క్రీడాభూమి

విండీస్‌కు వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వెస్టిండీస్‌పై టీమిండియా మరోసారి పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. మొదటి టెస్టు మాదిరిగానే రెండో టెస్టును కూడా మూడు రోజుల్లోనే ముగించింది. పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేయడంతో, రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో విండీస్‌కు వైట్‌వాష్ తప్పలేదు. అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉన్న వెస్టిండీస్ మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూస్తే, రెండో టెస్టులో కొద్దిపాటి పోరాటంతో, పరాజయాన్ని పది వికెట్ల తేడాకు పరిమితం చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన పేసర్ ఉమేష్ యాదవ్ రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు సాధించి, విండీస్ పరాజయాన్ని శాసించాడు.

రాణించిన జాసన్..
రెండో రోజు ఆటను నాలుగు వికెట్లకు 308 పరుగుల వద్ద ముగించిన భారత్ మూడోరోజు భారీ స్కోరు సాధించి, విండీస్‌ను ఇరుకున పెడుతుందని అంతా ఊహించారు. కానీ, ఆ స్థాయిలో రాణించలేక విఫలమైన టీమిండియా మరో 59 పరుగులు జోడించి, ఆరు వికెట్లను కోల్పోయింది. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఐదు వికెట్లతో రాణించాడు. కాగా, 367 పరుగులకు ఆలౌటైన భారత్‌కు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ 92, అజింక్య రహానే 80 పరుగులకు ఔట్‌కాగా, చివరిలో రవిచంద్రన్ అశ్విన్ 35 పరుగులు చేశాడు. హోల్డర్ 56 పరుగులకు ఐదు వికెట్లు పడగొడితే, మరో పేసర్ షానన్ గాబ్రియల్ 107 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. జొమెల్ వారికన్‌కు రెండు వికెట్లు లభించాయి.
తొలి ఓవర్‌లోనే వికెట్..
మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే క్రెగ్ బ్రాత్‌వెయిట్ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్‌లో రెండో బంతి అతి వేగంగా దూసుకొచ్చి, బ్రాత్‌వెయిట్ బ్యాట్‌ను ముద్దాడుతూ వికెట్‌కీపర్ రిషభ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. మరో ఓపెనర్ కీరన్ పావెల్ తొమ్మిది బంతులు ఎదుర్కొన్నప్పటికీ, ఒక్క పరుగు కూడా చేయకుండానే అశ్విన్ బౌలింగ్‌లో అజింక్య రహానేకు చిక్కాడు. ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఆదుకోవడానికి షాయ్ హోప్, షిమ్రన్ హేత్‌మేయర్ కొంత సేపు పోరాడారు. కానీ, ఈ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ ఛేదించాడు. 17 పరుగులు చేసిన హేత్‌మేయర్ షాట్‌కు ప్రయత్నించి, చటేశ్వర్ పుజారా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 45 పరుగులు. ఈ స్కోరుకు మరో పరుగు కూడా జత కలవక ముందే, షాయ్ హోప్ సైతం వెనుదిరిగాడు. 42 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 28 పరుగులు చేసిన అతనిని అజింక్య రహానే క్యాచ్ అందుకోగా, రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. కీలక వికెట్లు కోల్పోవడంతో దిగాలుపడిన వెస్టిండీస్ కోలుకోలేపోయింది. సునీల్ ఆంబ్రిస్ ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, రాస్టన్ చేజ్ (6), షేన్ డౌరిచ్ (0), జాసన్ హోల్డర్ (19) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సహచరుల నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఏకాగ్రతను కోల్పోయిన ఆంబ్రిస్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. 95 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. జొమెల్ వారికన్ (7), షానన్ గాబ్రియల్ (1) భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడంతో, వెస్టిండీస్ 46.1 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. అప్పటికి దేవేంద్ర బిషూ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 45 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, అద్భుత బౌలింగ్‌తో రాణించిన రవీంద్ర జడేజా 11 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి, మూడు వికెట్లు సాధించాడు. అశ్విన్‌కు రెండు, కుల్దీప్ యాదవ్‌కు ఒకటి చొప్పున వికెట్లు లభించాయి.
అత్యంత సునాయాసమైన 71 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. పృథ్వీ షా (45 బంతులు, 4 ఫోర్లు), లోకేష్ రాహుల్ (53 బంతులు, ఒక ఫోర్, ఒక సిక్సర్) చెరి 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, మ్యాచ్ మూడో రోజే టీమిండియాకు తిరుగులేని విజయాన్ని అందించారు.