ్ నైట్ రైడర్స్‌కు విజయాన్ని అందించాడు.
టాస్ గెలిచి నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణె 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 160 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆజింక్య రహానే 52 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 67 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. స్టీవెన్ స్మిత్ 31, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 23 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్, సునీల్ నారైన్, రాజగోపాల్ సతీష్, ఉమేష్ యాదవ్ తలా ఒక వికెట్ కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ మొదటి బంతికే రాబిన్ ఉతప్ప (0) వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ గౌతం గంభీర్ 11 పరుగులు చేసి రనౌట్‌కాగా, సూర్యకుమార్ యాదవ్, షకీబ్ అల్ హసన్ జట్టును ఆదుకున్నారు. 49 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టిన సూర్య కుమార్ 60 పరుగులు చేయగా, షకీబ్ 36 పరుగులు సాధించాడు. ఆండ్రె రసెల్ 17 పరుగులతో స్కోరును విజయానికి చేరువగా తీసుకొచ్చాడు. చివరి రెండు ఓవర్లలో నైట్ రైడర్స్‌కు 18 పరుగులు అవసరంకాగా, 19వ ఓవర్‌లో 11 పరుగులు లభించాయి. రాజగోపాల్ సతీష్ (10) వికెట్ కూలింది. చివరి ఓవర్‌లో నైట్ రైడర్స్ విజయానికి ఏడు పరుగుల దూరంలో నిలిచింది. తిసర పెరెరా వేసిన ఆ ఓవర్ మొదటి బంతిలో రెండు పరుగులు రాబట్టిన పీయూష్ చావ్లా (10) రెండో బంతికి అవుటయ్యాడు. మూడో బంతిని ఉమేష్ యాదవ్ సిక్స్‌గా మార్చడంతో నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి, రెండు వికెట్ల తేడాతో గెలిచింది.
సంక్షిప్త స్కోర్లు
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 (ఆజింక్య రహానే 67, స్టీవెన్ స్మిత్ 31, మహేంద్ర సింగ్ ధోనీ 23 నాటౌట్).
కోల్‌కతా నైట్ రైడర్స్: 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 162 (సూర్య కుమార్ యాదవ్ 60, షకీబ్ అల్ హసన్ 36, ఆండ్రె రసెల్ 17).

చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్
విజేతలు లిన్ డాన్, జురుయ్
చాంగ్జూ, ఏప్రిల్ 24: చైనా గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో రెండో ర్యాంక్ ఆటగాడు లిన్ డాన్, మహిళల సింగిల్స్‌లో నంబర్ వన్ క్రీడాకారిణి లీ జురుయ్ తమతమ ప్రత్యర్థులను ఓడించి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. పురుషుల ఫైనల్‌లో టాప్ సీడ్ చెన్ లాంగ్‌తో తలపడిన లిన్ డాన్ 21-17, 23-21 తేడాతో విజయం సాధించాడు. మొదటి సెట్‌లో నిర్లక్ష్యంగా ఆడిన కారణంగా ఎదురుదెబ్బ తిన్న చెన్ లాంగ్ రెండో సెట్‌లో సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించాడు. కానీ, లిన్ డాన్ కూడా అదే స్థాయిలో రాణించడంతో చెన్ లాంగ్‌కు ఓటమి తప్పలేదు. కాగా, మహిళల సింగిల్స్‌లో జురుయ్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఐదో సీడ్ సన్ యూతో తలపడిన ఆమె 21-16, 19-21, 21-16 తేడాతో గెలిచింది. పురుషుల డబుల్స్‌లో లీ యాంగ్ డయే, యూ ఇయెన్ సియాంగ్ జోడీ 21-17, 21-14 స్కోరుతో కిమ్ గిజంగ్, కిమ్ సా రాంగ్ జోడీపై గెలిచి టైటిల్ అందుకుంది. మహిళల డబుల్స్‌లో లియో ఇంగ్, లియో యూ జోడీ 16-21, 21-15, 21-18 ఆధిక్యంతో చెన్ కింగ్ చెన్, జియా ఇఫాన్ జోడీని ఓడించి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ జూ చెన్ మా జిన్ జోడీకి దక్కింది. వీరు ఫైనల్‌లో జెంగ్ సి వెయ్, చెన్ క్వింగ్‌చెన్ జోడీని 21-17, 21-15 తేడాతో ఓడించారు.

రెజ్లర్ తోమర్‌కు ఒలింపిక్ బెర్త్
ఉలాన్‌బాతర్ (మంగోలియా), ఏప్రిల్ 24: భారత రెజ్లర్ సందీప్ తోమర్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభించింది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 57 కిలోల విభాగంలో పోటీపడిన 25 ఏళ్ల తోమర్ ప్లే ఆఫ్ బౌట్‌లో గెలిచి, కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. యోగేశ్వర్ దత్ (65 కిలోల ఫ్రీస్టయిల్), నర్సింగ్ యాదవ్ (74 కిలోల ఫ్రీస్టయిల్), హర్దీప్ సింగ్ (98 కిలోల గ్రీకో రోమన్) ఇప్పటికే ఒలింపిక్స్ బెర్త్ సంపాదించగా, తాజాగా తోమర్ ఆ జాబితాలో చేరాడు.