క్రీడాభూమి

అక్షర్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, మే 1: స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రతిభ గుజరాత్ లాయన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. కెప్టెన్ మురళీ విజయ్ అర్ధ శతకంతో పంజాబ్‌ను ఆదుకోగా, గుజరాత్ తరఫున జేమ్స్ ఫాల్క్‌నెర్ ఒంటరి పోరాటం సాగించినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు గుజరాత్ ‘మిస్టీరియస్ స్పిన్నర్’ శివిల్ కౌశిక్ 3 వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను కట్టడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా కౌశిక్ శ్రమ వృథా అయింది.
గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా టాస్ గెలిచి, తమ బ్యాటింగ్ బలంపై నమ్మకంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతని ఆహ్వానంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు కెప్టెన్ మురళీ విజయ్, మార్కస్ స్టొయినిస్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 65 పరుగులు జోడించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి వికెట్‌కీపర్ దినేష్ కార్తీక్ స్టంప్ చేయడంతో స్టొయినిస్ అవుటయ్యాడు. అతను 17 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు సాధించాడు. షాన్ మార్ష్ (1), గ్లేన్ మాక్స్‌వెల్ (0), గుర్‌కీరత్ సింగ్ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. 41 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లతో 55 పరుగులు చేసిన మురళీ విజయ్‌ని డ్వెయిన్ బ్రేవో క్యాచ్ అందుకోగా కౌశిక్ అవుట్ చేశాడు. 100 పరుగులకు ఐదు వికెట్లు కూలగా, కెప్టెన్సీని కోల్పోయిన డేవిడ్ మిల్లర్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా కొంత సేపు క్రీజ్‌లో నిలదొక్కుకొని స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. మిల్లర్ 27 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లతో 31 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. సాహా 19 బంతుల్లో 33 పరుగులు చేసి డ్వెయిన్ బ్రేవో బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మోహిత్ శర్మ (1), కెసి కరియప్ప (1) క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. పంజాబ్ 19.5 ఓవర్లలో ఆలౌటయ్యే సమయానికి సందీప్ శర్మ ఒక పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో కౌశిక్ 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రవీణ్ కుమార్, డ్వెయిన్ బ్రేవోకు చెరి రెండు వికెట్లు లభించాయి.
ఆదిలోనే తడబాటు
పంజాబ్‌ను ఓడించడానికి 155 పరుగుల సాధారణమైన లక్ష్యాన్ని చేదిండం అవసరంకాగా, ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్ ఆరంభంలోనే తడబడింది. 13 పరుగుల వద్ద మోహిత్ శర్మ బౌలింగ్‌లో బ్రెండన్ మెక్‌కలమ్ (1) క్లీన్ బౌల్డ్ కావడంతో తొలి వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ సురేష్ రైనా 15 బంతుల్లో 18 పరుగులు చేసి మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే ఓపెనర్ డ్వెయిన్ స్మిత్ (15) పోరాటానికి తెరపడింది. గుర్‌కీతర్ సింగ్ మాన్ క్యాచ్ అందుకోగా అతనిని అవుట్ చేసిన అక్షర్ పటేల్ వరుస బంతుల్లో దినేష్ కార్తీక్ (2), డ్వెయిన్ బ్రేవో (0) వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. 11 బంతుల్లో 11 పరుగులు చేసిన రవీంద్ర జడేజాను కూడా వికెట్‌కీపర్ సాహా క్యాచ్ అందుకోగా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. 57 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను ఇషాన్ కిషన్, జేమ్స్ ఫాల్క్‌నెర్ జోడీ ఆదుకునేందుకు ప్రయత్నించింది. అయితే, 24 బంతుల్లో, మూడు ఫోర్లతో 27 పరుగులు చేసిన భారత అండన్-19 జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ రనౌట్ కావడంతో గుజరాత్ విజయావకాశాలకు గండిపడింది. ప్రవీణ్ కుమార్ 15 పరుగులు సాధించి మోహిత్ శర్మ బౌలింగ్‌లో కరియప్ప క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. చివరి ఓవర్ రెండో బంతిలో ఫాల్క్‌నెర్ వికెట్ కూడా కూలింది. అతను 27 బంతుల్లో, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లలో గుజరాత్ 9 వికెట్లకు 131 పరుగులు చేసి, 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అప్పటికి ధవళ్ కులకర్ణి (6), శివిల్ కౌశిక్ (0) నాటౌట్‌గా ఉన్నారు. అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు కూల్చడం ద్వారా గుజరాత్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. మోహిత్ శర్మ 32 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: 19.5 ఓవర్లలో 154 ఆలౌట్ (మురళీ విజయ్ 55, మార్కస్ స్టొయినిస్ 27, డేవిడ్ మిల్లర్ 31, వృద్ధిమాన్ సాహా 33, శివిల్ కౌశిక్ 3/20, డ్వెయిన్ బ్రేవో 2/33, ప్రవీణ్ కుమార్ 2/25).
గుజరాత్ లయన్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 (సురేష్ రైనా 18, ఇషాన్ కిషన్ 27, జేమ్స్ ఫాల్క్‌నెర్ 32, అక్షర్ పటేల్ 4/21, మోహిత్ శర్మ 3/32).

* అక్షర్ పటేల్ సాధించిన హ్యాట్రిక్ ఐపిఎల్‌లో 14వది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఇది మూడోది. మొదటి రెండు హ్యాట్రిక్స్‌ను యువరాజ్ సింగ్ నమోదు చేశాడు.
* ఐపిఎల్‌లో ఒక చైనామన్ బౌలర్ అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణల్లో శివిల్ కౌశిక్‌కి మూడో స్థానం దక్కింది. అతను 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ హాగ్ 2015లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 20 పరుగులకు 4, ఈ ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 19 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చాడు.
* కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టం లేకుండా 59 పరుగులు చేసింది. కానీ, ఆతర్వాత మూడు ఓవర్లలో 15 పరుగులు జోడించి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. కాగా, పవర్ ప్లేలో పంజాబ్‌కు ఈ ఐపిఎల్‌లో ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు గుజరాత్ లయన్స్‌తోనే మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగులు సంపాదించింది.
* ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్ బౌల్ చేసిన రవీంద్ర జడేజా 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపిఎల్‌లో పవర్ ప్లే కొనసాగుతున్నప్పుడు ఒక బౌలర్ ఇంత భారీగా పరుగులు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి.
* కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ మిల్లర్‌ను తప్పించిన యాజమాన్యం మురళీ విజయ్‌కి బాధ్యతలు అప్పచెప్పింది. అతను పంజాబ్‌కు నాయకత్వం వహించిన తొమ్మిదో ఆటగాడు. ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లోనూ తొమ్మిది మంది కెప్టెన్లు మారారు. ఐపిఎల్‌లో మరే జట్టుకూ ఇంత మంది సారథ్య బాధ్యతలు వహించలేదు.
* రెండు, మూడు, నాలుగు, ఐదు వికెట్లకు కలిపి గుజరాత్ లయన్స్ మొత్తం 61 పరుగులను సాధించగలిగింది. ఐపిఎల్ మ్యాచ్‌లో నాలుగు భాగస్వామ్యాలకు ఇదే అత్యల్ప స్కోరు. పవర్ ప్లేలో ఈ జట్టు అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 42 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ పేరిట ఉన్న ఈ రికార్డును గుజరాత్ 36 పరుగులకు పరిమితమై బద్దలు చేసింది.
* ఈ ఐపిఎల్‌లో మొదటి వికెట్‌ను సాధించడానికి ప్రవీణ కుమార్ 147 బంతులు తీసుకున్నాడు. ఒక సీజన్‌లో ఒక బౌలర్ వికెట్ లేకుండా ఎక్కువ బంతులు వేసిన సంఘటనల్లో ఇది రెండోది. మొదటి స్థానం కూడా ప్రవీణ్ కుమార్‌దే కావడం విశేషం. అతను 2012 సీజన్‌లో మొదటి వికెట్ కూల్చడానికి 159 బంతులు తీసుకున్నాడు.