క్రీడాభూమి

ఆచితూచి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 28: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించవచ్చన్న ఆశలు ఆవిరికాగా, గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థిని నిలువరించడంతోపాటు, సిరీస్‌ను కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగడానికి టీమిండియా ఆచితూచి అడుగు వేస్తున్నది. గత మూడు మ్యాచ్‌ల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని, సోమవారం జరిగే నాలుగో వనే్డ కోసం ఆటగాళ్ల కూర్పుపై కసరత్తును మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్‌లో గెలుపొందిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఈ సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, విశాఖపట్నం వనే్డ టైగా ముగియడంతో కంగుతిన్నారు. ఇక పుణేలో శనివారం జరిగిన మూడో వనే్డలో కోహ్లీ బృందం పరాజయాన్ని ఎదుర్కోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లో ఇలాంటి ఫలితాలను అభిమానులతోపాటు టీమిండియా కూడా ఊహించలేదు. భారత జట్టుకు ఇది అనుకోని పరిణామమే. ఈ అనుభవాలు నేర్పిన పాఠాలతో చివరి రెండు మ్యాచ్‌ల్లో సరైన వ్యూహాలతో బరిలోకి దిగాలని కోహ్లీ సేన యోచిస్తున్నది.
మూడో వనే్డను 43 పరుగుల తేడాతో చేజార్చుకున్న తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ కేదార్ జాదవ్ గాయం నుంచి కోలుకున్నాడని, అతని చేరికతో జట్టు మరింత సమతూకంగా ఉంటుందని వ్యాఖ్యానించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. జాదవ్ జట్టులోకి వస్తే, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్ విభాగం కూడా బలపడుతుంది. పుణే వనే్డలో ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. కాబట్టి, ఆల్‌రౌండర్ల హోదాలో సేవలు అందించగల ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చనే కోణంలో కోహ్లీ బృందం ఆలోచిస్తున్నది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు ముందు భారత్ మొత్తం 15 వనే్డలను ఆడనుంది. ఇప్పటి నుంచే ప్రయోగాలు చేస్తూ, వ్యూహాత్మకంగా జట్టులో సమతూకాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళితేగానీ ఆ మెగా ఈవెంట్‌లో గొప్పగా రాణించడం కుదరదు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ దామాషా ఎలా ఉండాలన్నదే జట్టు మేనేజ్‌మెంట్ ముందుకున్న ప్రధాన సమస్య. ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో ఆడాలా? లేక అందులో ఇద్దరు ఆల్‌రౌండర్లకు అవకాశం కల్పించాలా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తం మీద కోహ్లీ అండ్ కోను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జట్టు కూర్పు ఒకటి.
మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్‌లో లేకపోవడం భారత జట్టును ఆందోళనకు గురి చేస్తున్నది. అతను పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో, మిడిల్ ఆర్డర్ బలహీన పడిందనేది వాస్తవం. ఇప్పటికే అతను టీ-20 ఫార్మాట్‌కు జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. వనే్డ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే, అతను అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే, యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ నుంచి ధోనీకి గట్టిపోటీ తప్పదు. అయితే, డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన రిషభ్ క్రీజ్‌లో నిలదొక్కుకొని, ఎక్కువ సేపు బ్యాటింగ్‌ను కొనసాగించి, భారీగా పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంది.
మిడిల్ ఆర్డర్‌లో మరో సమర్థుడైన బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు. పుణేలో జరిగిన మూడో వనే్డలో రాయుడు 22 పరుగులకే ఔటైనప్పటికీ, ఆధారపడగల ఆటగాళ్లలో అతను ఒకడనేది నిజం. గాయం నుంచి కోలుకున్న జాదవ్ జట్టులోకి వస్తే, మిడిల్ ఆర్డర్ బలం పెరుగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆశించిన స్థాయిలో ఆడలేక, వికెట్లను పారేసుకోవడంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఓపెనర్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్ విభాగానికి వస్తే, జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనాన్ని అసాధారణ రీతిలో, అందరికీ గుర్తుండేలా చాటుకున్నాడు. మూడో వనే్డలో నాలుగు వికెట్లు పడగొట్టి, విండీస్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే, సమర్థుడిగా పేరున్న భువనేశ్వర్ కుమార్ ఆ మ్యాచ్‌లో విఫలం కావడం ఫలితానే్న మార్చేసింది. డెత్ ఓవర్లలో అతను భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. భువీ మళ్లీ ఫామ్‌లోకి రాకపోతే, విండీస్ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకోవడం భారత్‌కు సులభసాధ్యం కాదు. యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ తమ స్థాయికి తగిన బౌలింగ్‌తో రాణించాలి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో నిలకడగా ఆడితేనే నాలుగో వనే్డలో విండీస్‌ను ఓడించి, సిరీస్‌పై 2-1 ఆధిక్యాన్ని సంపాదించే అవకాశం కోహ్లీ బృందానికి ఉంటుంది. ఈ దిశగా ప్రయత్నం జరుగుతుందనేది అభిమానుల నమ్మకం.
మ్యాచ్ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.