క్రీడాభూమి

ధోనీ సేనకు నిరాశే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 10: ఈసారి ఐపిఎల్‌లో అరంగేట్రం చేసిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ నాకౌట్ చేరే అవకాశాలకు తెరపడింది. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన అత్యంత కీలక మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైన మహేంద్ర సింగ్ ధోనీ సేనకు నిరాశే మిగిలింది. ఆడం జంపా ఆరు వికెట్లు పడగొట్టినా, జార్జి బెయిలీ (34), ధోనీ (30) చివరి వరకూ ప్రయత్నించినా పుణెను గటెక్కించలేకపోయారు. ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేయగా, రైజింగ్ పుణె 8 వికెట్లు కోల్పోయి 133 పరుగుల వద్ద నిలిచిపోయింది.
వార్నర్ విఫలం
సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని, కేవలం 11 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న అతను రైజింగ్ పుణెపై విఫలం కావడం వరుసగా ఇది రెండోసారి. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అశోక్ దిండా బౌలింగ్‌లో డకౌటైన వార్నర్ మ్యాచ్‌లో రుద్ర ప్రతాప్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడనుకున్న శిఖర్ ధావన్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను 27 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 33 పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో సౌరభ్ తివారీకి చిక్కాడు. ఈరెండు వికెట్లు కూలిన తర్వాత సన్‌రైజర్స్‌ను కట్టడి చేసే బాధ్యతను ఆడం జంపా స్వీకరించాడు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించే యువరాజ్ సింగ్ (23)ను సౌరభ్ తివారీ క్యాచ్ పట్టగా అతను అవుట్ చేశాడు. మరో విధ్వంసకర బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్‌సన్ 37 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లతో 31 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లోనే రజత్ భాటియాకు దొరికాడు. మోజెన్ హెన్రిక్స్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో రజత్ భాటియా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతను దీపక్ హూడా (14), నమన్ ఓఝా (7), భువనేశ్వర్ కుమార్ (1) వికెట్లను పడగొట్టాడు. ఫలితంగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులకు పరిమితమైంది. జంపా 4 ఓవర్లు బౌల్ చేసి, 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
సున్నాకే తొలి వికెట్
ఈ మ్యాచ్‌లో గెలిస్తే తప్ప నాకౌట్ ఆశలు లేని రైజింగ్ పుణె 138 పరుగుల సాధారణమైన లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగింది. అయితే, మొదటి ఓవర్‌లో, పరుగుల ఖాతాను తెరవడానికి ముందే ఆజింక్య రహానే వికెట్‌ను కోల్పోయింది. ఈ సీజన్‌లో చక్కటి బ్యాటింగ్‌తో రాణిస్తున్న రహానే మూడు బంతులు ఎదుర్కొని, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నమన్ ఓఝాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఉస్మాన్ ఖాజా 11 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 19 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోవడంతో, రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రమోషన్ ఇచ్చిన కెప్టెన్ ధోనీ అతనిని సెకండ్ డౌన్‌లోనే బ్యాటింగ్‌కు పంపాడు. అయితే, తాడోపేడో తేల్చుకునే విధంగా బౌలర్లపై విరుచుకుపడతాడనుకున్న అశ్విన్ తన ఖాతాను తెరవడానికి ఏడు బంతులు మింగేశాడు. జార్జి బెయిలీ రన్‌రేట్‌ను పెంచేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి కొంత మెరుగు పడింది. పదో ఓవర్ రెండో బంతికి మస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో అశ్విన్ సింగిల్ చేయడంతో రైజింగ్ పుణె స్కోరు 50 పరుగులకు చేరింది. స్థిరంగా ఆడుతున్నట్టు కనిపించిన జార్జి బెయిలీ 40 బంతుల్లో 34 పరుగులు చేసి, మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లో ఆశిష్ నెహ్రా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. బెయిలీ వెనుదిరగడంతో ఏకాగ్రత కోల్పోయిన అశ్విన్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బరీందర్ శరణ్ బౌలింగ్‌లో నమన్ ఓఝాకు దొరికాడు. అతనికి ఐపిఎల్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ముంబయి ఇండియన్స్‌పై అతను 23 పరుగులు చేశాడు. కాగా, టి-20 అశ్విన్ అత్యధిక స్కోరు 46 పరుగులు. 2013లో జరిగిన చాంపియన్స్ లీగ్‌లో చెన్నై తరఫునే అతను ఆ స్కోరును సాధించాడు. కాగా, సౌరభ్ తివారీ 11 పరుగులకే, ఆశిష్ నెహ్రా బౌలింగ్‌ల శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోనీ, తిసర పెరెరా క్రీజ్‌లో ఉండగా, 16.4 ఓవర్లలో రైజింగ్ పుణె 100 పరుగుల మైలురాయిని చేరింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించగా, చివరి రెండు ఓవర్లలో విజయానికి పుణె రైజింగ్ 22 పరుగుల దూరంలో నిలిచింది. 19వ ఓవర్‌ను బౌల్ చేసిన ముస్త్ఫాజుర్ రహ్మాన్ ఎనిమిది పరుగులిచ్చాడు. దీనితో పుణె రైజింగ్‌కు చివరి ఓవర్‌లో 14 పరుగులు అవసరమయ్యాయి. అనుభవజ్ఞుడైన ఆశిష్ నెహ్రాపై నమ్మకం ఉంచిన సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్ చివరి ఓవర్‌ను అతనికి అప్పగించాడు. మొదటి రెండు బంతుల్లో రెండు పరుగులిచ్చిన నెహ్రా మూడో బంతికి పెరెరా వికెట్ కూల్చాడు. మోజెస్ హెన్రిక్స్ క్యాచ్ అందుకోగా అవుటైన పెరెరా 13 బంతుల్లో 17 పరుగులు చేశాడు. కాగా, నాలుగో బంతిని ధోనీ సిక్స్‌గా మార్చాడు. ఐదో బంతిలో ఒక పరుగు చేసిన ధోనీ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అతను 20 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివరి బంతిని ఆడిన ఆడం జంపా వికెట్‌కీపర్ నమన్ ఓఝాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సన్‌రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.
చాలా అంశాలు తమకు సహకరించలేదని మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ రైజిం గ్ పుణె కెప్టెన్ ధోనీ వాపోయాడు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగామని, అయతే, బ్యాటింగ్‌లో తడబడడంతో ఓటమి తప్పలేదని అన్నాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ, చివరి వరకూ పోరు ఉత్కంఠ భరితంగా సాగిందన్నాడు. పుణె లెగ్ స్పిన్నర్ జంపా అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. అదే విధంగా తమ జట్టు బౌలర్లు కూడా అసాధారణ పాత్ర పోషించడంతో తమకు విజయం సాధ్యమైందని అన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 (శిఖర్ ధావన్ 33, కేన్ విలియమ్‌సన్ 31, యువరాజ్ సింగ్ 23, ఆడం జంపా 6/19).
రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 (జార్జి బెయిలీ 34, అశ్విన్ 29, మహేంద్ర సింగ్ ధోనీ 30, ఆశిష్ నెహ్రా 3/29).

--
ఒక ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన రెండో బౌలర్‌గా ఆడం జంపా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సొహైల్ తన్వీర్ 14 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. జంపా ఈ మ్యాచ్‌లో 16 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు.
--
సన్‌రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్ 33, డేవిడ్ వార్నర్ 11 చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరి కలిసి చేసిన పరుగులు 44 మాత్రమే. ఈ సీజన్‌లో వీరు ఈ విధంగా తక్కువ పరుగులు చేయడం ఇది రెండోసారి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరి పరుగులు 19 మాత్రమే.
--
చిత్రం ఆరు వికెట్లు పడగొట్టిన రైజింగ్ పుణె బౌలర్ ఆడం జంపా