క్రీడాభూమి

ఆధిక్యం దిశగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వెస్టిండీస్‌తో ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకునే దిశగా ముందుకు సాగుతున్నది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్‌కాగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 308 పరుగులు చేసింది. విండీస్ కంటే కేవలం మూడు పరుగులు వెనుకబడిన భారత్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. మొదటి టెస్టులో సెంచరీతో కదంతొక్కిన యువ సంచలన క్రీడాకారుడు పృథ్వీ షా రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ రాణించి, అర్ధ శతకాన్ని నమోదు చేయడం విశేషం. అజింక్య రహానే, రిషభ్ పంత్ హాఫ్ సెంచరీలు పూర్తిచేసి నాటౌట్‌గా నిలిచారు.
ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించిన వెస్టిండీస్ మరో పరుగు తర్వాత దేవేంద్ర బిషూ వికెట్ కోల్పోయింది. అతను తన ఓవర్‌నైట్ స్కోరు రెండు పరుగులకు అదనంగా పరుగులు జోడించకుండానే, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో ఉన్న రాస్టన్ చేజ్ కెరీర్‌లో నాలుగో శతకాన్ని సాధించాడు. 189 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 106 పరుగులు చేసిన అతనిని ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేశాడు. జొమెల్ వారికన్ ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా నిలవగా, షానన్ గాబ్రియల్ పరుగుల ఖాతాను తెరవకుండానే, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును సాధించడం ద్వారా విండీస్‌పై ఒత్తిడిని పెంచడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు లోకేష్ రాహుల్, పృథ్వీ షా చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. పృథ్వీ షా చెలరేగి ఆడగా, అతనికి మద్దతునివచ్చే క్రమంలో రాహుల్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. 25 బంతులు ఎదుర్కొని, నాలుగు పరుగులు చేసిన అతనిని జాసన్ హోల్డర్ బౌల్డ్ చేయడంతో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 98 పరుగుల వద్ద రెండో వికెట్‌ను పృథ్వీ షా రూపంలో చేజార్చుకుంది. కేవలం 53 బంతుల్లోనే, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 70 పరుగులు చేసిన అతను జొమెల్ వారికన్ బౌలింగ్‌లో షిమ్రన్ హాత్‌మేయర్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే సత్తావున్న చటేశ్వర్ పుజారా అందరి అంచనాలను తారుమారు చేస్తూ పది పరుగులకే వెనుదిరిగాడు. షానన్ గాబ్రియల్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు జమర్ హామిల్టన్‌కు దొరికాడు. ఆతర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను అజింక్య రహానేతో కలిసి తన భుజాలపై వేసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. అతను 78 బంతుల్లో 45 పరుగులు సాధించి, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా ఔటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 162 పరుగులు. అనంతరం రహానే, రిషభ్ పంత్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. ఐదో వికెట్‌కు అజేయంగా 146 పరుగులు జోడించి, ఆట ముగిసే సమయానికి స్కోరును 308 పరుగులకు చేర్చారు. రహానే 174 బంతుల్లో 75 (6 ఫోర్లు), రిషభ్ పంత్ 120 బంతుల్లో 85 (10 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

స్కోరు బోర్డు:
========
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: (ఓవర్‌నైట్ స్కోరు 7 వికెట్లకు 295) క్రెగ్ బ్రాత్‌వెయిట్ ఎల్‌బీ కుల్దీప్ యాదవ్ 14, కీరన్ పావెల్ సీ రవీంద్ర జడేజా బీ రవిచంద్రన్ అశ్విన్ 22, షాయ్ హోప్ ఎల్‌బీ ఉమేష్ యాదవ్ 36, షిమ్రన్ హేత్‌మెయర్ ఎల్‌బీ కుల్దీప్ యాదవ్ 12, సునీల్ ఆంబ్రిస్ సీ రవీంద్ర జడేజా బీ కుల్దీప్ యాదవ్ 18, రాస్టన్ చేజ్ బీ ఉమేష్ యాదవ్ 106, షేన్ డౌరిచ్ ఎల్‌బీ ఉమేష్ యాదవ్ 30, జాసన్ హోల్డర్ సి రిషభ్ పంత్ బి ఉమేష్ యాదవ్ 52, దేవేంద్ర బిషూ బీ ఉమేష్ యాదవ్ 2, జొమెల్ వారికన్ 8 నాటౌట్, షానన్ గాబ్రియల్ సి రిషభ్ పంత్ బి ఉమేష్ యాదవ్ 8, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (101.4 ఓవర్లలో ఆలౌట్) 311.
వికెట్ల పతనం: 1-32, 2-52, 3-86, 4-92, 5-113, 6-182, 7-286, 8-296, 9-311, 10-311.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 26.4-3-88-6, శార్దూల్ ఠాకూర్ 1.4-0-9-0, రవిచంద్రన్ అశ్విన్ 24.2-7-49-1, కుల్దీప్ యాదవ్ 29-2-85-3, రవీంద్ర జడేజా 20-2-69-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ బీ జాసన్ హోల్డర్ 4, పృథ్వీ షా సీ షిబ్రన్ హేత్‌మేయర్ బీ జోమెల్ వారికన్ 70, చటేశ్వర్ పుజారా సీ (సబ్‌స్టిట్యూట్) జమర్ హామిల్టన్ బీ షానన్ గాబ్రియల్ 10, విరాట్ కోహ్లీ ఎల్‌బీ జాసన్ హోల్డర్ 45, అజింక్య రహానే 75 నాటౌట్, రిషభ్ పంత్ 85 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 19, మొత్తం (81 ఓవర్లలో 4 వికెట్లకు) 308.
వికెట్ల పతనం: 1-61 2-98, 3-102, 4-162.
బౌలింగ్: షానన్ గాబ్రియల్ 13-1-13-1, జాసన్ హోల్డర్ 14-2-45-2, జొమెల్ వారికన్ 24-4-78-1, రాస్టన్ చేజ్ 8-1-22-0, దేవేంద్ర బిషూ 19-4-72-0, క్రెగ్ బ్రాత్‌వెయిట్ 2-0-6-0.