క్రీడాభూమి

కోహ్లీ శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 24: భారీ స్కోర్లకు ప్రయత్నించకుండా, ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా ఆడి తమ వంతు పాత్రను పోషిస్తే విజయం సాధించడం అసాధ్యం కాదని గుజరాత్ లయన్స్ నిరూపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదంతొక్కగా, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ లోకేష్ రాహుల్ 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ప్రతిభ కారణంగా బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 180 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. అయితే, తమ ముందు ఉన్న లక్ష్యాన్ని చూసి భయపడకుండా, గుజరాత్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగా, 4 వికెట్లు కోల్పో యి లక్ష్యాన్ని చేదించి, 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు.
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకొని, షేన్ వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే, ఎనిమిది పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన వాట్సన్‌ను రవీంద్ర జడేజా చక్కటి క్యాచ్ అందుకోగా ధవళ్ కులకర్ణి అవుట్ చేశాడు. హార్డ్ హిట్టర్ ఎబి డివిలియర్స్ 16 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి వెటరన్ బౌలర్ ప్రవీణ్ తంబే బౌలింగ్‌లో సురేష్ రైనాకు చిక్కాడు. 59 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత రాహుల్‌తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. 63 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసిన అతను నాటౌట్‌గా నిలిచాడు. ఐపిఎల్‌లోనేగాక, టి-20 ఫార్మెట్‌లోనూ కోహ్లీకి ఇదే తొలి శతకం. కాగా, రాహుల్ 35 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 51 పరుగులు సాధించాడు. గుజరాత్ బౌలర్లలో ధవళ్ కులకర్ణి, ప్రవీణ్ తంబే చెరొక వికెట్ పడగొట్టారు.
వ్యూహాత్మకంగా అడుగులు
భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పటికీ గుజరాత్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా లక్ష్యం వైపు అడుగులు వేశారు. డ్వెయిన్ స్మిత్, బ్రెండ్ మెక్‌కలమ్ మొదటి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. స్మిత్ 21 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో డివిలియర్స్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు కెప్టెన్ సురేష్ రైనాతో కలిసి 40 పరుగుల జోడించిన తర్వాత మెక్‌కలమ్ అవుటయ్యాడు. అతను 24 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి తబ్రాజ్ షంసీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రైనా 24 బంతుల్లో 28 పరుగులు సాధించి యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఇక్బాల్ అబ్దుల్లాకు చిక్కాడు. జట్టును గెలిపించే బాధ్యతను వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ స్వీకరించగా, రవీంద్ర జడేజా 10 బంతుల్లో 12 పరుగులు చేసి షేన్ వాట్సన్ బౌలింగ్‌లో, వికెట్‌కీపర్ లోకేష్ రాహుల్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు గుజరాత్ 182 పరుగులు సాధించి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా, అప్పటికి కార్తిక్ 50 (39 బంతులు, మూడు ఫోర్లు), డ్వెయిన్ బ్రేవో 4 (ఒక బంతి, ఒక ఫోర్) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కెరీర్‌లో తొలిసారి టి-20 ఫార్మెట్‌లో శతకాన్ని నమోదు చేసిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరుబోర్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ నాటౌట్ 100, షేన్ వాట్సన్ సి రవీంద్ర జడేజా బి ధవళ్ కులకర్ణి 6, ఎబి డివిలియర్స్ సి సురేష్ రైనా బి ప్రవీణ్ తంబే 20, లోకేష్ రాహుల్ నాటౌట్ 51, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1-8, 2-59.
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3-0-29-0, ధవళ్ కులకర్ణి 4-0-39-1, ప్రవీణ్ తంబే 3-0-24-1, షాదబ్ జకాటీ 3-0-28-0, రవీంద్ర జడేజా 3-0-17-0, డ్వెయిన్ బ్రేవో 4-0-43-0.
గుజరాత్ లయన్స్: డ్వెయిన్ స్మిత్ సి ఎబి డివిలియర్స్ బి కేన్ రిచర్డ్‌సన్ 32, బ్రెండన్ మెక్‌కలమ్ సి అండ్ బి తబ్రాజ్ షంసీ 42, సురేష్ రైనా సి ఇక్బాల్ అబ్దుల్లా బి యజువేంద్ర చాహల్ 28, దినేష్ కార్తీక్ 50 నాటౌట్, రవీంద్ర జడేజా సి లోకేష్ రాహుల్ బి షేన్ వాట్సన్ 12, డ్వెయిన్ బ్రేవో 4 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1-47, 2-87, 3-140, 4-178.
బౌలింగ్: యజువేంద్ర చాహల్ 4-0-33-1, కేన్ రిచర్డ్‌సన్ 4-0-53-1, ఇక్బాల్ అబ్దుల్లా 4-0-41-0, షేన్ వాట్సన్ 3.3-0-31-1, తబ్రాజ్ షంసీ 4-0-21-1.

గట్టెక్కాడు..
టి-20 ఫార్మెట్‌లో ఐదు వేలకుపైగా పరుగులు సాధించినప్పటికీ ఒక్క సెంచరీ కూడా చేయని బ్యాట్స్‌మెన్ జాబితాలో ఉన్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు గట్టెక్కాడు. ఈ మ్యాచ్‌కి ముందు అతను ఒక్క శతకం కూడా లేకుండా, 192 మ్యాచ్‌ల్లో 5,739 పరుగులు చేశాడు. తన 193వ టి-20 మ్యాచ్‌లో అజేయంగా వంద పరుగులు చేశాడు. కాగా, ఐదు వేలకుపైగా పరుగులు చేసినప్పటికీ ఒక్క సెంచరీ కూడా చేయని బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇప్పటికీ కొనసాగుతున్న వారిలో షోయబ్ మాలిక్‌ది అగ్రస్థానం. అతను 221 మ్యాచ్‌ల్లో 5,995 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95 (నాటౌట్). కీరన్ పోలార్డ్ 272 ఇన్నింగ్స్‌లో 5,948 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 89 (నాటౌట్) పరుగులు. ఓవైస్ షా 217 మ్యాచ్‌ల్లో 5,509 (టాప్ స్కోర్ 84), గౌతం గంభీర్ 196 మ్యాచ్‌ల్లో 5,107 (అత్యధిక స్కోరు 92) పరుగులు చేసినప్పటికీ సెంచరీ సాధించలేకపోయారు. జీన్ పాల్ డుమినీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఈ జాబితా నుంచి బయటపడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అతను 191 ఇన్నింగ్స్‌లో 5,002 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 99 (నాటౌట్) పరుగులు.

* విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించారు. ఈ ఐపిఎల్‌లో బెంగళూరు వంద లేదా అంతకు మించిన భాగస్వామ్యాలను నమోదు చేయడం ఇది నాలుగోసారి. మిగతా ఏడు జట్లు కలిసి ఈటోర్నీలో ఇప్పటి వరకూ మూడు సెంచరీ భాగస్వామ్యాలను మాత్రమే సాధించడం గమనార్హం.
* ఐపిఎల్‌లో గత 20 ఇన్నింగ్స్‌లో లోవకేష్ రాహుల్ అత్యుత్తమ స్కోరు 46 పరుగులు. ఈమ్యాచ్‌లో అతను 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం దీ 35 టి-20 ఇన్నింగ్స్‌లో అతనికి ఇది నాలుగో అర్ధ శతకం. ఈ ఫార్మెట్‌లో అతని అత్యధిక స్కోరు 62 పరుగులు.
* రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ లయన్స్‌కు విజయాన్ని అందించిన దినేష్ కార్తీక్ 16 ఇన్నింగ్స్ తర్వాత అర్ధ శతకాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.