క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: సంవత్సరంలో మొట్టమొదటి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈసారి నొవాక్ జొకోవిచ్, సిమోనా హాలెప్ టాప్ సీడింగ్స్‌ను దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో జొకోవిచ్, మహిళల విభాగంలో హాలెప్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నందున, ఈనెల 14 నుంచి 27వ తేదీ వరకూ జరిగే ఈ గ్రాండ్ శ్లామ్‌లో వీరిద్దరూ టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగనున్నారు. జొకోవిచ్‌కు చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్, యువ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్ వంటి మేటి ఆటగాళ్ల నుంచి గట్టిపోటీని ఎదుర్కోనున్నాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోవడానికి తహతహలాడుతున్న జ్వెరెవ్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో జెయింట్ కిల్లర్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. కాగా, ఇప్పటి వరకూ ఆరు పర్యాయాలు ఈ టైటిల్‌ను అందుకున్న జొకోవిచ్ ఏడోసారి విజేతగా నిలవడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పాలన్న పట్టుదలతో ఉన్నాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన లెజెండరీ ఆటగాడు ఫెదరర్ కూడా ఇదే రికార్డును తన ఖాతాలో వేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. అతను కూడా టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థినైనా మట్టికరిపించే సత్తావున్న నాదల్‌కు ఫిట్నెస్ సమస్యలు పునరావృతం కాకపోతే, అతని నుంచి ప్రత్యర్థులకు సమస్యలు తప్పవు. ఇలావుంటే, మహిళల విభాగంలో ఇప్పటికే కెరీర్‌లో 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేయనుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, మళ్లీ కెరీర్‌ను కొనసాగిస్తున్న సెరెనా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నది. చెప్పుకోదగ్గ విజయాలు కూడా దక్కలేదు. అందుకే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరడమే మొదటి లక్ష్యంగా ఎంచుకుంది. ఆతర్వాత ఒక్కో మెట్టు అధిగమించాలన్నది ఆమె వ్యూహం. అయితే, హాలెప్, ఏంజెలిక్ కెర్బర్, కరోలినా వొజ్నియాకి వంటి మేటి స్టార్లు కూడా టైటిల్‌పై కనే్నయడంతో, సెరెనా ఎంత వరకూ టైటిల్ వేటలో సఫలమవుతుందనేది అనుమానంగానే మారింది.
‘టాప్-10’ సీడింగ్స్
పురుషుల విభాగం
1. నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 2. రాఫెల్ నాదల్ (స్పెయిన్), 3. రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), 4. అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 5. కెవిన్ ఆండర్సన్ (దక్షిణాఫ్రికా), 6. మారిన్ సిలిక్ (క్రోయేషియా), 7. డొమినిక్ థియెమ్ (ఆస్ట్రియా), 8. కెయ్ నిషికొరీ (జపాన్), జాన్ ఇస్నర్ (అమెరికా), 10. కరెన్ కచనోవ్ (రష్యా).

మహిళల విభాగం
1. సిమోనా హాలెప్ (రుమేనియా), 2. ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ), 3. కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), 4. నవోమీ ఒసాకా (జపాన్), 5. స్లొయేన్ స్టెఫెన్స్ (అమెరికా), 6. ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్), 7. కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 8. పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 9. కికీ బెర్టెన్స్ (నెదర్లాండ్స్), 10. డారియా కసట్కినా (రష్యా).
టాప్ సీడ్‌గా ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగుపెడుతున్న నొవాక్ జొకోవిచ్ మొదటి రౌండ్‌లో క్వాలిఫయర్‌ను ఢీకొననున్నాడు. గత ఏడాది అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రపంచ ర్యాంకింగ్‌ను మెరుగు పరచుకుంటూ అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన జొకోవిచ్‌కు రెండో రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు జో విల్‌ఫ్రైడ్ సొంగా ఎదురయ్యే అవకాశాలున్నాయి. లెజెండరీ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు మొదటి రౌండ్‌లో 99వ ర్యాంక్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ ప్రత్యర్థి కానున్నాడు. ఊహించిన ఫలితాలే వెల్లడైతే, సెమీ ఫైనల్‌లో అతను రాఫెల్ నాదల్‌తో పోటీ పడాల్సి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మహిళల విభాగంలో, 24వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా విలియమ్స్‌కు మొదటి రౌండ్‌లో జర్మనీ క్రీడాకారిణి టటానా మరియా నుంచి పోటీ తప్పదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్లినా, నాలుగో రౌండ్‌లో టాప్ సీడ్ సిమోనా హాలెప్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రీ క్వార్టర్స్‌లో యుగెనీ బుచార్డ్ ఆమెకు ఎదురవుతుంది. మొత్తం మీద మహిళల విభాగంలో మిగతా క్రీడాకారిణుల కంటే సెరెనా మాత్రమే సంక్లిష్టమైన డ్రాను ఎదుర్కొంటున్నది.