క్రీడాభూమి

మొండితనం.. అహంభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, అక్టోబర్ 29: మొండితనం, అహంభావం ఆస్ట్రేలియా క్రికెటర్ల లక్షణాలుగా మారాయని, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలకు ప్రధాన కారణం వారు అనుసరిస్తున్న వైఖరేనని ఓ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనప్పుడు, ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో, అప్పటి జట్టు కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, వీరిద్దరి సూచనలతో బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సస్పెండ్ చేయడం కూడా విదితమే. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఈ సంఘటన కారణంగానే చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తన పదవి నుంచి తప్పుకొన్నాడు. సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గేమ్స్ సదర్లాండ్, జట్టు ఫర్ఫార్మెన్స్ చీఫ్ పాట్ హోవర్డ్ సైతం నైతిక బాధ్యతగా తమతమ పదవులను వదులుకోక తప్పలేదు. కాగా, సీఏ సూచన మేరకు బాల్ ట్యాంపరింగ్ ఘటనపై విచారణ జరిపిన ఎథిక్స్ సెంటర్ (ఈసీ) సోమవారం నివేదికను సమర్పించింది. సీఏ ఉదాసీన వైఖరి కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఎవరికీ తాము జవాబుదారీ కాదన్న రీతిలో రెచ్చిపోతున్నారని విమర్శించింది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కిన మరుక్షణమే క్రికెటర్ల వైఖరిలో విపరీతమైన మార్పు వస్తున్నదని, విమర్శలకు, బాధ్యతలకు తాము అతీతులమనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఈసీ తన 145 పేజీల నివేదికలో స్పష్టం చేసింది. క్రికెటర్ల కాళ్లు నేలకు ఆనడం లేదని వ్యాఖ్యానించింది. క్రికెటర్ల వైఖరి ఈ విధంగా తయారు కావడానికి సీఏ ఉదాసీన వైఖరే ప్రధాన కారణమని తేల్చిచెప్పింది. ఏదో ఒక రకంగా గెలవాలన్న ఆలోచనే తప్ప, అది క్రీడాస్ఫూర్తితో కూడుకున్నదా లేక విరుద్ధమా అనే ఆలోచన లేకుండా ఆసీస్ క్రికెటర్లు ప్రవర్తిస్తున్నారని, బాల్ ట్యాంపరింగ్ సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ అని వివరించింది. సీఏ ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని, క్రికెటర్లకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, సమీప భవిష్యత్తులోనే ఆసీస్ క్రికెట్ రంగానికి గడ్డుకాలం తప్పదని హెచ్చరించింది.